calender_icon.png 13 February, 2025 | 3:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మూసీ ఒడ్డున ఇళ్లు నేలమట్టం...

12-02-2025 11:36:05 PM

పనులు వేగవంతం చేసిన అధికారులు..

మలక్‌పేట: మూసీనది ఒడ్డున మలక్‌పేటలోని మూసానగర్, శంకర్‌నగర్ రివర్‌బెడ్ ప్రాంతాల్లో ఉన్న ఇళ్లను హెచ్‌ఎంఆర్‌డీసీఎల్ అధికారులు నేలమట్టం చేస్తున్నారు. బుధవారం ఉదయం ఆజంపురా డివిజన్‌లోని మూసానగర్ మూసీ పరివాహక ప్రాంతంలో దాదాపు 20 వరకు ఇళ్లను నేలమట్టం చేశారు. మూసీ రివర్ అభివృద్ధి ప్రాజెక్ట్ లో భాగంగా రివర్‌బెడ్ లో ఉన్న ఇళ్లను అధికారులు గత ఏడాది సెప్టెంబర్ న గుర్తించి, అక్టోబర్ మాసంలో పాక్షికంగా కూల్చివేశారు. ఇళ్లలోని దాదాపు 163 మంది నిర్వాసితులకు చంచల్‌గూడ లోని పిల్లి గుడిసెలు డబుల్ బెడ్‌రూంలను కేటాయించారు.

మలక్‌పేట ఎమ్మెల్యే అహ్మద్ బలాల నిర్వాసితులకు అండగా ఉండి, చంచల్‌గూడ డబుల్ బెడ్‌రూం ఇళ్లు కేటాయించి పట్టాలు మంజూరు చేయించడంలో ప్రధాన పాత్ర పోషించారు. దీంతో ఎటువంటి గొడవ లేకుండా దాదాపు 163 ఇళ్లను అధికారులు వెంటనే పాక్షికంగా కూల్చివేశారు. కాగా, బుధవారం నాడు మళ్లీ మూసీ రివర్ డెవలప్‌మెంట్ అధికారుల తమ బృందంతో కలిసి ఇళ్లను పూర్తిగా నేలమట్టం చేయిస్తున్నారు. పనులు కాంట్రాక్టర్‌కు అప్పగించారు. ఏఈ సుశీంధర్ దగ్గరుండి పనులను పర్యవేక్షిస్తున్నారు. ముందుగా మూసానగర్ ఒడ్డున ఆర్‌బీఎక్స్ అని ఉన్న ఇళ్లను పూర్తిగా జేబీసీతో తొలగిస్తున్నట్లు ఆయన తెలిపారు. తరువాత డెబ్రిస్ ను పూర్తిగా రాంకీ ప్లాంట్‌కు తరలిస్తామని ఆయన స్పష్టం చేశారు.