18-04-2025 12:00:00 AM
వీడ్కోలు సమావేశంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల
నిజామాబాద్ ఏప్రిల్ 17: (విజయ క్రాంతి) న్యాయవాదుల సహకారం వెలకట్టలేనిదని బదిలీపై వెళుతున్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవా అధికార సంస్థ చైర్ పర్సన్ సునీత కుంచాల అన్నారు. నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మామిల్ల సాయరెడ్డి, ప్రధాన కార్యదర్శి మానిక్ రాజు ల ఆధ్వర్యంలో జిల్లాకోర్టు ప్రాంగణంలోని సమావేశపు హల్ లో ఏర్పాటు చేసిన వీడ్కోలు సమావేశంలో ఆమె మాట్లాడారు.
న్యాయవాదులు, న్యాయమూ ర్తుల ఉమ్మడి లక్ష్యం కక్షిదారులకు కాలానుగుణంగా న్యాయసేవలు త్వరితగతిన అందించడమే నని ఆమె పేర్కొన్నారు.న్యాయసేవల లక్ష్య సాధనలో అన్ని అడుగులు అటువైపే పడ్డాయని ఆమె వివరించారు. సివిల్, క్రిమినల్ కేసులను పరిష్కరించేంత వరకు న్యాయమూర్తులుగా, న్యాయవాదులుగా సమిష్టిగా శ్రమించామని జడ్జి సునీత అన్నారు.
సమిష్టి కార్యసాధనలో జిల్లా న్యాయవ్యవస్థ సఫీలికృతం అయిందని,అయిన ఇంకెంతో చేయాల్సింది ఉన్నదని ఆమె అన్నారు. జిల్లా న్యాయసేవ అధికార సంస్థ దైనందిన విధులలో జిల్లా అధికార యంత్రాంగం తోడ్పాటు మరువలేనిదని తెలిపారు. వేలాదిమంది మహిళలకు,బాలికలకు ఆత్మరక్షణ కోసం ఇప్పించిన తైక్వాండో శిక్షణ లిమ్కా బుక్ ఆఫ్ రికార్డులో చోటు దక్కించుకోవడం నిజామాబాద్ మహిళలోకపు చైతన్యశీలికి దక్కిన అరుదైన గౌరవం అని ఆమె అభివర్ణించారు.
బార్ కు బెంచ్ కు మధ్య శ్రీరామవారధిగా నిలుస్తామని బార్ ప్రధాన కార్యదర్శి మానిక్ రాజు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యులు మంథని రాజేందర్ రెడ్డి ప్రసంగిస్తూ మహిళలోకానికి, సామాజిక మార్పుకోసం మూడున్నరేళ్ళ పదవి కాలంలో జిలాజడ్జిగా ,నాయసేవ సంస్థ ఛైర్ పర్సన్ గా పదవులకు వన్నె తెచ్చారని తెలిపారు. అనంతరం మెమెంటో, శాలువతో బదిలీపై వెళుతున్న జిల్లాజడ్జి సునీతకు ఘనంగా వీడ్కోలు పలికారు.
కార్యక్రమంలో బార్ ఉపాధ్యక్షులు దిలీప్, సురేష్,సంయుక్త కార్యదర్శి ఝాన్సీరాణి, కోశాధికారి నారాయణ దాసు,లైబ్రరీ కార్యదర్శి శ్రీమాన్, న్యాయవాదులు రమాదేవి,ప్రభుత్వ న్యాయవాది అమిదాల సుదర్శన్,ఆకుల రమేశ్, కృపాకర్ రెడ్డి, జగదీశ్వర్ రావు,కిరణ్ కుమార్ గౌడ్,మాజీ పిపి మధుసూదన్ రావు,టక్కర్ హన్మంత్ రెడ్డి, అజార్ కిషన్ రావు,వి.భాస్కర్, పరుచూరి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.