calender_icon.png 17 April, 2025 | 10:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జర్నలిస్టుల సమస్యపై రాజ్యసభలో ప్రస్తాపన

28-03-2025 12:09:58 AM

జర్నలిస్టుల రైల్వేపాస్‌ల పునరుద్ధరణను ప్రస్తావించిన ఎంపీ వద్దిరాజు 

ఖమ్మం, మార్చి 27( విజయక్రాంతి ):జర్నలిస్టుల సమస్యలను ఎంపీ వద్దిరాజు రవిచంద్ర రాజ్యసభ దృష్టికి గురువారం తీసుకెళ్లారు. రైల్వేలో కరోనా ముందు వరకు జర్నలిస్టులకు ఇచ్చిన 50 శాతం రాయితీని పునరుద్ధరించాల్సిందిగా ఎంపీ కోరారు. ఈ మేరకు టీడబ్ల్యూజేఎఫ్ ఈనెల 24వ తేదీన రాజ్యసభ, లోక్ సభ ఎంపీలు వద్దిరాజు రవిచంద్ర, రామసహాయం రఘురాంరెడ్డిలకు ఆన్ లైన్ లో వినతిపత్రాలు పంపింది.

ఈ విషయమై పార్లమెంటులో ప్రస్తావించడంతో పాటు రైల్వే శాఖ మంత్రి దృష్టికి సైతం తీసుకువెళ్లాల్సిందిగా టీడబ్ల్యూజేఎఫ్ ఖమ్మం జిల్లా కమిటీ ఫోన్ లో విన్నవించింది. దీనిపై ఇరువురు ఎంపీలు సానుకూలంగా స్పందించారు. కచ్చితంగా పార్లమెంటు దృష్టికి జర్నలిస్టుల రైల్వే పాస్ ల విషయాన్ని తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు వద్దిరాజు రవిచంద్ర రాజ్యసభలో గురువారం ప్రస్తావించారు.

ఆ వెంటనే రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ కు సైతం వినతి పత్రం అందజేశారు. గతంలో అక్రిడేటెడ్ జర్నలిస్టులకు రైల్వేలో 50 శాతం రాయితీపై ప్రయాణించే సౌకర్యం ఉండేదని, దానిని కోవిడ్ లాక్ డౌన్ సందర్భంగా నిలిపివేశారని తెలిపారు. తిరిగి రైలు రాయితీని పునరుద్ధరించాలని  కోరారు. జర్నలిస్టులలో చాలా వరకు తక్కువ,మధ్య తరగతి ఆదాయ వర్గాలకు చెందిన వారేనని,తమ విధి నిర్వహణలో భాగంగా ప్రతినిత్యం రైళ్లలో ప్రయాణాలు చేస్తుంటారన్నారు.

కోవిడ్ కారణంగా ఎత్తేసిన రాయితీ పథకాన్ని తిరిగి ప్రవేశపెడుతూ వారిపై ఆర్థిక భారం పడకుండా సాయం చేయాల్సిందిగా రైల్వే మంత్రిత్వ శాఖను కోరారు. రైలు ప్రయాణాల సందర్భంగా గతంలో మాదిరిగా 50 శాతం రాయితీని పునరుద్ధ రించాల్సిందిగా పాత్రికేయులు,వారి సంఘాలు మూడేళ్లుగా కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేస్తుండడాన్ని ఈ సందర్భంగా ఎంపీ వద్దిరాజు గుర్తు చేశారు.

ప్రజాస్వామ్య వ్యవస్థలో నాలుగో స్థంభంగా సమాజానికి తమ విలువైన సేవలందిస్తున్న జర్నలిస్టులకు రైల్వే టిక్కెట్లలో 50% రాయితీ కల్పించడమనేది సమంజసం, సముచితమని ఎంపీ రవిచంద్ర చెప్పారు. అలాగే, రాజ్యసభలో మాట్లాడిన తర్వాత ఎంపీ వద్దిరాజు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ను పార్లమెంటులోని ఆయన ఛాంబర్ లో కలిసి ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. ఆయన వెంటనే సానుకూలంగా స్పందిస్తూ అధికారులకు తగు ఆదేశాలిచ్చారు.