calender_icon.png 20 September, 2024 | 7:57 AM

ఉద్యమాల ‘జిట్టా’.. నిను మరవదు భువనగిరి గడ్డ!

07-09-2024 12:00:00 AM

  1. అనారోగ్యంతో తుదిశ్వాస విడిచిన బాలకృష్ణారెడ్డి 
  2. ప్రజాసమస్యలపై అలుపెరగని పోరాటం చేసిన నేత 
  3. మలిదశ తెలంగాణ ఉద్యమంలోనూ ముఖ్యభూమిక 
  4. స్వగ్రామం బొమ్మాయిపల్లిలో అంత్యక్రియలు 
  5. ప్రముఖుల నివాళి

యాదాద్రి భువనగిరి, సెప్టెంబర్ 6 (విజయక్రాంతి): మలిదశ తెలంగాణ ఉద్యమ నేత జిట్టా బాలకృష్ణారెడ్డి (52) కన్నుమూశారు. కొంతకాలం నుంచి తీవ్ర అనారోగ్యం తో బాధపడుతున్న ఆయన కొన్నిరోజులు ఆసుపత్రిలో చికిత్స పొందారు. పరిస్థితి పూర్తిగా విషమించడంతో తాను పుట్టిన భువనగిరి గడ్డపైనే తుదిశ్వాస వదలాలని ఆయన కుటుంబ సభ్యులను కోరారు. ఆ కోరిక మేరకు ఆయన్ను కుటుంబ సభ్యులు వెంటిలేటర్‌పై ఉంచే భువనగిరిలోని బొమ్మాయిపల్లి ఫాంహౌజ్‌కు తరలించారు. అక్కడ ఆయన తుదిశ్వాస విడిచారు.

బాలకృష్ణారెడ్డి 1972లో భువనగిరి మండలం బొమ్మాయిపల్లిలో జిట్టా బాల్‌రెడ్డి, రాధమ్మ దంపతులకు జన్మించారు. 1987లో బీబీనగర్ జడ్పీ హైస్కూల్‌లో పదో తరగతి పూర్తి చేశారు. 1989లో భువనగిరి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. 1993లో ఎల్బీ నగర్ డీవీఎం డిగ్రీ, పీజీ కళాశాలలో బీకాం పూర్తిచేశారు. స్వామి వివేకానందుడి స్ఫూర్తితో ఆయన 1992లో వివేవకానంద యువజన సంఘం స్థాపించారు.  అలా 10  యువజన సంఘాలను ఒకే వేదికపై తీసుకువచ్చారు. 

ప్రజాఉద్యమాల మధ్యే..

తొలినుంచి ఆయన ప్రజల మధ్యే ఉన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజలను ఫ్లోరైడ్ రక్కసి నుంచి విముక్తి కల్పించాలని ఎన్నో ఉద్యమాలు చేశారు. రూ.3.5 కోట్ల సొంత డబ్బుతో 110 గ్రామాల్లో వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేశారు. మూసీని ప్రక్షాళన కోసం 2005లోనే పాదయాత్ర చేశారు. ఆయన పోరాట ఫలితంగానే రూ.350 కోట్లతో నాటి ప్రభుత్వం మూసీ శుద్ధిప్లాంట్లకు ముందుకొచ్చింది. బీబీనగర్ వద్ద నిమ్స్ నిర్మాణానికి బాటలు వేశారు. నిర్మాణంలో జాప్యంపై నాడు అసెంబ్లీ ముట్టడి, నిరాహార దీక్షలు చేపట్టారు. మూసీ జలాలు మళ్లించాలని రైతులతో కలిసి పాతయాత్రలు నిర్వహించారు. పోరాట ఫలితంగానే బునాదిగాని ,పిల్లాయపల్లి, ధర్మారెడ్డి కాల్వల ద్వారా వేలాది ఎకరాలకు ప్రస్తుతం సాగునీరు అందుతోంది.

తెలంగాణ ప్రజల సాం సృతిక వారసత్వాన్ని గల్లి నుంచి డిల్లీ వరకు చాటిచెప్పడానికి ఆయన అనేక ప్రదర్శనలు, సంబురాలు నిర్వహించారు. 2007లో భువనగిరి చ్‌వనగిరి లేజర్ లైటింగ్ షో ఏర్పాటు చేశారు. 2003లో టీఆర్‌ఎస్‌లో చేరి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. పార్టీ అధినేత కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడిగా కొనసాగారు. ఆ పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా మూడు పర్యాయాలు కొనసాగారు. కానీ ఆయన చట్టసభల్లో పోటీ చేసేందుకు పార్టీ నుంచి అవకాశం రాలేదు. 2004లో ఆయన భువనగిరి అసెంబ్లీ టికెట్ ఆశించగా, అది నెరవేరలేదు. ఆ సీటు పార్టీ సీనియర్ నేత ఆలె నరేంద్రకు దక్కింది. మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఆయన కీలకం గా పనిచేశారు.

2009లో మహాకూటమి ఒప్పందంలో భాగంగా టీఆర్‌ఎస్ భువనగిరి టికెట్‌ను నాటి సిట్టింగ్ టీడీపీ ఎమ్మెల్యేకు కేటాయించడంతో జిట్టాకు అవకాశం దక్కలేదు. తర్వాత జిట్టా ఇండిపెండెంట్‌గా పోటీ చేశారు. కేవలం 6 వేల ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. ఆ తర్వాత జిట్టా టీఆర్‌ఎస్‌కు దూరమయ్యారు. కాంగ్రెస్‌లో పార్టీలో చేరారు. దివంగత ముఖ్యమంత్రి వై ఎస్ రాజశేఖర్‌రెడ్డి మరణం తర్వాత ఆయన కుమారుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తెలంగాణ వ్యతిరేక విధానాలు నచ్చక జిట్టా యువ తెలంగాణ పార్టీని స్థాపించారు. పార్టీ ని తర్వాత బీజేపీలో విలీనం చేశారు. తర్వాత బీజేపీకీ దూరమయ్యారు. మళ్లీ కాంగ్రెస్‌కు దగ్గరయ్యారు.అనేక పరిణామాల తర్వాత 2023లో కేసీఆర్ ఆహ్వానం మేరకు తిరిగి బీఆర్‌ఎస్‌లో చేరారు. ఆ తర్వాత అనారోగ్య కారణాలతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చివరకు ఆయన మృత్యువుతో పోరాటం చేసి ఓడిపోయారు.

అశ్రునయనాల మధ్య అంత్యక్రియలు

భువనగిరి పట్టణ శివారులోని బొమ్మాయిపల్లిలో అశ్రునయనాల మధ్య జిట్టా బాలకృష్ణారెడ్డి అంత్యక్రియలు జరిగాయి. ఆయన ఫాంహౌజ్ నుంచి స్వగ్రామం బొమ్మాయిపల్లి  వరకు వేలాది మంది అభిమానుల మధ్య అంతిమయాత్ర సాగింది. ఆయన కుమారుడు జిట్టా వివేకానందరెడ్డి చితికినిప్పు అంటించారు. జిట్టా పార్థీవ దేహానికి మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి, ఎమ్మె ల్సీ ప్రొఫెసర్ కోదండరామ్, ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, మాజీ మంత్రి తన్నీరు హరీష్‌రావు, ఎమ్మెల్యే జగదీష్‌రెడ్డి, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ, మాజీ స్పీకర్  మధుసూదనాచారి, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, పలువురు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు నివాళి అర్పించా రు. మరోవైపు జిట్టా బాలక్రిష్ణారెడ్డికి ప్రభు త్వం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని ఆయన కొంతసేపు అభిమానులు, ఉద్యమకారులు శుక్రవారం భువనగిరిలో ఆందోళన చేపట్టారు.

ప్రముఖుల సంతాపం

జిట్టా బాలకృష్ణారెడ్డి మృతికి కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్, మంత్రి పొన్నం ప్రభాకర్, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, శాసనసభాపతి గడ్డం ప్రసాద్‌కుమార్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు, ఎమ్మెల్యే వేముల వీరేశం, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ వేర్వేరుగా సంతాపం తెలిపారు.

మిత్రుడిని కోల్పోయాను: సీఎం రేవంత్

జిట్టా బాలకృష్ణారెడ్డి నాకు సన్ని హుతుడు. నేను మంచి మిత్రుడిని కోల్పోయాను. ఆయన మరణం దిగ్భ్రాంతికి గురిచేసింది. ఉద్యమ సమయంలో ఆయన యువతను ఐక్యం చేశారు. తెలంగాణ ఉద్యమం లో క్రియాశీలక పాత్ర పోషించారు. జిట్టా బాలకృష్ణారెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తు న్నా. వారి కుటుంబ సభ్యలుకు ప్రగా ఢ సానుభూతిని తెలియజేస్తున్నా.

ఉద్యమంలో కీలకపాత్ర: కేసీఆర్

తెలంగాణ ఉద్యమ కారుడు జిట్టా బాలకృష్ణారెడ్డి నన్ను బాధించింది. తెలంగాణ సాధనకోసం జిట్టా ఎంతో పనిచేశారు. స్వరాష్ట్రం కోసం జరిగిన ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించారు. ఆయన మరణం నాకు దిగ్భ్రాంతి కలిగించింది. శోకతప్తులైన ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా.