ఐక్య విద్యార్థి సంఘాలు
మంచిర్యాల (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థుల మెస్, కాస్మోటిక్ ఛార్జీలు పెంచడాన్ని హర్షిస్తూ ఐక్య విద్యార్థి సంఘాల నాయకులు జిల్లా కేంద్రంలోని గిరిజన ఆశ్రమ వసతి గృహంలో గురువారం విద్యార్థులకు మిఠాయిలు పంచి సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు చిప్పకుర్తి శ్రీనివాస్, రేగుంట క్రాంతి కుమార్ లు మాట్లాడుతూ.. పడేండ్లలో బిఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పుడు కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థులకు సంబంధించి కాస్మొటిక్ ఛార్జీలు పెంచలేదని, మెస్ ఛార్జీలను మాత్రం కేవలం 15 శాతం మేర పెంచి చేతులు దులుపుకుందన్నారు. విద్యార్థుల సంక్షేమాన్ని గాలికి వదిలేసిందని దుయ్యబట్టారు.
కానీ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పేద విద్యార్థుల సంక్షేమాన్ని దృష్ట్యా మెస్, కాస్మొటిక్ చార్జీలు భారీగా పెంచిందని హర్షం వ్యక్తం చేశారు. ఈ పెంపుతో పేద విద్యార్థులకు పౌష్టికాహారం అందుతుందని, తద్వారా విద్యార్థులు చదువుల్లో రాణిస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో సంబంధిత వసతి గృహ వార్డెన్ నైతం లక్ష్మణ్, సంఘాల నాయకులు అజయ్, విష్ణు, తేజ విద్యార్థులు పాల్గొన్నారు.