27-04-2025 12:00:00 AM
ఎండలు బాగా మండిపోతున్నాయి. బయటికెళ్లడం సాధ్యం కాదు. కాని ఇంట్లో కూడా ఉక్కపోతే.. ఏసీలు, కూలర్లు పెట్టుకున్నా అవన్నీ కరెంట్‌తో నడిచేవి.. ఇంటిని సహజంగా చల్లగా చేస్తే ఇంటికి, ఒంటికి మంచిది. వేసవికాలంలో ఇంట్లో ఉండే ఉక్కపోతను తరిమేయాలంటే.. కొన్ని చిట్కాలను పాటిస్తే సరిపోతుంది. అవేంటో చూద్దాం..
ఇంట్లో ఎక్కువ సామాన్లు ఉంటే తీసేసి ఖాళీగా ఉంచుకోవాలి. గాలి, వెలుతురు బాగా వచ్చేలా చూసుకోవాలి. ఇంటిపైన ఉండే వాటర్ ట్యాంక్‌లో నీళ్లు మధ్యాహ్నం పూట లేకుండా చూడాలి. అవి వేడెక్కడం వల్ల ఇల్లు కూడా వేడెక్కుతుంది.
ఇలా చేయండి..
వంట కూడా ఉదయం, సాయంత్రం వేళల్లో చేసుకుంటే మంచిది. లేదంటే వంటగది వేడి ఇల్లంతా పాకుతుంది. ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు టీవీ, కంప్యూటర్, మొబైల్ లాంటి ఎలక్ట్రానిక్ వస్తువులు ఎంత తక్కువ వాడితే అంత మేలు. లైట్లు కూడా అవసరం అయితేనే వేసుకోవాలి.
ఇంటి మధ్యలో టబ్‌లో నీళ్లు పోసి పెట్టుకుంటే.. ప్యాన్ గాలి వేడిని నీరు పీల్చుకుని గదిని చల్లగా ఉంచుతుంది. అయితే ఆ నీళ్లలో కొన్ని ఐస్ ముక్కలు, కొన్ని కర్పూరం బిళ్లలు వేయడం వల్ల గదంతా చల్లగా ఉంటుంది. సువాసన కూడా వెదజల్లుతుంది. నిద్రపోయేముందు స్నానం చేస్తే నిద్ర హాయిగా పడుతుంది.
మొక్కలు
ఇంటి చుట్టూ మొక్కలు పెంచడం వల్ల ఇల్లు చల్లగా ఉంటుంది. అపార్టుమెంట్‌లో ఉండేవాళ్లు బాల్కనీలో, కిటికీల దగ్గర కుండీల్లో మొక్కలు పెంచుకోవచ్చు. తీగలతో అల్లుకునే మొ క్కలు పెంచడం వల్ల వేసవిలో మరింత చల్లదనం పొందొచ్చు. మనీప్లాంట్స్ ఉన్న కుండీలు పెట్టుకుంటే అవి వేడిని గ్రహించి, ఇంటిని కూడా చల్లగా ఉంచుతాయి.
డోర్ కార్టెయిన్స్
డోర్ కార్టెయిన్స్‌గా చాపలు, గడ్డితో చేసిన మ్యాట్లు.. కిటికీల దగ్గర వేలాడ దీయాలి. వాటిని అప్పుడప్పుడు నీళ్లతో తడుపుతుండాలి. అవి వేడిగాలులు ఇంట్లోకి రాకుండా అపుతాయి. అలాగే కాటన్ బెడ్ షీట్లను కూడా డోర్ కార్టెయిన్స్‌గా వాడుకోవచ్చు. ఇవి ఏసీలు, కూలర్ల కంటే ఇంటిని చల్లగా ఉంచుతాయి. వీటివల్ల వచ్చే చల్లదనం ఆరోగ్యానికి కూడా మంచిది.
కలర్స్..
ఎండాకాలం టెర్రస్ బాగా వేడెక్కుతుంది. ఆ వేడి ఇంట్లోకి నేరుగా వస్తుంది. అందుకే ఈ కాలంలో టెర్రస్ మీద కూల్ పెయింట్ వేయించాలి. దీనిలో క్రిస్టల్స్ కలిపిన పొడి, తెలుసు రంగు.. కలిపిన మిశ్రమం ఉంటుంది. అవి సూర్యుడి నుంచి వచ్చే వేడిని లోపలకు రానీయవు. అలాగే లోపల పైకప్పుకు తెలుపురంగు వేయించడం వల్ల ఇంట్లోకి వచ్చే వేడి 70శాతం తగ్గుతుంది.