calender_icon.png 20 April, 2025 | 1:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సూపర్ సిక్స్‌పైనే పార్టీల ఆశలు

16-11-2024 12:00:00 AM

సార్వత్రిక ఎన్నికల తర్వాత జాతీయ రాజకీయాలను ప్రభావితం చేయగల ఎన్నికలుగా భావిస్తున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సంగ్రామం చివరి దశకు చేరుకోవడంతో బీజేపీ, శివసేన (ఏక్‌నాథ్ షిండే), ఎన్సీపీ (అజిత్ పవార్) పార్టీలతో కూడిన మహాయుతి’, కాంగ్రెస్, శివసేన (ఉద్దవ్ ఠాక్రే), ఎన్సీపీ (శరద్ పవార్) పార్టీలతో కూడిన మహా వికాస్ అఘాడీ’ (ఎంవీఏ) పోటాపోటీగా ప్రచారంలో నిమగ్నమయ్యాయి. ఒకే దశలో నవంబర్ 20న జరగనున్న ఎన్నికల్లో మొత్తం 288 స్థానాలకు గాను 4,136 మంది అభ్యర్థులు బరిలో ఉన్నా రు.

లోక్‌సభ ఎన్నికల్లో  భంగపాటుకు గురైన మహాయుతి’ అసెంబ్లీ ఎన్నికలు ముందు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలపై భారీ ఆశలు పెట్టుకోగా, ఎన్సీపీ, శివసేన పార్టీలను చీల్చినందుకు సార్వత్రిక ఎన్నికల మాదిరిగానే శాసనసభ ఎన్నికల్లో కూడా బీజేపీని మహారాష్ట్ర ఓటర్లు శిక్షిస్తారని మహా వికాస్ అఘాడీ ఆశిస్తోంది. వార్షిక ఆదాయం రూ. 2.5 లక్షల కంటే తక్కువ ఉన్న కుటుంబాలలోని మహిళల కోసం ‘మాజీ లడ్కీ బహిన్’ యోజన పథకాన్ని మహాయుతి ప్రభుత్వం ప్రారంభించి ంది.

జులై నుంచి అక్టోబరు వరకు 2.34 కోట్ల మంది మహిళలకు  నెలకు రూ.1,500 అందించారు. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో సగటున దాదా పు 80,000 మంది మహిళా లబ్ధిదారులు ఉండడంతో తాము తప్పక విజ యం సాధిస్తామని మహాయుతి ధీమాగా ఉంది. అధికారంలో కొనసాగితే ఈ పథకాన్ని నెలకు రూ.2,100కు పెంచుతామని ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే ఇప్పటికే హామీ ఇచ్చారు. మరోవైపు ఉచితాలతో రాష్ట్రంపై ఆర్థిక భారం పడనుందనే  విమర్శలున్నాయి.

ఆర్థిక అసమానతలు

మహారాష్ట్రలో పట్టణాభివృద్ధి - గ్రామీణ ప్రాంతాల ఇబ్బందులను జోన్ల వారీగా పరిశీలిస్తే విదర్భ, మరఠ్వాడా, ఉత్తర మహారాష్ట్రలోని పెద్ద ప్రాంతాలు ఆర్థికంగా వెను కబడి ఉన్నాయి. ముంబై, థానే-కొంకణ్,  పశ్చిమ మహారాష్ట్ర  ప్రాంతాల్లో తలసరి ఆదాయం రెండు లేదా మూడు రెట్లు అధికంగా ఉంది. దీంతో గ్రామీణ,-పట్టణ ప్రాం తాల మధ్య ఆర్థికపరంగా స్పష్టమైన వ్యత్యాసం కనిపిస్తుంది. యాదృచ్ఛికంగా ఈ రెండు ప్రాంతాల్లో అసెంబ్లీ స్థానాలు దాదాపు సమానంగా ఉన్నాయి.

గ్రామీణంలో అన్నదాతలు ఈ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించనున్నారు. 2022లో దేశంలోనే అత్యధిక రైతుల ఆత్మహత్యలు మహా రాష్ట్రలో 37.6 శాతంగా  ఉన్నాయి. అయి తే ఇదే సమయంలో 13.3 శాతంతో దేశ జీడీపీకి రాష్ట్రం అత్యధికంగా దోహదపడడం గమనార్హం. జీడీపీతో సంబంధం లేకుండా విదర్భ, మరఠ్వాడా ప్రాంతాలు కరువుతో రైతుల ఆత్మహత్యలకు కేంద్రాలుగా మారాయి. ఈ పరిస్థితుల మధ్య రాష్ట్రంలో కీలకమైన మరాఠాలు రిజర్వేషన్లు డిమాండ్ చేయడానికి గ్రామీణ దుస్థితి ఒక ప్రధాన కారణమైంది.

అంతర్జాతీయంగా మార్కెట్లు లాభదాయకంగా ఉన్నప్పుడు రాష్ట్రంలో నీటి కొరత, తక్కువ పంట ధరలు, ఉల్లి ఎగుమతిపై నిషేధం వంటి సమస్యలున్నాయి. ఈ పరిస్థితికి ‘మహాయుతి’ ప్రభుత్వమే కారణమనే ఆగ్ర హం రైతుల్లో ఉండడంతో, ఇది తమకు సానుకూలమని ఎంవీఏ భావిస్తోంది. షెత్కారీ సమ్మాన్ యోజనను ఏడాదికి రూ.12,000 నుంచి రూ.15,000కు పెంచుతామని మహాయుతి హామీ ఇచ్చిం ది. మరోవైపు వ్యవసాయ రుణమాఫీకి ఎంవీఏ హామీ ఇచ్చింది.

ఈ పరిణామాల మధ్య థానే-కొంకణ్‌లో మహాయుతికి కొంత ఆధిక్యం, ముంబై, పశ్చిమ ప్రాంతాలలో రెండు కూటముల మధ్య పోటాపోటీ ఉందని క్షేత్రస్థాయిలో ఎన్నికల సరళిని అధ్యయనం చేస్తున్న‘ పీపుల్స్ పల్స్’ బృందం దృష్టికి వచ్చింది. ఈ ప్రాంతాల్లో అభివృద్ధి ప్రధాన అజెండాగా ఉండడంతో మహాయుతి ప్రభుత్వం ‘అటల్ సేతు’ వంటి అనేక మౌలిక సదుపా యాల ప్రాజెక్టులను ప్రారంభించింది. ఓడరేవులు, విమానాశ్రయాలు, రోడ్లు, పైప్ లైన్ పనులు చేపట్టడంతో బీజేపీ కూటమికి ఇక్కడ అనుకూలంగా ఉంది.

కీలకం కానున్న ఓట్ల బదిలీ

పొత్తుల మధ్య సాగనున్న ఎన్నికల్లో పార్టీల మధ్య ఓట్ల బదిలీ సజావుగా జరగడం కీలకం.  రాజకీయాల్లో రెండు ప్లస్ రెండు నాలుగు కాదు. పొత్తుల సందర్భంలో అది మూడు లేదా ఐదు కావచ్చు. పొత్తుల మార్పులు లాభంతో పాటు నష్టం కూడా కలిగించే అవకాశాలుంటాయి. బీజేపీ, కాంగ్రెస్ నేతృత్వంలోని కూటముల్లో శివసేన, ఎన్సీపీ రెండు వర్గాలుగా చీలి భాగస్వాములుగా ఉండడంతో రాష్ట్రంలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. రెండు కూటములకు ఒక్కో స్థానం నుంచి ముగ్గురు బలమైన పోటీదారులు ఉన్నారు.

అవిభక్త ఎన్సీపీ మొదటి నుండి బీజేపీ, శివసేనలకు వ్యతిరేకంగా పోరాడింది. గతంలో అవిభక్త శివసేన కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పోరాడింది. ఇప్పుడు ఆయా పార్టీల శ్రేణులు అందుకు భిన్నంగా ఏ మేరకు ఓట్ల బదిలీ చేస్తారో చూడాల్సి ఉంది. ఈ అనిశ్చితి మధ్య పార్టీల మధ్య వంద శాతం ఓట్ల బదిలీ దాదాపు అసాధ్యం. ఇటీవల లోక్‌సభ ఎన్నికల సరళిని గమనిస్తే ఓట్ల బదలాయింపు మహాయుతిలోని పార్టీలతో పోలిస్తే ఎంవీఏలోని పార్టీల మధ్య మెరుగ్గా జరగడం కాంగ్రెస్ కూటమికి సానుకూలం.

సోషల్ ఇంజనీరింగ్ పరంగా పరశీలిస్తే ఈ ఎన్నికల్లో మరాఠీలు కీలకంగా మారనున్నారు. మరాఠాలకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లపై బీజేపీ మాట ఇచ్చి తప్పిందనే ఆగ్రహం లోక్‌సభ ఎన్నికల్లో ప్రస్ఫుటమైంది. మరోవైపు, అవిభక్త ఎన్సీపీకి చెందిన ముస్లిం ఓటర్లు బీజేపీతో పొత్తు పెట్టుకున్నందుకు అజిత్ పవార్ వర్గానికి మద్దతు ఇవ్వక పోవడంతో లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థుల ఓటమికి దారి తీసింది. ఈ పరిణామాలతో ప్రత్యేకించి మరాఠ్వాడాలో  లోక్‌సభ ఎన్నికల్లో ఎంవీఏతో పోలిస్తే మహాయుతి దాదాపు 13 శాతం ఓట్లతో వెనుకబడింది.

బీజేపీని ఓడించడానికి మెరుగైన స్థితిలో ఉన్న ప్రత్యర్థి అభ్యర్థులకు ఓటు వేయాలని మరాఠా ఉద్యమ నేత మనోజ్ జరంగే పాటిల్ స్పష్టమైన పిలుపు ఇచ్చారు. దీనికి ప్రత్యామ్నాయంగా మరాఠాలకు వ్యతిరేకంగా ప్రధానంగా ఓబీసీలను ఏకం చేసి లబ్ధి పొందాలని బీజేపీ ప్రణాళికలు రూపొందించింది.

చిన్న పార్టీలు, రెబెల్స్ ప్రభావం

మహారాష్ట్రలో చిన్న పార్టీలు, ఇండిపెండెంట్లు, రెబల్ అభ్యర్థులు ప్రతి ఎన్నిక ల్లోనూ కీలక పాత్ర పోషిస్తున్నారు. మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన, బహుజన్ వికాస్ అఘాడీ, వంచిత్ బహుజన్ అఘాడీ, ఏఐఎంఐఎం వంటి పార్టీలు  చీల్చే ఓట్లు కొన్ని సెగ్మెంట్లలో మహాయుతి, ఎంవీఏ అభ్యర్థుల గెలుపోటములను నిర్ణయించే అవకా శాలున్నాయి. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో 11 శాతంపైగా ఓట్లు సాధించిన ఇతరులు పలు స్థానాల్లో గెలుపోటములను ప్రభావితం చేశారు.

ఆ ఎన్నికల్లో  70కి పైగా స్థానాల్లో ఐదు శాతం లోపు ఓట్ల తేడాతో అభ్యర్థులు గెలిచారు. ఈ సెగ్మెంట్లలో చిన్నపార్టీలు, రెబల్, స్వతంత్ర అభ్యర్థులు కీలకపాత్ర పోషించారు. ప్రస్తుత ఎన్నికల్లో మహాయుతి, ఎంవీఏ కూటముల రెబల్ అభ్యర్థులు 50కి పైగా స్థానాల్లో ఉన్నారు.

మహారాష్ట్రలో సుమారు8 శాతం ఇతర రాష్ట్రాల నుండి వలస వచ్చి స్థిరపడిన వారున్నారు. ఉత్తర ప్రదేశ్, కర్ణాటక, గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌కు చెందిన వారు ముంబైలో భారీగా ఉన్నారు. ఉదాహరణకు  గుజరాతీలు రాష్ట్రంలో 19 శాతంపైగా ఉన్నారని లెక్కలున్నాయి. ఈ నేపథ్యంలో మోదీ ప్రభావంతో రాష్ట్రానికి దక్కాల్సిన పరిశ్రమలు గుజరాత్‌కు తరలిపోతున్నాయని, దీంతో మహారాష్ట్రకు నష్టం జరుగుతుందన్న ఉద్దవ్ ఠాక్రే, శరద్ పవార్ ప్రచారం ఈ ఎన్నికల్లో కీలకంగా మారనుంది.

ఫాక్స్‌కాన్, వేదాంత ప్రాజెక్ట్లు గుజరాత్‌కు వెళ్లడంతో ఎన్నికలు కొంత మరాఠీ వర్సెస్ గుజరాతీలుగా కూడా మారబోతోంది. ఈ నేపథ్యంలో బీజేపీకి గుజరాతీ, ఉత్తర భారతీయుల మద్దతు భారీగా లభిస్తోంది. ‘మాజీ లడ్కీ బహిన్ యోజన’ సంక్షేమ పథకం, పట్టణ, -గ్రామీణ వ్యవసాయాభివృద్ధి, ప్రాంతీయ పార్టీల చీలికలు, -ఓట్ల బదిలీ, సోషల్ ఇంజినీరింగ్, రెండు కూటములపై ఇతర అభ్యర్థుల ప్రభావం, వలస ఓటర్లు వంటి ఆరు అంశాలు ‘మహా’ సంగ్రామంలో ‘సూపర్ సిక్స్’గా మారనున్నాయి.

ఈ అంశాల్లో కొన్ని మహాయుతికి, మరికొన్ని ఎంవీఏ కూటమికి అనుకూలంగా ఉండడంతో నవంబర్ 23న వెలువడే ఫలితాల్లో మహారాష్ట్రీయులు ఎలాంటి తీర్పు ఇవ్వనున్నారో వేచి చూడాలి.

 - వ్యాసకర్త పొలిటికల్ ఎనలిస్ట్,

పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ.