16-02-2025 12:00:00 AM
వికారాబాద్ జిల్లా పూడూరు మండలంలోని గ్రామం కంకల్. కళ్యాణీ చాళుక్యుల కాలంలో కంకల్ల- ప్రసిద్ధమైంది. ఆ కంకల్‌లో అపురూప మైన వీరగల్లులున్నాయి కంకల్ వీరగల్లులు:
తలపై కుడివైపుకు ఒరిగిన బంతిసిగ, దానికి రిబ్బను, చెవులకు పెద్దకుండలాలు, మెడలో రత్నాలహారం, నడుమున ధట్టీ, దానికి వేలాడుతున్న పట్టాకత్తి, వీరకాసె, కాళ్ళకు కడియాలు, చేతులకు కంకణాలతో రెండుచేతుల్లో పట్టుకున్న బల్లెంతో గుర్రాన్ని వధిస్తు న్న వీరుడు యుద్ధ రంగంలో వున్నాడు.
అతని తలవైపున ఈటెతో దాడిచేస్తున్న అశ్విక వీరుడు, ఎడమకాలివైపు ఇద్దరు అశ్వికులు తనపై దాడి చేస్తున్నారు. వీరునికి పైఅంతస్తులో అప్పరాంగనల వీవెనలతో ఉపచారాలందుకుంటున్న వీరుని శిల్పముంది. ఇది రాష్ట్రకూటశైలి శిల్పం.
తలపై కిరీటంతో కత్తి,బల్లెంతో యుద్ధానికి సిద్ధపడి కనిపిస్తున్న ఈ వీరగల్లు కాకతీయానంతర శిల్పం.
కుడివైపు దూసుడుముడి సిగతో, చెవులకు కుండలాలతో, మెడలో హారంతో, దండకడియాలు, కంకణాలు, కాళ్ళకు కడియాలతో డా కాలు ముందుకు చాపి, వీరకాసెతో రెండుచేతు ల్లో బల్లెంతో కనిపిస్తున్న వీరుడు, శత్రువీరున్ని వధిస్తున్నాడు. తాను యుద్ధంలో అమరుడై వీరస్వర్గమలంకరించినట్లు పైఅంతస్తులో అప్సరాంగనలు చామరాలు వీస్తున్నారు. వీరుడు వీరస్వర్గంలో...
ఒకేచోట నాలుగు వీరగల్లులున్నాయి. ఒక వీరగల్లులో వీరుడు తలవెనక జారుడు సిగముడి తో కనిపిస్తున్నాడు. ఈటెతో పొడిచి శత్రువీరు ణ్ణి పైకెత్తాడు. తాను మరణించి వీరస్వర్గమలంకరించినట్లు పైఅంతస్తులో కనిపిస్తున్నాడు.
అక్కడే వున్న రెండవ వీరగల్లులో వీరుడు బల్లెంతోనే పోరాడుతున్నాడు. నడినెత్తిన కొప్పున్నది. దానికి రిబ్బన్ కట్టివుంది. పై అంతస్తులో తాను వీరస్వర్గంలో వున్నాడు. ఇది రాష్ట్రకూటశైలి వీరగల్లు.
కుడిచేతితో కత్తి భుజం మీద పెట్టుకుని, తలవెనక సిగముడిచి కనిపిస్తున్న వాలుకన్నుల వీరుడు ఎడమచేత బాకు పట్టుకునివున్నట్టుంది. అమరుడై వీరస్వర్గమలంకరించాడు.
తలవెనక సిగతో చేతిలో బల్లెంతో పోరాడుతున్న వీరుని శిల్పం కాకతీయానంతర శిల్పం.
కుడిభుజం మీద కత్తి, ఎడమచేతిలో విల్లుతో కనిపిస్తున్న వీరుడు ఎక్కటి. పలు ఆయుధాలను ప్రయోగించగలిగే కమెండో వంటి వీరుణ్ణి ఎక్కటి, ఏకాంగవీరుడు అంటారు. నడినెత్తిన కొప్పుతో కనిపిస్తున్న ఈ వీరుడు ఎక్కటి.
నడినెత్తిన కొప్పుతో, చెవులకు చిన్న కుండలాలతో, మెడలో కంటెతో, రెండుచేతుల్లో బల్లెం పట్టుకుని శత్రువును దునుమాడుతున్న ఇతడు పశుసంరక్షక వీరుడు. వీరుని కుడిభుజంపైన శాసనం కనిపిస్తున్నది.
అందమైన వీరగల్లు. తలపై ఛత్రం తో, జారుడు సిగముడితో, చెవులకు కుండలాలతో, మెడలో రుద్రాక్షల దండతో, వీరకాసెతో, నడుమున బాకుతో కనిపిస్తున్న వీరుడు తనపై దాడి చేస్తున్న శత్రువీరుణ్ణి ఈటెతో పొడిచి చంపుతున్నాడు.
మరొక శత్రువు కిందపడి వున్నాడు. వీరుడు వీరస్వర్గాన అప్సరాంగనల వీవెనలందుకుంటున్నాడు. ఇది రాచహోదా వీరగల్లు. వీరునికి కుడి, ఎడమపక్కల శాసనం చెక్కివుంది.
కత్తి కుడిభుజాన పట్టుకుని నిలుచున్న వీరునికి ఎడమపక్కన చిన్న లేబుల్ శాసనం కనిపిస్తున్నది. తలభాగం విరిగిన వీరగల్లు
మరొక వీరగల్లు రెండు ముక్కలై వుంది. కాకతీయశైలి శిల్పం.