calender_icon.png 26 December, 2024 | 3:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జంబో జట్టుకు స్వస్తి

26-12-2024 02:36:02 AM

  1. మీడియం సైజులోనే పీసీసీ కార్యవర్గం ?
  2. పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ నేతృత్వంలో కసరత్తు
  3. సీఎం, సీనియర్లు, మంత్రుల నుంచి సలహాల స్వీకరణ
  4. నిబద్ధత గల నేతలకు ప్రాధాన్యం
  5. కొత్త సంవత్సరంలో కొత్త కార్యవర్గ నియామకం
  6. కాంగ్రెస్ అధిష్ఠానం ఆమోదం తెలపడమే ఆలస్యం

హైదరాబాద్, డిసెంబర్ 25 (విజయక్రాంతి): ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ) రాష్ట్ర కార్యవర్గ కూర్పుపై అధిష్ఠానం కసరత్తు చివరి దశకు చేరుకున్నది. ఈ కసరత్తు తుదిదశకు చేరుకుందని, కొత్త సంవత్సరంలో కొత్త కమిటీని  ప్రకటించే అవకాశం ఉన్నది.

నూతన కార్యవర్గ కూర్పుపై సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులతో పాటు జిల్లాలవారీగా ముఖ్యనేతలతో పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ ఇప్పటికే భేటీ అయ్యారు. పలు దఫాలుగా సమావేశాలు నిర్వహించి పార్టీ వర్గాల నుంచి సలహాలు, సూచనలు తీసుకున్నారు. కొత్త జాబితాకు ఏఐసీసీ ఆమోదం లభించగానే నూతన కార్యవర్గ సభ్యుల జాబితా విడుదల కానున్నట్లు తెలిసింది.

ఈ సారి పీసీసీ జట్టు జంబోలా కాకుండా మీడియం సైజ్‌లో ఉంటుందని సమాచారం. చివరి సారి పీసీసీ కూర్పు పార్టీ ప్రతిపక్షంలో ఉందని, పార్టీ అధికారంలోకి వచ్చాక నూతన కార్యవర్గాన్ని నియమించాలనే ఆలోచనతో అధిష్ఠానం ఉంది. రేవంత్‌రెడ్డి పీసీసీగా ఉన్నప్పుడు ఐదుగురు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లతో పాటు మొత్తం 30 మంది వరకు పని చేశారు.

ప్రస్తుతం పీసీసీ ఉపాధ్యక్షుల సంఖ్యను 10 మందికే పరిమితం చేయాలనే ఆలోచనతో పార్టీ ఉన్నట్లు తెలిసింది. అలాగే ప్రస్తుతం ప్రధాన కార్యదర్శులు 60 మంది, కార్యదర్శలు, అధికార ప్రతినిధులు, అనుబంధ సంఘాల కార్యవర్గం సంఖ్య వందల్లోనే ఉంది. పార్టీ పదవుల్లో ఉన్నవారిలో ఇప్పటికే ఎంతోమందికి నామినేటెడ్ పోస్టులు దక్కాయి.

కొంద రు పార్టీ నుంచి టిక్కెట్లు దక్కించుకుని ఎమ్మెల్యేలు, ఎంపీలుగా ఎన్నికల్లో గెలుపొందారు. తాజాగా పీసీసీ కార్యవర్గ కూర్పుపై అధిష్ఠానం దృష్టిసారించింది. కమిట్‌మెంట్‌తో పని చేస్తున్న కొత్తవారికి అవకాశం ఇవ్వాలని ఆలోచనలో పార్టీ ఉన్నట్లు తెలిసింది.

వర్కింగ్ ప్రెసిడెంట్ పదవులపై గురి.. 

పీసీసీ అధ్యక్షుడిగా మహేశ్‌కుమార్‌గౌడ్  బాధ్యతలు స్వీకరించ ముందు ఆయన పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా పని చేశారు. ఆయనతో పాటు మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి,  మాజీ మంత్రి గీతారెడ్డి, మాజీ ఎంపీలు అంజన్‌కుమార్ యాదవ్, అజారుద్దీన్ సైతం కొనసాగారు. అధిష్ఠానం కొత్తగా మరో ఐదుగురు నేతలను వర్కింగ్ ప్రెసిడెంట్స్‌గా నియమిం చాలనే యోచనలో ఉంది.

ప్రస్తుతం  వర్కింగ్ ప్రెసెండెట్స్‌గా కొత్తవారికి అవకాశం కల్పిస్తారనే పార్టీ వర్గాల్లో నడుస్తున్నది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని దక్కించుకునేందుకు భువన గిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లు రవి,  ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిన్‌రెడ్డితో పాటు మరో ఐదారుగురు ఎమ్మెల్యేలు పావులు కదుపుతున్నట్లు తెలిసింది.

ప్రస్తుత పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ బీసీ వర్గానికి చెందిన నేత కాగా, వర్కింగ్ ప్రెసిడెంట్ పదవులను ఎస్సీ, ఎస్టీ, మైనార్టీతో పాటు ఓసీ వర్గం నుంచి ఒక్కొక్కరికీ అవకాశం ఇస్తారనే చర్చ జరుగుతోంది.

పీసీసీ చీఫ్‌పై గురి

రాష్ట్ర విభజన తర్వాత మొదటి పీసీసీ అధ్యక్షుడిగా పొన్నాల లక్ష్మయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని నియమితులయ్యారు. పొన్నాల తర్వాత పీసీసీ అధ్యక్షుడిగా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మల్లు భట్టివిక్రమార్క బాధ్యతలు స్వీకరించారు. రేవంత్‌రెడ్డి టీడీపీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరగానే పార్టీ అధిష్ఠానం ఆయనకు పీసీసీ అధ్యక్ష పదవి కట్టబెట్టింది.

తర్వాత భట్టివిక్రమార్కను సీఎల్పీ నేతగా నియమించింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిని ముఖ్యమంత్రి పదవి వరించింది. ఆ తర్వాత పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన మహేశ్‌కుమార్‌గౌడ్‌కు అధిష్ఠానం పీసీసీ చీఫ్ పగ్గాలను అప్పగించింది. దీంతో ఒక్కసారి వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని చేజిక్కించుకుంటే భవిష్యత్‌లో పీసీసీ చీఫ్ అయ్యే అవకాశం లభిస్తుందని పార్టీ నేతలు ఆశాభావంతో ఉన్నారు.