calender_icon.png 18 October, 2024 | 6:47 AM

సిబ్బంది నిర్లక్ష్యం బాధ్యత ఆసుపత్రిదే

18-10-2024 02:55:25 AM

  1. బాధితుడికి రూ.2.౦8 లక్షలు చెల్లించాలి
  2. ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్‌స్టిట్యూట్ కేసులో రాష్ట్ర వినియోగదారుల కమిషన్ తీర్పు

హైదరాబాద్, అక్టోబర్ 17 (విజయక్రాంతి): పరీక్షల నిమిత్తం వచ్చిన 72 ఏళ్ల వృద్ధుడికి ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంతో తొడ ఎముక విరిగినందుకు వైద్య ఖర్చులు రూ.1.48 లక్షలు 9 శాతం వడ్డీతో, పరిహారంగా రూ.50 వేలు, కోర్టు ఖర్చుల కింద మరో రూ.10 వేలు చెల్లించాలని ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్‌స్టిట్యూట్‌ను రాష్ట్ర వినియోగదారుల కమిషన్ ఆదేశించింది.

కరీంనగర్‌కు చెందిన ఎం నారాయణ 2015లో పరీక్షల నిమిత్తం ఎల్వీ ప్రసాద్ హాస్పిటల్‌కు వెళ్లారు. పరీక్షల నిమిత్తం రూ.3,400 చెల్లించారు. అనంతరం సిబ్బంది నారాయణను వీల్ చైర్‌లో తీసుకువచ్చి స్టూలుపై కూర్చోబెడుతుండగా కింద పడటంతో తొడ ఎముక విరిగింది. డాక్టరు పరిశీలించి నిమ్స్ దవాఖానకు సిఫారసు చేయగా, నారాయణ సన్‌షైన్ హాస్పిటల్‌లో చికిత్స చేయించుకున్నారు.

చికిత్స నిమిత్తం రూ.1.48 లక్షలు ఖర్చుకాగా, ఆ మొత్తాన్ని చెల్లించాలంటూ 2016లో ప్రసాద్ ఐ ఇన్స్‌స్టిట్యూట్‌కు లీగల్ నోటీసు పంపించారు. స్పందన లేకపోవడంతో జిల్లా వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించారు. జిల్లా వినియోగదారుల కమిషన్ కొట్టివేయడంతో, బాధితుడు రాష్ట్ర వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించారు.

కమిషన్ ఇన్‌చార్జి అధ్యక్షురాలు మీనా రామనాథన్, సభ్యులు వీవీ శేషుబాబుతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. వాదనలు పూర్తయిన తర్వాత.. కంటి పరీక్షల కోసం రూ.3,400 చెల్లించిన ‘పిటిషనర్’ వినియోగదారు అని, ఆస్పత్రి సేవలందించే సంస్థగా ఒప్పందం కుదిరినట్టేనని పేర్కొంది.

వైద్యసేవల్లో నిర్లక్ష్యం లేనప్పటికీ సిబ్బంది నిర్లక్ష్యానికి యజమానిగా ఆస్పత్రి బాధ్యత వహించాల్సిందేనని స్పష్టంచేసింది. వైద్య ఖర్చులు రూ.1.48 లక్షలు 2016 నుంచి 9 శాతం వడ్డీతోపాటు పరిహారం రూ.50 వేలు, ఖర్చుల కింద మరో రూ.10 వేలు చెల్లించాలంటూ ఆదేశిస్తూ తీర్పు వెలువరించింది.