మద్రాస్ (ప్రస్తుతం చెన్నై) లో 1906లో తలెత్తిన తీవ్ర ఆర్థిక సంక్షోభం కారణంగా మూడు బ్రిటిష్ బ్యాంక్‌లు దివాలా తీసాయి. మూడింటిలో పటిష్టమైనదిగా పేరున్న అర్బుత్‌నాట్ బ్యాంక్ పతనం నేపథ్యంలో పుట్టిందే ఇండియన్ బ్యాంక్. అర్భుత్‌నాట్ బ్యాంక్ కేసును వాదించిన ప్రముఖ లాయర్ కృష్ణస్వామి అయ్యర్ ఇండియన్ బ్యాంక్ స్థాపనకు బీజం వేశారు.
రామస్వామి చెట్టియార్‌తో సహా మరికొంతమంది చెట్టియార్ల బృందం మద్దతుతో 1907లో ఇండియన్ బ్యాంక్ నెలకొన్నది. ఇప్పుడది ప్రభుత్వ రంగ బ్యాంక్‌ల్లో ఆస్తుల రీత్యా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, కెనరా బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ ఇండియాల తర్వాత ఏడవ పెద్ద బ్యాంక్‌గా కొనసాగుతున్నది.
ఇండియన్ బ్యాంక్ 1932లోనే కొలంబోలో శాఖను ఏర్పాటు చేయడం ద్వారా విదేశాలకు విస్తరించడం ప్రారంభించింది. 1960 తర్వాత దేశంలో పలు ప్రైవేటు బ్యాంక్‌లను టేకోవర్ చేయడం ద్వారా 1969లో కేంద్ర ప్రభుత్వం జాతీయం చేసే సమయానికి శాఖల సంఖ్య 210కి చేరుకున్నది.
అటుతర్వాత 1978 నుంచి శరవేగంగా దేశ, విదేశాల్లో శాఖల్ని విస్తరించింది. ఇండియన్ బ్యాంక్‌కు ఇండ్‌బ్యాంక్ మర్చెంట్ బ్యాంకింగ్ సర్వీసెస్, ఇండ్‌బ్యాంక్ హౌసింగ్ సబ్సిడరీలు ఉన్నాయి.
రూ.67 వేల కోట్ల మార్కెట్ విలువ
స్టాక్ మార్కెట్‌లో చురుగ్గా ట్రేడయ్యే ఇండియన్ బ్యాంక్ ప్రస్తుత మార్కెట్ విలువ రూ.67,146 కోట్లు. గడిచిన మూడేండ్లలో ఇండియన్ బ్యాంక్ షేరు 165 శాతం పెరిగింది.
అలహాబాద్ బ్యాంక్ విలీనం
పీఎస్‌యూ బ్యాంక్‌ల సంఖ్యను తగ్గించే క్రమంలో కేంద్రం ప్రతిపాదించిన విలీన ప్రక్రియలో భాగంగా 2020లో ఇండియన్ బ్యాంక్‌లో దేశంలో అత్యంత పురాతనమైన, 1,865వ సంవత్సరంలో యూరోపియన్లు నెలకొల్పిన అలహాబాద్ బ్యాంక్‌ను విలీనం చేశారు. దీనితో ఇండియన్ బ్యాంక్ 7వ పెద్ద పీఎస్‌యూ బ్యాంక్‌గా ఆవిర్భవించింది.
5,800కుపైగా శాఖలు.. రూ.7.93 లక్షల కోట్ల ఆస్తులు
ఇండియన్ బ్యాంక్‌కు 2024 జూన్‌నాటికి దేశవ్యాప్తంగా 5,846 శాఖలు ఉన్నాయి. డిపాజిట్ మెషిన్లతో సహా 5,093 ఏటీఎంలను నిర్వ హిస్తున్నది. 40,250కుపైగా ఉద్యోగు లు ఉన్నారు. ఈ బ్యాంక్ ఆస్తుల పరిమాణం తాజా గణాంకాల ప్రకారం రూ.7,92,619 కోట్లు. ఈ బ్యాంక్‌లో కేంద్ర ప్రభుత్వానికి 73.84 శాతం వాటా ఉన్నది. ఇండియన్ బ్యాంక్‌కు ప్రస్తుతం శాంతిలాల్ జైన్ ఎండీ, సీఈవోగా వ్యవహరిస్తున్నారు.