calender_icon.png 22 April, 2025 | 5:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెంచిన గ్యాస్ ధరను తగ్గించాలి

09-04-2025 06:14:13 PM

సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు ముత్యాల విశ్వనాథం...

పాల్వంచ (విజయక్రాంతి): అధికారం చేపట్టిన నుంచి ధరలు అమాంతం పెంచుకుంటూ పోతున్న కేంద్ర ప్రభుత్వానికి దేశ ప్రజలు బుద్ధి చెప్పాలని, పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు ముత్యాల విశ్వనాథం డిమాండ్ చేశారు. మంగళవారం రాత్రి పట్టణ పరిధిలోని ఒడ్డుగూడెం సీపీఐ శాఖ మహాసభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. దేశ ప్రధాని నరేంద్ర మోడీ తను ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రోజు నుండి పేదోడి కష్టార్జితాన్ని తన మిత్రులైన ఆదానీ అంబానీ లాంటి అనేక కార్పొరేట్ సంస్థలకు దోచిపెట్టటమే తన ధ్యేయంగా పెట్టుకొని పరిపాలన కొనసాగిస్తున్నాడని విమర్శించారు.

నరేంద్ర మోడీ అధికారం చేపట్టిన తర్వాత ఇప్పటివరకు గ్యాస్ ధరలు 225% పెంచి మహిళలను మళ్లీ కట్టెల పొయ్యి వైపు వెళ్లే విధంగా చేస్తున్నాడని ఎద్దేవా చేశారు. పట్టణ ప్రాంతాలలో పేదరిక నిర్మూలనకు పాలకులు కార్యచరణ రూపొందించి, గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పథకం అమలు చేస్తున్నట్టు పట్టణ ప్రాంతాల్లో ఉండే పేదలకు వర్తింపజేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన రాజీవ్ యువ వికాస పథకంలో పైరవీలకు తావు లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి కోరారు. వందేళ్లగా పేద ప్రజల పక్షాన పోరాటాలు చేస్తూ సీపీఐ శతవసంతాలు వేడుకలు సందర్భంగా ఈ ఉత్సవాలను ప్రతి వార్డులో ఘనంగా నిర్వహించాలని, తద్వారా పట్టణంలో మరింత పార్టీ విస్తరణకు శతవసంతాల ఉత్సవాలు దోహదపడాలని పిలుపునిచ్చారు.

స్థానిక శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు నియోజకవర్గని అన్ని విధాల అభివృద్ధి చేయటానికి కృషి చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా సమితి సభ్యులు బండి నాగేశ్వరరావు, పట్టణ సహాయ కార్యదర్శి ఉప్పుశెట్టి రాహుల్, ఏఐటీయూసీ నాయకులు మడుపు ఉపేంద్ర చారి, వైఎస్ గిరి, గోపాల్ రావు, వెంకటేశ్వర్లు, రామాచారి, శ్రీను, నాగమణి, కృష్ణవేణి, లక్ష్మి, తిరుమల తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఒడ్డుగూడెం సిపిఐ నూతన శాఖ కార్యదర్శిగా జి రవి, సహాయ కార్యదర్శిగా మడుపు వెంకట్ తో పాటు 15 మందితో నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.