మధుకర్ ముచ్చర్ల.. వయసుతో సంబంధం లేకుండా తోలుతో అద్భుతమైన కళాఖండాలను సృష్టిస్తున్నాడు. తరతరాలుగా వెనుకబడ్డ తన చరిత్రను ఆర్ట్‌కు అన్వయించి.. సరికొత్త చరిత్రను లిఖిస్తున్నాడు. చరిత్రను కేవలం గతానికి మాత్రమే పరిమితం చెయ్యకుండా వర్తమానంతో మిళితం చేశాడు. ఆర్ట్‌కు సంబంధించి ఎలాంటి కాల్పనికతకు, ఊహకు తావులేకుండా.. లెదర్ ఆర్ట్‌కు సహజమైన పరిమళాన్ని అద్దారు. తోలు బొమ్మలను అందంగా మలిచిన తెలంగాణ బిడ్డ.. ఖజానాతో పంచుకున్న ముచ్చట్లు..
మాది రంగారెడ్డి జిల్లా నందివనపర్తి గ్రామం. మాది దళిత్ బ్యాగ్రౌండ్. మా పూర్వీకుల నుంచి వారసత్వంగా తోలు(లెదర్) పని చేస్తూ జీవనం గడుపుతున్నాం. ఈ సంప్రదాయక పనిని నేను అధ్యయనం చేసి.. దాన్నే నా కెరీర్‌గా ఎంచుకున్నా. తోలుతో తయారు చేసే ప్రతి ఒక్కదానికి ఒక చరిత్ర ఉన్నది. అదే దళిత్ హిస్టరీ. చిన్నప్పటి నుంచి అదే వాతావరణంలో పెరిగా.. మా నాన్న చెప్పులు, డప్పులు తయారుచేసేది.. వాటి తయారీ.. రిథమ్స్ మిగతా కళల కన్నా భిన్నంగా, ఆకర్షణీయంగా కనిపించేది నాకు.
మా నాన్న చెప్పులు కుట్టేటప్పుడు ఉపయోగించే మెటిరీయల్ నా కంటికి అద్భుతంగా కనిపించేది. ఆ చిన్న చిన్న పరికరాలు.. వాటి పనితనం నాకు బాగా నచ్చేది. మా నేపథ్యాన్ని.. దళిత్ చరిత్రను ఆధారం చేసుకుని నేను ఏం చెప్పాలనుకుంటున్నానో.. దాన్ని నా కళల రూపంలో వ్యక్తపరుస్తున్నా. నా డిగ్రీ, పీజీ మొత్తం ఫైన్ ఆర్ట్స్‌లో పూర్తి చేశా. బ్యాచిలర్స్ వచ్చేసి.. పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, అలాగే మాస్టర్స్ వచ్చేసి జవహర్నెహ్రు ఆర్కిటెక్చర్ ఫైన్ ఆర్ట్స్‌లో పూర్తి చేశా.
కళాకారుడిగా నా ప్రయత్నం..
మాస్టర్స్‌లో ఉన్నప్పుడు మెటిరీయల్తో వర్క్ చేయడం మొదలుపెట్టా. అప్పుడే దళిత సాహిత్య గురించి కొంచెం రిసెర్చ్ చేయడం, అంబేద్కర్ రచనలు చదవడం.. ఇంకా జ్యోతిరావు ఫూలే రచనలు చదవడం మొదలైంది. వాళ్ల రచనల ప్రభావం నాపై బాగా పడ్డది. అప్పటిన్నుంచి వాళ్లనే స్ఫూర్తిగా తీసుకుంటు ముందుకెళ్తున్నా. అదే క్రమంలో లెదర్‌కు ఉన్నా చరిత్ర కూడా తెలుసుకున్నా.
లెదర్‌ను ఉపయోగించి ఎలాంటి ఆర్ట్ వర్క్ చేయొచ్చు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులకు దాన్ని ఎలా కనెక్టు చేయొచ్చు అనేదానిపైనే నా వర్క్ స్టయిల్ కనిపిస్తుంది. ఈ ఆధునిక ప్రపంచానికి ఫోక్లో ఉన్న స్వచ్ఛతను, ప్యూరిటీని అర్థం చేయించడం నా లక్ష్యం.
నిజానికి దళితులు వాడే వస్తువులను అంటరాని వస్తువులుగా చూసే కాలంలో మనం ఉన్నాం. అలాంటి భావనను రూపుమాపడంలో భాగంగానే దళితుల జీవన విధానాన్ని నా వర్క్ స్టయిల్స్‌లో చూపిస్తున్నా. ఒక కళాకారుడిగా సమాజంలో ఉన్న వివక్షను తొలగించడంలో భాగంగా నా వంతు ప్రయత్నంగా లెదర్ వర్క్స్‌తో చరిత్రను.. ఆధునిక ప్రపంచానికి పరిచయం చేస్తున్నా.
నా వర్క్‌లో ప్రత్యేకత ఇదే!
నిజానికి లెదర్ మెటిరీయల్ కొంచెం ఖరీదు ఎక్కువగా ఉంటుంది. దాని పనితనం కూడా కష్టంగానే ఉంటుంది. మా కుటుంబ నేపథ్యం అదే కాబట్టి చిన్నప్పటి నుంచి అదే వాతావరణంలో పెరిగా. మా నాన్నతో చెప్పులు కుట్టడం, డప్పులు తయారు చేయడం నేర్చుకున్నా.. అలాగే డప్పు కొట్టడం మీద కూడా కొంత రిసెర్చ్ వర్క్ చేశా.
మెటిరీయల్ నుంచి లెదర్ చెప్పుగా మారినప్పుడు దానివిలువ ఎలా ఉంటుంది? అలాగే డప్పుగా మారినప్పుడు దానివిలువ ఎలా ఉంటుంది? ఇలా అన్నీ విషయాలపై ఒక పట్టు సాధించా. నా జర్నీ మొత్తం చదవడం, పరిశోధన చేయడం మాత్రమే కాకుండా.. చదివిన దాన్ని ప్రస్తుత సమాజానికి అర్థమయ్యే విధంగా ఆర్ట్ వర్క్ చేసి చూపిస్తున్నా. ఇది నా ఆర్ట్ ప్రత్యేకత.
ప్యూరిటీపై పరిశోధన
ప్యూరిటీ అనే సబ్జెక్టును చదివాను. దాంట్లో ప్రత్యేకంగా ఒక చాఫ్టర్ కొబ్బరికాయల గురించి ఉంటుంది. కొబ్బరికాయ అనేది ఒక పవిత్రమైన వస్తువు. కొబ్బరికాయను పవిత్రతకు చిహ్నంగా వాడతారు. దాన్నే ఎందుకు వాడతారంటే.. కొబ్బరికాయ భూమ్మీద కాయదు.. నెరుగా చెట్టుమీదే కాస్తుంది. దాంట్లో నీరు ప్రకృతి సహజంగా అదే తయారు చేసుకుంటుంది. అందువల్ల కొబ్బరికాయ పవిత్రమైనదిగా భావిస్తారు.
కొబ్బరికాయను దేవుడి దగ్గర కొడితే అహం పోతుంది.. దోషాలు తొలగిపోతాయి.. మంచి జరుగుతుందనే నమ్మకం. ఈ సబ్జెక్టు చదివిన తర్వాత.. నా ఆలోచన విధానాన్ని ఆర్ట్‌కు అనువర్తింపజేశా. ఎలాగంటే.. దేవుడి ముందు కొట్టిన తర్వాత కొబ్బరికాయను బయట విసిరేస్తారు.. అలా విసిరేసిన కొబ్బరి చిప్పలను నేను సేకరించి నా ఆర్ట్‌కు వాడతాను. అంటే కొబ్బరి చిప్పల మీద పూర్తిగా లెదర్ వర్క్ చేశా.
అవి ఎంతో అందంగా, అద్భుతంగా కనిపిస్తాయి. నా ఉద్దేశ్యంలో ఒక పవిత్రమైనదిగా గుర్తింపు పొందిన కొబ్బరికాయ.. అంటరాని వస్తువుగా గుర్తించబడ్డ లెదర్ మెటిరీయల్‌ను ఉపయోగించి అద్భుతాలు చేయొచ్చని చూపించాను. ఏది పవిత్రం? ఏది అపవిత్రం కాదని నా అభిప్రాయం. ప్రకృతిలో లభించేది అంత సహజమైనదే కదా. అలాంటప్పుడు మనుషుల మధ్య తారతమ్యాలు ఎందుకు.
ఇండియా ఆర్ట్ ఫెయిర్‌లో..
మన దేశంలోనే టాప్ షోస్ కేరళలోని కొచ్చిబినాలేలో జరుగుతాయి. ఇది ప్రతి రెండేళ్లకు ఒకసారి జరుగుతుంది. ఈ ప్రదర్శనలో నేను రెండుసార్లు పాల్గొన్నా. అదే సమయంలో ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నెలలో ‘ఇండియా ఆర్ట్ ఫెయిర్’ జరుగుతుంది.
అక్కడి మనదేశంలో పాటు వివిధ దేశాల నుంచి వచ్చిన ప్రముఖ కళాకారుల ప్రదర్శనలు చూడొచ్చు. దాంట్లో కూడా నేను మూడుసార్లు పాల్గొన్నా. ఇప్పుడు వచ్చే నెలలో అంటే ఫిబ్రవరిలో ఇండియా ఆర్ట్ ఫెయిర్‌లో పాల్గొనడానికి మళ్లీ అవకాశం వచ్చింది. ఈ షోలో ‘గ్యాలరీస్ కీ’లో నా వర్క్స్ ప్రదర్శన ఉంటుంది.