calender_icon.png 5 February, 2025 | 7:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పతితుని హృదయం

03-02-2025 12:00:00 AM

“అంతా వచ్చారా? ఏం, మగ్గాల చప్పుడు కావడం లేదే?” అంటూ అధికార ధ్వనిలో డఫేదారు తిరుపతయ్య నేతశాలలో ప్రవేశించి లోపలున్న ఖైదీలను   లెక్కించసాగాడు. అక్కడక్కడ ఇద్దరు, ముగ్గురు కూడి, ఆనాడు ఉదయం ఉరితీయబడ్డ వ్యక్తి గురించి మాట్లాడుకుంటున్న ఖైదీలు తిరుపతయ్య రాగానే తమ స్థానాల్లోకి   వెళ్ళికూర్చున్నారు.

“గండయ్య రానట్టుందే?” తిరుపతయ్య ప్రశ్నించాడు.

“రాలేదు సార్‌” ఒక ఖైదీ జవాబిచ్చాడు.

“ఎంత చెప్పినా వాడికి బుద్ధిరాదు. ఎప్పుడూ ఎక్కడో తిరుగుతుంటాడు. ఎక్కువ శిక్షవాడని నేను కొంచెం చనువుగా మెదులుతుంటుంటే అధికారులతో నాకు మాట తెచ్చేలాగున్నాడు” అంటూ నేతశాల వదలి “మగ్గాలు ఆడనివ్వండి” అని ఆజ్ఞాపించి గండయ్య కొరకు బయల్దేరేడు తిరుపతయ్య.

తిరుపతయ్య అటు పోగానే ఖైదీలు మళ్ళీ మాటల్లో పడ్డారు.

“చూచావుర! తిరుపతయ్య ముఖంలో ఇంతన్నా విచారముందో?”

“విచారమెందుకుర, వాడెవడు, వీడెవడు?”

“పాపము! ఉరి తీసిన సంగతి అతని వాండ్లకు తెలుపుతారో, లేదో.”

“తెలిసికొని మాత్రము ఎవరు ఏం చేస్తారు? వచ్చిన దగ్గరికి చేరుకున్నాడు.”

“అదికాదు కాని, ఓ మనిషిని ఇంకోమనిషి చేతులు కట్టి, ఉరిపెట్టి వ్రేలాడ తీస్తే చచ్చిందాక గుడ్లు మిటకరిస్తూ చూడటానికి అక్కడ నిలుచున్న వాండ్లకెట్లా మనసొప్పిందో? నాకైతే అతని పీనిగెను చూడటానికి గూడ మనసొప్పలేదురా!”

“ఏమి వగలమారి మొగోడివిరా. రేపు నీకు జవాను కొలువిచ్చి ఉరి తీయమంటె తీయక ఏంచేస్తావు? ఖానూను ప్రకారం ఎవరైనా చేయాల్సి వస్తుందోయ్! ఖానూనంటే ఏం, పిల్లకాయలాటనుకున్నావా?”

ఈ విధంగా ఖైదీలు చర్చించుకుంటూండగా తిరుపతయ్య గండయ్యను వెంటబెట్టుకొని నేతశాలకు వచ్చి, మగ్గాల పని ఆగి ఉండుటను చూచి “మీకేమైంది ఈ రోజు. పని బొత్తిగా చేయడం లేదు. చెప్తున్నాను బాగా వినండి. మీ అందరిని దొర దగ్గరకు తీసికెళ్ళి నిలబెడ్త” హెచ్చరించాడు తిరుపతయ్య.

తిరుపతయ్య వెనుక నిలబడి విచారంతో తల నేలకు వేసి ఉన్న గండయ్య “దొర దగ్గరికెందుకు? ఉరి దగ్గరికి తీసుకెళ్ళరాదు?” అంటూ కండ్లనీరు తుడుచుకున్నాడు.

గండయ్య కంటినీరు చూడగానే తిరుపతయ్య చలించిపోయాడు. “ఈవాళ గండయ్య నాటకమాడుతున్నాడే. ఆడదానిలాగ ఏడ్వటం మొదలుపెట్టాడు. ఒక్క సారైనా వాడి ముఖం చూచావో లేదో వాడు చస్తే చుట్టం చచ్చినట్టు ఏడుస్తావెందుకు?” తిరుపతయ్య టోపి క్రిందబెట్టి బీడీ కాలుస్తూ అడిగాడు.

“మా ఖైదీలకు చుట్టాలము మేము కాకపోతే నీవవుతావా? తిరుపతయ్య, పిల్లలు గలవాడివి. సంసారం చేస్తున్నావు కూడ. 25 ఏండ్ల వయసు కుర్రోడ్ని పెండ్లి కొడుకోలె పట్టుకెళ్ళి స్తంభానికేలాడ దీయడానికి నీకు చేతులెట్ల వచ్చాయి? నీకు కోపమొస్తె మానెగాని నీవు మనిషివి కావయ్యా!” అని గండయ్య గంభీరంగా అన్నాడు.

“పిచ్చోడా. నేను కాకపోతే ఇంకోడు తయారవుతాడు ఈ పనికి. ఉరి తీయడానికి మనుషులు లేక ఉరి తీయడం ఆగిపోతుందనుకున్నావా?” తిరుపతయ్య నిర్లక్ష్యంగా జవాబిచ్చాడు ముసిముసిగా నవ్వుతు.

“నీ సంగతేకాదు నేను అనేది. ఉరితీసే వాండ్ల గురించే అడుగుతున్నాననుకో. ఎవడు తీశాడో ఈ పద్ధతి గాని ఉరి తీసిందానికంటె 50 ఏండ్లో 60 ఏండ్లో జైల్లో ఉంచింది మంచిది” గండయ్య అన్నాడు.

“లేకుంటే నీ పద్ధతి అంటే, నీ గ్యాంగు పద్ధతితో చేస్తే యింకా బాగుంటుందిరా?” అంటూ హేళనగా నవ్వాడు తిరుపతయ్య.

“తిరుపతయ్యసార్! మాకంటే నీవు మెరుగని సంతోషిస్తున్నావ్? నీవేమైనా అనుకో మనసు మండి అనేస్తున్నాను.- మేము తప్పు చేస్తే జైలుశిక్ష వేసిన వాండ్లు ఒక మనిషిని ఉరితీసిన వాడికికూడా కఠినశిక్ష వేస్తె బాగుంటుంది” గండయ్య కోపంతో అన్నాడు.

“నేను ఖానూను ప్రకారము ప్రభుత్వ ఆజ్ఞతో ఉరి తీశాను తెలుసా! నన్నెవరు శిక్షిస్తారు? సరేకాని, మాటలు చాలా అయినవి. యిక పోయి మగ్గము మీద కూర్చోపో. దొరవచ్చే వేళైంది” అంటూ తిరుపతయ్య డ్రెస్ సదరుకొంటు గేటువద్ద నిలుచున్నాడు.

“నేను ఇవాళ దొరను కూడా అగుగుతా.. ఏమైనా గాని. ఇంత అన్యాయంగా ఉరి తీయడం బాగ లేదని” అని గండయ్య కూడా తిరుపతయ్య పక్కన నిలుచున్నాడు.

తిరుపతయ్య కోపం నటిస్తు “ఒరే! నీకు సిగ్గెందుకు లేదు. నీవు మీ గ్యాంగువాళ్ళు కలిసి ఎంతమంది ప్రాణాలు తీసారురా? ఎంతమంది పెండ్లిండ్లను ఎత్త కొట్టారురా? ఎన్ని కొంపల్ను నాశనం చేశారురా? అటువంటి నీవు ఎవరినో ఉరి తీసినందుకు ఏడుస్తున్నావు? ఏమేమో వాదిస్తున్నావా? పైగా దొరను అడుగుతాడట దొరను. ఎప్పుడైతివి పత్తిత్తువు” అని గట్టిగా మందలించాడు తిరుపతయ్య.

గండయ్య కడుపులోని దుఃఖము ఇప్పుడు రౌద్రరూపము దాల్చింది. తానొక ఖైదీనని, అధికార సిబ్బందిలోని ఒక వ్యక్తితో మాట్లాడుతున్నాననే సంగతే మరచిపోయాడు. ఉగ్రుడై “మాటికి మాటికి మాతో పోల్చుకోవడానికి నీకు నోరెట్లా వస్తుంది. తప్ప త్రాగి, ఉడికీ ఉడకని మాంసము తిని, బజారుముండలతో కాలము గడిపే మేము ఒళ్ళు మరచి ప్రాణాలు తీశాం. దార్లుకొట్టి పెండ్లిపిల్లలపై నగలు అపహరించాం. ఇండ్లలో జొరబడి దోచుకున్నాం. మత్తు దిగిం తర్వాత ఒక్కొక్కప్పుడు మా చేష్టలకు మేమే పశ్చాత్తాపపడ్డాం. మేము చదువురాని మొద్దులం. మాలో చదివినోడు గాని, మంచి చెడ్డ తెలిసినోడుగాని ఒకడుండడు. చిన్నప్పటి నుండి దొంగల సావాసంలో పెరిగాం. వాండ్లలో తిరిగాం. అవే బుద్ధులు, అదే బతుకు. ఇప్పటికైనా మమ్ముల ఈ పనినుండి మాన్పించి మంచి విద్యావంతులుగా బుద్ధిమంతులుగా తయారు చేయడాని కెవరైనా ముందుకొస్తే మా గ్యాంగు మాటేమోగాని నా వరకు నేను సిద్ధంగా ఉన్నాను.

మరి, నీ సంగతేమంటావు? ఏదో ఖానును ప్రకారమని అన్నావే. చదువుకున్న పెద్దలు, మావంటి వాండ్లను జేల్లో పెట్టి బాగు చేయతలచుకున్న పెద్దలు, మనిషిని చంపేదానికి ఖానూను వ్రాస్తే వాండ్లనుండి మావంటి వాండ్లు ఏం నేర్చుకోవాలె? ఒకడు మనిషిని చంపడమే తప్పు అంటున్న ఖానూను, ఇంకొకడిని ఉరి తీసి చంపమని ఎట్లా అంటుంది? మాట్లాడవేం! తిరుపతయ్యసార్!” గండయ్య గుడ్లెర్ర జేసి గట్టిగా అడిగాడు.

తిరుపతయ్య వింతగా గండయ్య వైపు చూస్తు “ఒరే! నీకు పిచ్చిలేసేటట్టున్నదిరా పో! లోపలికి పో! దొర వస్తున్నాడు” అంటూ తిరుపతయ్య క్రమశిక్షణతో నించున్నాడు. గండయ్య కూడా దూరంగా నిలుచొని జేలరు వచ్చేవైపు చూస్తున్నాడు.

జేలర్, జేలర్ వెంట జమేదార్ గేటు లోపలికి ప్రవేశించగానే జమేదారు రౌద్రముతో గండయ్య నుద్దేశించి అన్నాడు “ఏమిరా? నీవు ఈ రోజు గంజి తీసుకోలేదేం?”

గండయ్య జేలరుకు దండం పెట్టి “అయ్యా! ఉరి తీసినప్పటి నుండి నాకు కడుపులో ఎట్లాగో ఉంది. నాకెటు తోచడం లేదు. మీరు చదువుకున్నోరు కూడా ఇటువంటి పనులు చేస్తే ఇక మా సంగతి ఎవరు అడుగాలె” అని గండయ్య ప్రశ్నించాడు.

జమేదారు అధికార ధ్వనిలో “నీవు గంజి త్రాగుతావా లేదా?” అని గర్జించుతు ఓరకంటితో జేలరువైపు చూచాడు. జేలర్ అయోమయస్థితిలో కపట బింకముతో తలనాడించాడు.

“తాగను సార్!” గండయ్య నిర్భయంగా జవాబిచ్చాడు.

“ఒంటిగదిలో మూసేసి తర్వాత నా వద్దకు తీసికొని రాండి. వాడికి మంచిగా బుద్ధి చెప్పితే రోగం కుదురుతుంది. గంజి తాగుతాడు. చదువుకున్నోళ్ళ సంగతి తెలుస్తుంది” అంటూ వెళ్ళిపోయాడు జేలరు.

ప్రచురణ కాలం: 1952

‘జైలు లోపల’ కథాసంపుటి నుంచి..

‘కథా నిలయం’ సౌజన్యంతో.