29-03-2025 11:16:35 PM
సిపిఎం రంగారెడ్డి జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య..
కలెక్టర్ కు వినతిపత్రం వినతిపత్రం అందజేసిన ఇంటి స్థలాల పోరాట కమిటీ, సిపిఎం బృందం..
ఇబ్రహీంపట్నం (విజయక్రాంతి): రామోజీ యాజమాన్యం ఆక్రమించిన పేద ప్రజల ఇళ్ల స్థలాల సమస్యను వెంటనే పరిష్కరించాలని సిపిఎం రంగారెడ్డి జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య జిల్లా కలెక్టర్ ను కోరారు. నాగన్ పల్లి సర్వేనెంబర్ 189, 203లో పేదలకు ఇచ్చినటువంటి 60 గజాల ఇంటి స్థలాల సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించి లబ్ధిదారులకు ఇంటిస్థలంలోనే ఇల్లు నిర్మించుకునేందుకు అవకాశం కల్పించాలని, ఇంటి స్థలాల పోరాట కమిటీ, సిపిఎం బృందం రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా సిపిఎం రంగారెడ్డి జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య మాట్లాడుతూ.. 18 ఏళ్లుగా రామోజీ ఫిలిం సిటీ లో పేదలకు కేటాయించిన ఇంటి స్థలాల కోసం పోరాటం సాగిస్తున్నామని ఈ నెల 26 న చలో రామోజీ ఫిలిం సిటీ కార్యక్రమం సందర్భంగా ఇంటి స్థలాల వద్దకు లబ్ధిదారులందరూ వెళితే శాంతియుతంగా ఉన్న లబ్ధిదారులపై పోలీసులు అకారణంగా మహిళలు అని కూడా చూడకుండా ఈడ్చుకెళ్లారని తెలిపారు. సిపిఎం నాయకులను లబ్ధిదారులను అరెస్టు చేశారని, ఎన్నిసార్లు అధికారులకు విన్నవించినా కూడా ఫలితం లేకుండా పోయిందని అందుకోసమే లబ్ధిదారులందరూ తమ స్థలాల దగ్గరికి వెళ్లాల్సి వచ్చింది అన్నారు. ప్రభుత్వం ఇంటి స్థలం ఉన్న పేదలకి ఇల్లు నిర్మించుకునేందుకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని చెప్తుందని కానీ ఇంటి స్థలమే లేకుంటే ఇల్లు ఎక్కడ నిర్మించుకోవాలని అన్నారు. కాబట్టి లబ్ధిదారులకు కేటాయించిన ఇంటి స్థలాలను వెంటనే వారికి చెందేలా సమస్యను ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని అన్నారు.
ఇంటి స్థలాలకు కేటాయించిన స్థలాన్ని రామోజీ యాజమాన్యం కబ్జా చేసి ఉపయోగించుకుంటున్నారని, ఆ స్థలాల్లోకి ఎవరు రాకుండా కందకాలు తీశారని అన్నారు. రామోజీ ఆక్రమించిన ప్రభుత్వ రోడ్డును ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకురావాలన్నారు. లబ్ధిదారుల కేటాయించిన స్థలాల్లోని వారికి ఇంటి స్థలం ఇవ్వాలని అన్నారు. ప్రభుత్వానికి నివేదిక పంపించాము కలెక్టర్ సి.నారాయణ రెడ్డి రామోజీ ఫిలిం సిటీ లో ఇంటి స్థలాల విషయం ప్రభుత్వం నివేదిక అడిగిన వెంటనే పంపించాము. తొందరలోనే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని అయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బి. సామేల్, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు సిహెచ్ బుగ్గరాములు, సిహెచ్ జంగయ్య, ఇంటి స్థలాల పోరాట కమిటీ కన్వీనర్ పి.జగన్, మండల కమిటీ సభ్యులు ఎం.ఆనంద్, ఏ.నరసింహ తదితరులు పాల్గొన్నారు.