లక్ష రూపాయల బోనస్ పడడంతో సంబరం
సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు చిత్రపటాలకు పాలాభిషేకం
మంథని (విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండల కేంద్రానికి చెందిన కౌలు రైతు ఓడ్నాల సూర్యం కు లక్ష రూపాయల బోనస్ తన బ్యాంక్ ఖాతాలో పడటంతో కౌలు రైతు సూర్యం కళ్ళల్లో ఆనందం వెల్లువెరిసింది. ఈ సందర్భంగా కౌలు రైతు సూర్యం స్వచ్ఛందంగా సంతోషంతో శుక్రవారం కమాన్ పూర్ మండల కేంద్రంలోని ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్ర ఆవరణలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు చిత్రపటాలకు కాంగ్రెస్ నాయకుల సమక్షంలో పాలాభిషేకం చేశారు. అనంతరం అందరికీ స్వీట్లు పంపిణీ చేసి తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.
రైతు సూర్యం తనకు 1.20 ఎకరాల పొలం మరో 10 ఎకరాలు కౌలుకు తీసుకొని సన్నధాన్యం సాగు చేశారు. ఈ సందర్భంగా కౌలు రైతు సూర్యం మాట్లాడుతూ.. సన్నధాన్యం క్వింటాల్ కు బోనస్ రూ. 500 చొప్పున అందిస్తూ రైతులకు అండగా నిలుస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు, కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతులందరూ అండగా నిలుస్తామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని మరో మారు నిరూపించుకుందని అన్నారు. ఈ కార్యక్రమంలో రైతులతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు హమాలీలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.