calender_icon.png 2 February, 2025 | 11:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ పథకాల అమలు బోగస్సే

27-01-2025 12:00:00 AM

  •  ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలి
  • కాంగ్రెస్, బీజేపీల నైజం ప్రజలకు అర్ధమైంది
  • మాజీమంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి

సూర్యాపేట, జనవరి 26 : ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా పాలన నాలుగు పథకాల అమలు కార్యక్రమంతా బోగస్సేనని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు. ప్రజాపాలన పథకాల్లో మండలా నికి ఒక గ్రామం యూనిట్‌గా తీసుకుని లబ్ధిదారుల ఎంపిక చేయడంపై ఆదివారం జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో అయన విలేకరులతో మాట్లాడారు.

నిన్నటి వరకు దరఖాస్తులు తీసుకుని తెల్లారే లబ్ధిదారుల ఎంపిక చేయడమంటే ప్రక్రియ ఎంత నిజాయితీగా కొనసాగిందో ఆలోచించాలన్నారు. గ్రామ సభలు అన్నీ ఒక ప్రహాసనంగా మార్చారని, ఇప్పటికే రెండు సార్లు దరఖాస్తులు తీసుకుని బుట్టదాఖలు చేసి మళ్లీ దరఖాస్తులు చేసుకోమనడం అర్థరహితమన్నారు. పైరవీ చేసుకున్న వారికి మాత్రమే లబ్ది చేకూరుతుందని దీంతో గ్రామ సభలన్నీ ప్రజల నిరసనలతో మార్మోగిపోయాయన్నారు.

సంక్షేమ పథకాల అమలు డిసెంబర్ 9 అని చెప్పి ఇప్పుడు సంవత్సరానికి ఒక గ్రామంతో మొదలుపెట్టారని.. రాష్ర్టమంతా పూర్తి చేయడానికి ఎంత సమయం తీసుకుంటారో చెప్పాలని ప్రశ్నించారు. ఈ ప్రభుత్వం గప్పాలకు పోతుంది తప్ప ఒరగబెట్టింది ఏమీ లేదన్నారు. ఇందిరమ్మ బొమ్మ పెడితే పథకాలకు పైసలీయమని హామీలు ఎగ్గొట్టడానికే కాంగ్రెస్ , బీజేపీలు కలిసి డ్రామాలాడుతున్నారన్నారు.

ఒకరు రాష్ట్రానికి టోకరా వేస్తే మరొకరు దేశానికి వేస్తున్నారన్నారు. దీన్ని అర్థం చేసుకొని ప్రజలు తిరుగుబాటుకు సిద్ధమైతున్నారన్నారు.  ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సోనియమ్మ జన్మదినాలు రెండు పోయాయని ఇప్పుడు మండలానికి ఒక్క గ్రామం అనే కొత్త రాగం ఎత్తుకున్నారన్నారు. ప్రభుత్వాన్ని నడపడం కాంగ్రెస్ కి చేతకావడం లేదన్నారు. దోచుకోవడం కప్పం కట్టడంతోనే రేవంత్ కి సమయం సరిపోవడంలేదని ఇక పాలన ఎం చేస్తారని మండిపడ్డారు.