calender_icon.png 19 April, 2025 | 12:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేట్రేగుతున్న మట్టి మాఫియా

12-04-2025 01:28:00 AM

అసైన్డ్ భూముల్లో అనుమతి లేకుండా తవ్వకాలు

రాత్రిపూట అక్రమంగా తరలింపు

మహబూబాబాద్, ఏప్రిల్ 11 (విజయక్రాంతి): మట్టి మాఫియా పెట్రేగిపోతున్నది. పగలంతా గప్చుప్గా ఉంటూ రాత్రివేళల్లో ట్రిప్పర్ల ద్వారా మట్టిని తరలిస్తున్నది. ఎలాం టి అనుమతి లేకుండా అసైన్డ్ భూముల్లోంచి ఇష్టారీతిన మట్టి తరలిస్తు లక్షలు సంపాదిస్తున్నది. ఇంత జరుగుతున్నా అధికారులు చూసీచూడనట్టు వ్యవహరిస్తుండ టం అనుమానాలకు తావిస్తున్నది.

మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలంలో మట్టి అక్రమార్కులు  చెలరేగిపోతున్నారు. రాత్రివేళల్లో అక్రమంగా మట్టి తరలిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. కేసముద్రం మండలం సప్పిడిగుట్ట తండా శివారులో కొద్దిరోజులుగా బాహాటంగా వేల ట్రిప్పుల మట్టిని తరలించి లక్షల రూపాయలు దండుకుంటున్నారని తండావాసులు ఆరోపిస్తున్నారు. యంత్రాలను పొద్దంతా ఖాళీగా ఉంచి రాత్రిపూట మట్టిని యథేచ్ఛగా తరలిస్తున్నారని ఆరోపిస్తున్నారు. 

బెదిరిస్తూ అసైన్డ్ భూముల్లోంచి 

కొందరు గిరిజనులకు గతంలో ప్రభు త్వం అసైన్డ్ చేసిన భూముల్లోంచి అక్రమార్కులు మట్టి తోలకాలు చేస్తున్నారు. తమ భూమిలోంచి తమ అనుమతి లేకుం డా మట్టి తరలించుకుపోతున్నారని వాపోతున్నారు. మట్టి తరలింపుపై కొందరు అసైన్డ్ భూమి బాధితులు మట్టి మాఫియా మనుషులను ప్రశ్నిస్తే.. దిక్కున్న చోట చెప్పుకోండి.. మాకేం కాదంటూ దబాయిస్తున్నా రని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే వందల ట్రిప్పుల మట్టిని తరలించారని, ఫలితంగా తమ భూములు సాగుకు పనికిరా కుండా పోయే పరిస్థితి ఏర్పడిందని బాధితులు ఆరోపిస్తున్నారు. మట్టి మాఫియా ఆగడాలకు అధికారులు అడ్డుకట్ట వేయాలని కోరుతున్నారు.

మట్టి తరలింపునకు అనుమతి లేదు

సప్పిడి గుట్ట గ్రామపంచాయతీ పరిధిలో మట్టి తరలింపునకు రెవెన్యూ శాఖ ఎలాంటి అనుమతి ఇవ్వలేదు. గతంలో మట్టి తరలిస్తున్నట్టు మాకు ఫిర్యాదు రావడంతో ఘటన స్థలికి వెళ్ళాం. అక్కడ ఎలాంటి యంత్రాలు కనిపించలేదు. తాజాగా మట్టి తరలిస్తున్న ఘటన మా దృష్టికి వచ్చింది. విచారణ జరిపి చర్యలు తీసుకుంటాం. 

 -తహసీల్దార్, కేసముద్రం