వైద్య సేవలను పర్యవేక్షిస్తున్న అధికారులు
సౌత్ గ్లాస్ పరిశ్రమను సందర్శించిన ఎమ్మెల్యే
పత్తాలేని పరిశ్రమ యజమాని శైలేష్ అగర్వాల్
రంగారెడ్డి, జూన్ 29 (విజయక్రాంతి): షాద్‌నగర్ సమీపంలోని సౌత్ గ్లాస్ పరిశ్రమలో శుక్రవారం రియాక్టర్ పేలిన ఘటనలో తీవ్రంగా గాయపడిన కార్మికుల ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం కొంత నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. గాయపడిన కార్మికులు మైఖేల్, ఇమ్రాన్, సుబోద్, గోవింద్, మంతు, సమీత్‌కుమార్, రోషన్ కుమార్, రాజేశ్ పాషా, సుజాత, నీలమ్మ, మమత, రాతికాంత్, సురేంద్ర పాశ్వాన్, కార్తీక్‌లకు ప్రస్తుతం షాద్‌నగర్, శంషాబాద్ దవాఖానల్లో వైద్యసేవలు కొనసాగుతున్నట్లు ఆర్డీవో మాధవరావు శనివారం తెలిపారు.
కార్మికులకు అందుతున్న వైద్య సేవలను పర్యవేక్షించడంతో పాటు వారి ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్ శశాంకకు నివేదిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రమాదంలో మృతిచెందిన కార్మికుల మృతదేహాలకు షాద్‌నగర్ ప్రభుత్వ దవాఖానలో పోస్టుమార్టం పూర్తి చేసి వారి బంధువులకు అప్పగించడంతో పాటు అంత్యక్రియల నిమిత్తం వారి స్వగ్రామాలకు ప్రత్యేక వాహనంలో తరలించే ఏర్పాట్లను అధికారులు పర్యవేక్షించారు.
ఎమ్మెల్యే మండిపాటు..
సౌత్ గ్లాస్ పరిశ్రమలో భారీ పేలుడు కారణంగా ఐదు మంది కార్మికులు మృతిచెందడంతో పాటు పలువురు కార్మికులు గాయపడటం దురదృష్టకరమని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. దవాఖానలో చికిత్సపొందుతున్న కార్మికులను పరామర్శించి వారి ఆరోగ్యపరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకొన్నారు. అనంతరం పరిశ్రమను సందర్శించి ప్రమాద విషయాలపై కార్మికులను కలిసి ఆరా తీశారు. ప్రమాదం చోటుచేసుకున్న అనంతరం కంపెనీ యజమాని శైలాష్ అగర్వాల్ అందుబాటులో లేడని కార్మికులు తెలపడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ విషయంపై డైరెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ రాజగోపాల్‌రావుతో ఫోన్‌లో మాట్లాడి కంపెనీ యజమానులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వపరంగా ఆదుకోవడంతో పాటుగా వారికి రూ.25 లక్షలు పరిహారం అందే విధంగా సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. ప్రమాద సమయంలో సహాయక చర్యల్లో పాల్గొనకుండా అక్కడి నుంచి పరారైన కంపెనీ యజమానిపై హత్యా నేరం కింద కేసు నమోదు చేయాలని ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాగా, ప్రమాదం చోటుచేసుకున్న కంపెనీని సీఐటీయూ జిల్లా నాయకులు సందర్శించి కార్మికులతో మాట్లాడారు. పొట్ట చేతబట్టుకొని వచ్చిన కార్మికులతో వెట్టిచాకిరీ చేయిస్తూ వారి జీవితాలతో చెలగాటం ఆడుతున్న పరిశ్రమ యజమానులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కేసు నమోదు..
సౌత్ గ్లాస్ పరిశ్రమ యజమానులపై శనివారం పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ప్రమాద సమయంలో కంపెనీ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించారని వచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసినట్లు షాద్‌నగర్ ఏసీపీ రంగస్వామి వెల్లడించారు.