calender_icon.png 25 December, 2024 | 1:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రపంచంపై ఏసుక్రీస్తు ప్రభావం

25-12-2024 12:17:45 AM

శాసనమండలి ప్రతిపక్షనేత మధుసుదనాచారి

హైదరబాద్, డిసెంబర్ 24 (విజయక్రాంతి): ప్రపంచ మానవాళిని ప్రభావితం చేసిన మహనీయుడు ఏసుక్రీస్తు అని, ఆయన ప్రభావం ప్రపంచంపై ఎంతో ఉందని శాసనమండలి ప్రతిపక్షనేత సిరికొండ మధుసుదనా చారి పేర్కొన్నారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు.

తెలంగాణ ఫుడ్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మెడే రాజీవ్‌సాగర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు మధుసుదనాచారి హాజరై కేక్ కట్‌చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్వరాష్ట్రంలో కేసీఆర్ క్రిస్మస్‌ను రాష్ర్ట పండుగగా గుర్తించి రెండు రోజులు సెలవులు ప్రకటించారని గుర్తుచేశారు.

క్రిస్మస్‌కు దుస్తులు పంపిణీ చేయడంతోపాటు ఎల్బీ స్టేడియంతోపాటు, రాష్ర్టంలోని పల్లెపల్లెన విందు కార్యక్రమం ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. క్రిస్టియన్లకు ఉప్పల్ భగాయత్‌లో రెండు ఎకరాల స్థలం కేటాయించడంతోపాటు భవన నిర్మాణానికి రూ.10 కోట్లు కేటాయించారని తెలిపారు. క్రైస్తవుల సమాధుల కోసం 45 ఎకరాలకుపైగా స్థలాన్ని కేసీఆర్ ప్రభుత్వం మంజూరు చేసినట్టు గుర్తుచేశారు.

మెడే రాజీవ్‌సాగర్ మాట్లాడుతూ.. క్రిస్టియన్ల మేలు కోసం కేసీఆర్ ఎంతగానో తపించారని, ఎల్బీ స్టేడియంలో 15 నుంచి 20 వేల మందికి క్రిస్మస్ విందు బీఆర్‌ఎస్ పాలనలో మొదలైందన్నారు. ఇటీవల ఎల్బీస్టేడియంతో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి సహపంక్తి భోజనం చేయకుండానే వెళ్లిపోవడం క్రిస్టియన్లను బాధించిందని చెప్పారు.

క్రిస్టియన్ భవన్‌కు కేసీఆర్ నిధులు కేటాయించినా, ఈ ప్రభుత్వంలో కనీసం ఒక ఇటుక కూడా వేయలేదని మండిపడ్డారు. కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో క్రైస్తవులకు ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేరలేదని, హామీల అమలుకు కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్‌రెడ్డి, ఖైరతాబాద్ బీఆర్‌ఎస్ నేత మన్నె గోవర్ధన్‌రెడ్డి సహా పలువురు  పార్టీ నేతలు పాల్గొన్నారు.