calender_icon.png 20 April, 2025 | 2:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆదర్శనీయుడు కామ్రేడ్ కుంజా బొజ్జి

12-04-2025 07:00:47 PM

పోరాటాలు కొనసాగించడమే కుంజా బొజ్జికి మనమిచ్చే నివాళి..

కామ్రేడ్ కుంజా బొజ్జి  4వ వర్ధంతి సభలో వక్తలు ఉద్ఘాటన..

భద్రాచలం (విజయక్రాంతి): ఏజెన్సీ ముద్దుబిడ్డ, మాజీ ఎమ్మెల్యే అమరజీవి కామ్రేడ్ కుంజా బొజ్జి ఆదర్శనీయుడని సిపిఎం జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు, రాష్ట్ర కమిటీ సభ్యులు ఏజే రమేష్ లు అన్నారు. కామ్రేడ్ కుంజా బొజ్జి 4వ వర్ధంతి సభ సిపిఎం భద్రాచలం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో రాజుపేట (ఎమ్మెల్యే కాలనీలో) పార్టీ సీనియర్ నాయకులు నాదెళ్ల లీలావతి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ... కామ్రేడ్ కుంజ బొజ్జి భద్రాచలం నియోజకవర్గంలో మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా తన బాధ్యతలను నీతి, నిజాయితీలతో ఆదర్శవంతంగా నిర్వహించారని కొనియాడారు. భద్రాచలం నియోజకవర్గం అభివృద్ధిలో ఆయన పాత్ర మరువలేనిదని అన్నారు.

సిపిఎం అధికారంలో లేకున్నా సమర్థవంతమైన ప్రతిపక్ష పాత్ర పోషించిందని నియోజకవర్గ సమస్యల పట్ల చిత్తశుద్ధితో పని చేసిందని అన్నారు. ఏజెన్సీ సమస్యలపైన కామ్రేడ్ కుంజా బొజ్జి అసెంబ్లీలోను, బయట పోరాటాలలోను తనదైన శైలిలో ప్రస్తావించే వారని అన్నారు. వ్యవసాయ కూలీలకు కూలి రేట్లు పెరగాలని, రైతాంగానికి గిట్టుబాటు ధర కావాలని, కార్మికులకు కనీస వేతనం అమలు చేయాలని పార్టీ నిర్వహించే వర్గ పోరాటాలలో చురుకైన పాత్ర పోషించారని అన్నారు. కామ్రేడ్ కుంజా బొజ్జి కార్యకర్తల పట్ల ఎంతో ప్రేమతో మెలిగే వారని అన్నారు. నిరంతర అధ్యయనశీలి కామ్రేడ్ కుంజ బొజ్జి అని అన్నారు. పత్రికలు సాహిత్యం ను చదవాల్సిన ప్రాధాన్యత గురించి నొక్కి చెప్పేవారని అన్నారు.

నేడు దేశంలో కులం, మతం పేరుతో ప్రజల మధ్య ఐక్యతను  దెబ్బతీసి రాజకీయ ప్రయోజనాలు పొందాలని చూస్తున్నారని, వారి భావాజాలానికి వ్యతిరేకంగా సాంస్కృతి రంగంలో మన కృషి పెరగాల్సిన అవసరం ఉందని అన్నారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కార్పోరేట్ శక్తులకు కొమ్ముకాస్తూ రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తోందని విమర్శించారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తాను ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకుండా ప్రజల సమస్యలను గాలికి వదిలేస్తుందని అన్నారు. ప్రజా సమస్యలపై అధ్యయనం చేయడం ద్వారా వాటి పరిష్కారం కోసం పోరాటాలు రూపొందించాలని పిలుపునిచ్చారు. కామ్రేడ్ కుంజ బొజ్జి స్ఫూర్తితో నిరంతరం వర్గ పోరాటాలు కొనసాగించడమే ఆయనకు మనం ఇచ్చే ఘన నివాళి అని ఆయన స్ఫూర్తితో క్షేత్రస్థాయిలో పార్టీని నిర్మించాలని పిలుపునిచ్చారు.

ముందుగా కామ్రేడ్ కుంజా బుజ్జి స్తూపం వద్ద పార్టీ పతాకాన్ని జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు ఆవిష్కరించగా బొజ్జి చిత్రపటానికి పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు ఏజే రమేష్ పూలమాల వేశారు. అనంతరం నాయకులు కార్యకర్తలు పూలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం బి నర్సారెడ్డి, కొలగాని బ్రహ్మచారి పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి, జిల్లా కమిటీ సభ్యులు బండారు శరత్ బాబు, సున్నం గంగా పార్టీ సీనియర్ నాయకులు జిఎస్ శంకర్రావు, బిబిజి తిలక్, ఎం.వి.ప్రసాదరావు, కార్యదర్శి వర్గ సభ్యులు పి సంతోష్ కుమార్, డి సీతాలక్ష్మి, పట్టణ కమిటీ సభ్యులు కోరాడ శ్రీనివాస్, డి రాఘవయ్య, ఉస్తేలాజ్యోతి, కుంజాశ్రీనివాస్, సండ్ర భూపేంద్ర, డి కనక శ్రీ,చొక్కా మాధవరావు, చాట్ల శ్రీనివాస్, సీనియర్ నాయకులు ఎం వి ఎస్ నారాయణ, తదితరులు పాల్గొన్నారు.