calender_icon.png 28 November, 2024 | 3:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మళ్లీ ఆదర్శ రైతు వ్యవస్థ!

28-11-2024 12:26:39 AM

  1. 2006లో ప్రారంభించిన అప్పటి సీఎం వైఎస్సార్
  2. ప్రత్యేక రాష్ట్రంలో నిలిచిన సేవలు
  3. పునరుద్ధరణకు పూనుకున్న కాంగ్రెస్ సర్కారు
  4. ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్న అధికారులు

నిర్మల్, నవంబర్ 2౭ (విజయక్రాంతి): ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేపట్టిన ఆదర్శ రైతు వ్యవస్థ మళ్లీ ప్రారంభం కానున్నది. రైతుల సంక్షేమం కోసం రేవంత్ సర్కారు ఇప్పటికే రూ.2 లక్షల రుణమాఫీ, పెట్టుబడిసాయం కింద ఎకరానికి రూ.15 వేలు వంటి పథకాలపై ఫోకస్ చేయగా.. తాజాగా పల్లెల్లో ఆదర్శ రైతులను నియమించాలని నిర్ణయించుకున్నది.

వ్యవసాయ శాఖ కు అనుబంధంగా అగ్రికల్చర్ మేనేజ్‌మెంట్ టెక్నాలజీ (ఆత్మ)వ్యవస్థను బలోపేతం చేయడంలో భాగంగా త్వరలో గ్రామాల్లో ఆదర్శ రైతుల వ్యవస్థను ప్రవేశపెట్టబోతున్నట్టు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇటీవల ప్రకటించిడంపై కాంగ్రెస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. 

2006 లో అప్పటి సీఎం వైఎస్సార్ ఆదర్శ రైతు వ్యవస్థను ప్రారంభించారు. ప్రతి గ్రామ పం చాయతీలో బాగా పంటలు పండిస్తూ, వ్యవసాయంపై పూర్తి అవగాహన ఉన్న వారిని ప్రభుత్వం ఆదర్శ రైతులుగా నియమించేది. వీరికి ప్రతి నెలా రూ.వెయ్యి గౌరవ వేతనం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అందించేది.

వ్యవసాయ అధికారులకు అనుసం ధానంగా ఉంటూ.. రైతులకు వ్యవసాయ నూతన పద్ధతులు, తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబ డులు సాధించడంపై అవగాహన, ప్రభుత్వ పథకాల అమలులో సహకారానికి ఆదర్శ రైతులను సర్కారు వినియోగించుకోనున్నది. 

జిల్లాలో 400 మందికి అవకాశం

ప్రభుత్వం ఆదర్శ రైతుల పాలనను అం దుబాటులోకి తీసుకొస్తే జిల్లాలో 400మందికి ప్రయోజనం చేకూరనున్నది. జిల్లాలో నిర్మల్, భైంసా, ముథోల్, ఖానాపూర్ వ్యవసాయ సబ్‌డివిజన్‌లు ఉండగా.. 19 మం డలాలు ఉన్నాయి. జిల్లావ్యాప్తంగా 79 వ్యవసాయ క్లస్టర్లు.. 400 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. మండలానికో వ్యవసాయ అధికారితోపాటు క్లస్టర్‌కు ఏఈవోలు ఉన్నారు.

వ్యవసాయ విస్తరణ అధికారులు క్లస్టర్ల పరిధిలో పంటల సాగు విధానం, సాగు విస్తీర్ణం, ఎరువులు, రసాయన మందుల వినియో గం, పంట సర్వే, రైతుల బీమా, సస్యరక్షణ చర్యలు వంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. క్లస్టర్ పరిధిలో ఒక్కో రోజు ఒక గ్రామంలో విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే ప్రతి రోజూ అన్ని గ్రామాలకు ఏఈవోలు అందుబాటులో ఉండడం సాధ్యపడక రైతు లు ఇబ్బందులు పడుతున్నారు.

ఈక్రమం లో అధికారుల సూచనలు, సలహాల కోసం రైతులు వ్యవసాయ కార్యాలయాలకు వెళ్లడంతో సాగు పనులకు ఆటకం కలుగు తు న్నది. రైతులకు గ్రామాల్లోనే సేవలందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ‘ఆత్మ’ను బలోపే తం చేయాలని భావిస్తోంది.

కేసీఆర్ ప్రభు త్వం ‘ఆత్మ’కు నిధుల కేటాయింపు ఇవ్వకపోగా ఆదర్శ రైతుల పాలనను రద్దు చేసి క్లస్టర్లకు ఏఈవోలను నియమించింది. కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఆదర్శ రైతు వ్యవస్థ మళ్లీ తెరపైకి వచ్చింది. 

ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్న అధికారులు

నిర్మల్ జిల్లాలో ఆదర్శ రైతుల నియామకంపై అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. గతంలో 244 మంది ఆదర్శ రైతులు ఉండ గా.. ప్రస్తుతం 400 మందికి అవకాశం దక్కనున్నది. ఈ ప్రక్రియను డిసెంబర్‌లోగా పూర్తి చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఆదర్శ రైతుల వల్ల సాగు పరంగా అన్నదాతలకు మరిన్ని సేవలు అందుబా టులోకి రానున్నాయి.