09-04-2025 01:09:09 AM
సీపీఐ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం
ఖమ్మం, ఏప్రిల్ 8 ( విజయక్రాంతి ):-ప్రజలపై భారాలు మోపుతూ బిజెపి ప్రభుత్వం కార్పొరేట్ల సేవలో తరిస్తుందని సిపిఐ జాతీయ సమితి సభ్యులు బాగం హేమంతరావు ఆరోపించారు. మోడీ పేద, మధ్యతరగతి ప్రజలను విస్మరించి పాలన చేస్తున్నారని ప్రజల జీవన స్థితిగతులను దృష్టిలో ఉంచుకుని పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను తక్షణం ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెంపును నిరసిస్తూ సిపిఐ ఆధ్వర్యంలో స్థానిక బైపాస్ రోడ్డులో మంగళవారం కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. సిపిఐ కార్యాలయం నుండి ప్రదర్శనగా వచ్చిన కార్యకర్తలు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధరల పెంపుకు నిరసనగా నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా హేమంతరావు మాట్లాడుతూ దేశంలో ఆర్థిక అంతరాలు పెరిగి పేదవాడు బతకలేని పరిస్థితికి వచ్చిన స్థితిలో ప్రభుత్వం గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలను పెంచడం మూలుగుతున్న నక్కపై తాటిపండు పడ్డ సామెతను గుర్తుకు తెస్తుందన్నారు. ఇప్పటికే ప్రభుత్వ వైఖరి కారణంగా గడిచిన నాలుగేళ్లలో ప్రజల కొనుగోలు శక్తి సన్నగిల్లిందని అన్నారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి దండి సురేష్, రాష్ట్ర సమితి సభ్యులు జమ్ముల జితేందర్రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు శింగు నర్సింహారావు, పోటు కళావతి, మహ్మద్ సలాం, తాటి వెంకటేశ్వరరావు, సిహెచ్ సీతామహాలక్ష్మి, మిడికంటి -వెంకటరెడ్డి, రావి శివరామకృష్ణ, మేకల శ్రీనివాస్, ప్రజా సంఘాల నాయకులు తాటి నిర్మల, యానాలి సాంబశివరెడ్డి, ఇటికాల రామకృష్ణ, మద్దోజు శ్రావణ్, సైదా, జ్వాలా నర్సింహారావు తదితరులు పాల్గొన్నారు.