calender_icon.png 27 September, 2024 | 2:46 PM

అంజన్న నడయాడిన నేల

27-09-2024 12:00:00 AM

బీచుపల్లి ఆంజనేయ స్వామి దేవాలయం :

గద్వాల జిల్లా ఇటిక్యాల మండలంలో కృష్ణానది తీరాన వెలసిన ‘బీచుపల్లి ఆంజనేయస్వామి’ ఆలయానికి విశిష్టమైన చరిత్ర, పౌరాణిక ప్రాశస్త్యం ఉన్నాయి. ఈ ఆలయం ప్రకృతి అందాలకు నెలవు. వేలసంఖ్యలో భక్తులు ఇక్కడికి వచ్చి తమ మొక్కులు చెల్లించుకోవడం విశేషం. బోయ జాతికి చెందిన వారు ఇక్కడ అనాదిగా పూజారులుగా కొనసాగుతున్నారు.

గద్వాల రాజుల నిర్మాణాలు

శ్రీ కృష్ణ దేవరాయలకు గురువు వ్యాసరాయులు. ఆ కాలంలోనే బీచుపల్లిలోని ఈ పవిత్ర ప్రదేశంలో ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట జరిగినట్లు చరిత్ర చెబుతున్నది. ఈ లెక్కన ఆలయం 16 వ శతాబ్దికి చెందిందిగా భావిస్తున్నారు. ఇక్కడ దేవాలయ కట్టడాలను సుమారు 300 ఏండ్ల కిందట గద్వాల రాజులు నిర్మించారని స్థానికులు చెబుతున్నారు. ఆలయ గర్భాలయం, ఆలయం నుండి కృష్ణానదికి వెళ్లే మార్గం, కృష్ణానది ఒడ్డునగల శివాలయం వంటివీ ఆనాడే వారి హయాంలో నిర్మితమైనట్లు ఆలయ చరిత్ర ద్వారా తెలుస్తున్నది. 

కణ్వమహర్షి పుణ్యమే

ఇక్కడ కణ్వమహర్షి తపస్సు చేస్తుండగా, ఆంజనేయ స్వామి సంచరించినట్లు పౌరాణికులు చెబుతున్నారు. కృష్ణానది జలసవ్వడి, ఆధ్యాత్మిక పవిత్రతల మధ్య ఈ క్షేత్రం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నది. ప్రతి ఏడూ వచ్చే రెండు హనుమాన్ జయంతులు, మధ్యలో వచ్చే పున్నమి (వైశాఖ శుద్ధ పౌర్ణమి) సందర్భంగా పెద్ద ఎత్తున బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. మొదటి రోజు తేరు (రథం) కార్యక్రమంలో భక్తుల తాకిడి ఇసుక వేస్తే రాలనంతగా ఉంటుంది. ‘బీచుపల్లి రాయ గోవింద గోవిందా’ అంటూ స్వామివారికి దాసంగాలు, హరిదాసుల భజనలు, బయని వారి డమ్కీలు, కోలాట చప్పుళ్లతో వేడుకలు అత్యంత అట్టహాసంగా జరుగుతాయి.

భక్తుని పేరుమీదే ఊరు

వ్యాసరాయుని స్వప్నంలో ఆంజనేయ స్వామి కనబడి, ‘రేపు సూర్యోదయ వేళకు ముందుగా తనను ఎవరు దర్శించుకుంటారో వారినే అర్చకులుగా నియమించాలి’ అని సూచించినట్లు తెలుస్తున్నది. మర్నాడు ఉదయం సమీప గ్రామం నుండి ఒక బోయ పిల్లవాడు పశువులను తోలుకుని ఆంజనేయ స్వామిని దర్శించుకున్నాడు. అప్పట్నుంచీ బోయలే ఆలయ పూజారులుగా కొనసాగుతున్నారు. ‘బీచుపల్లి’ గ్రామం కూడా భక్తుడి పేరుమీదే ప్రసిద్ధినొందడం గమనార్హం.

-  పి. రాము, 

విజయక్రాంతి, 

గద్వాల (వనపర్తి)