- 52 గ్రామాలకు రాకపోకలు బంద్
- సిద్దిపేట జిల్లాలో వరద బీభత్సం
- ఆందోళన వ్యక్తం చేస్తున్న బాధితులు
సిద్దిపేట, సెప్టెంబర్ 2 (విజయక్రాంతి): మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు సిద్దిపేట జిల్లా చిగురుటాకులా వణికింది. రైతులు పండించిన పంట వరద పాలైంది. అక్రమంగా వెంచర్లు చేయడంతోనే వరద పంట వైపు మళ్లిందని రైతులు ఆరోపిస్తున్నారు. సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్, హుస్నాబాద్, చేర్యాల పట్టణాల సమీపంలోని అక్రమ వెంచర్ల కారణంగానే వాటి సమీపంలోని పొలాలు నీటమునిగాయంటున్నారు.
ప్రజ్ఞాపూర్ ఊర చెరువు కట్టకు ఆనుకుని ఉన్న కాలువలో ఓ భవనం కారణంగా నివాసాల్లోకి వరద చేరిందని స్థానికులు వాపోయారు. వరదల కారణంగా మొత్తం 52 గ్రామాల మధ్య రోడ్లు తెగిపోయాయి. దీంతో ఆయా గ్రామాలకు రాక పోకలు నిలిపోయాయయి. దుద్దెడలో చెక్ డ్యాం వరద ధాటికి స్వల్పంగా దెబ్బతిన్నది.
నాలుగు మండలాల్లో అత్యధికంగా..
ఆదివారం రాత్రి నుంచి సోమవారం సాయంత్రం వరకు మిరుదొడ్డి 166.3 మిమీ, సిద్దిపేట రూరల్ 146.5 మిమీ, నారాయణరావుపేట 145.3 మిమీ, కొండపాక మండలంలో 119.0 మిమీ చొప్పున వర్షపాతం నమోందైంది. బెజ్జెంకి మండలం తొటపల్లికి చెందిన సందిరి లక్ష్మణ్ (45) సోమవారం స్నేహితులతో కలిసి చేపలు పట్టేందుకు వెళ్లి కాలువలో పడి గల్లంతయ్యాడు. పోలీసులు గజ ఈతగాళ్ల సాయంతో లక్ష్మణ్ మృతదేహాన్ని బయటకు తీయించారు. గజ్వేల్ మండలంలోని శ్రీగిరిపల్లిలో విద్యుత్ మరమ్మతులు నిర్వహి స్తుండగా షాక్ తగిలి హెల్పర్ వివకుమార్‌ఉ తీవ్రంగా గాయపడ్డాడు. తొటి ఉద్యోగులు క్షతగాత్రుడిని హుటిహుటిన గజ్వేల్ ఆస్పత్రికి తరలించారు. వరద పరిస్థితులను కలెక్టర్ మను చౌదరి ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. కోహెడ మండలం తంగళపల్లిలో వరద బాధిత కుటుంబానికి అదే గ్రామ పంచాయతీలో పునరావాసం కల్పించారు.