calender_icon.png 21 February, 2025 | 1:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇసుకాసురుల ధనదాహం

19-02-2025 01:21:26 AM

బొక్కుడే..

  1. ఓవర్ లోడింగ్ ద్వారా అదనంగా డంపింగ్
  2. బ్లాక్‌మార్కెట్‌లో రోజుకు 30 వేల టన్నులు విక్రయం
  3. టన్ను ఇసుకకు సర్కారు ధర రూ.1,600
  4. వినియోగదారుడి నుంచి అదనంగా 3,400 వరకు కాంట్రాక్టర్ల వసూలు.. రాష్ట్ర ఖజానాకు గండి

కొడవలికంటి నవీన్ :

హైదరాబాద్, ఫిబ్రవరి 18 (విజయక్రాంతి): రాష్ట్రంలో ‘ఇసుకా’సురులు రెచ్చి పోతున్నారు. మైనింగ్‌శాఖ చూసీ చూడనట్లు వ్యవహరిస్తుండడంతో ఇసుక రీచ్ ల నుంచి అక్రమంగా ఇసుకను తోడేస్తున్నారు. అందినకాడికి దోచుకుంటూ రాష్ట్ర ఖజానాకు గండికొడుతున్నారు. ఇలా ఒకటి కాదు.. రెండు కాదు.. రోజుకు అనధికారికంగా 30 వేల టన్నుల ఇసుకను తరలిస్తూ అదనంగా ఆర్జిస్తున్నారు.

అందుకు ‘ఓవర్ లోడింగ్’ విధానాన్ని వాడుకుంటున్నారు. రవాణా ఖర్చులతో కలిపి ఒక టన్ను ఇసుకను వినియోగదారుడికి రూ.1,600కే అందివ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించగా, ఇసుకాసురులు మాత్రం అడ్డదారిలో టన్ను ఇసుకను రూ.5 వేల నుంచి రూ.7 వేల వరకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు.

 ప్రభుత్వ ధర కంటే అక్రమార్కులు టన్ను ఇసుకకు తక్కువలో తక్కువ రూ.3,400 వరకు అదనంగా వసూలు చేస్తున్నారు. హైదరాబాద్‌లోని కొన్నిఏరియాల్లో ఇసుక కొరత ఎక్కువగా ఉండడం తో ఆయా ప్రాంతాల్లో టన్ను ఇసుక ధర గరిష్ఠంగా రూ.10 వేల వరకు పలుకుతుండడం గమనార్హం. అనధికారికంగా పెరిగిన ఇసుక ధరలతో నిర్మాణదారులు బెంబేలెత్తుతున్నారు. ఆర్థిక భారం మోయలేక ఇబ్బందు లు ఎదుర్కొంటున్నారు.

ఇసుక దోపిడీ మూడు రకాలు..

ఇసుక రీచ్‌లో ప్రతిరోజూ పరిమితికి మించి ఇసుక తరలిపోతున్నది. తెలంగాణ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (టీజీఎండీసీ) రోజుకు 50వేల టన్నుల ఇసుక విక్రయిస్తున్నామని అధికారికంగా చెప్తున్నప్పటికీ, అనధికారికంగా మరో 30వేల టన్నుల వరకు ఇసుక రీచ్‌ల నుంచి తరలిపోతున్నదని తెలుస్తున్నది. ఇలా సర్కార్ ఆదాయా నికీ భారీగా గండిపడుతున్నది. 

* ఇసుక దోపిడీ మూడు రకాలుగా జరుగుతున్నది. అక్రమార్కులు రోజుకు అక్రమంగా తరలిస్తున్న 30 వేల టన్నుల ఇసుకకు కాంట్రాక్టర్లు ఒక్క రూపాయైనా సర్కార్‌కు చెల్లించరు. ఓవర్ లోడింగ్‌తో అక్రమంగా ఇసుకను బయటకు తీసుకొచ్చి, టన్ను ఇసుకను రూ.5 వేలకు పైగా విక్రయించినా రోజుకు రూ.15 కోట్ల వరకు అదనంగా ఆర్జిస్తున్నారు. అంటే.. నెలకు సుమారు రూ.450 కోట్లన్నమాట. ఈ లెక్కన ఏడాదికైతే ఏకంగా రూ.5,400 కోట్ల అంటే.. దందా ఏ రీతిన జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు.

* ఓవర్ లోడింగ్ ద్వారా రోజుకు 30 వేల టన్నుల ఇసుక తరలిపోతున్నది. నిబంధనల ప్రకారం ఒక్కో టన్ను ఇసుకకు ప్రభుత్వానికి రూ.1,600 అందాల్సి ఉన్నది. కానీ.. వారు సర్కార్‌కు పైసా ఆదాయం లేదు. దీంతో రాష్ట్ర ఖాజానాకు రోజుకు రూ.4.8 కోట్లు, నెలకు రూ.144 కోట్లు, ఏడాదికి రూ.1,728 కోట్ల ఆదాయానికి గండిపడుతున్నది. 

* ఇక వినియోగదారుడి కోణం నుంచి ఆలోచిస్తే.. మైనింగ్‌శాఖ రోజుకు అధికారికంగా 50 వేల టన్నుల ఇసుక వినియోగదారులకు విక్రయిస్తున్నది. అక్రమార్కులు అదనంగా 30 వేల టన్నుల ఇసుకను అక్రమంగా విక్రయిస్తున్నారు. అంటే రోజుకు 80 వేల టన్నుల ఇసుక మార్కెట్‌లో అమ్ముడవుతుందన్నమాట.

ప్రభుత్వ నిబంధన ప్రకారం.. వినియోగదారుడు టన్ను ఇసుకకు కేవలం రూ.1,600 మాత్రమే చెల్లించాల్సి ఉన్నది. కానీ.. ఒక్కో వినియోగదారుడు ఒక టన్నుకు రమారమీ రూ.3,400 అదనంగా వెచ్చించి ఇసుక కొంటున్నాడు. అంటే రోజుకు వినియోగదారుల నుంచి అక్రమార్కులు రోజుకు రూ.272 కోట్లు దోచేస్తున్నారు. ఇలా నెలకు రూ.8,16 కోట్లు, ఏడాదికి ఏకంగా రూ.9,792 కోట్లు దండుకుంటున్నారంటే దందా ఏ స్థాయిలో ఉందో ఊహించొచ్చు. 

త్రిముఖ వ్యూహం అమలు..

ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు సర్కార్ సిద్ధమైంది. దీనిలో భాగంగా త్రిముఖ వ్యూహాన్ని అమలు చేస్తున్నది. తొలుత సమస్య మూలాలు ఎక్కడున్నాయో తెలిస్తే, దానికి సులభంగా పరిష్కారం ఆలోచించొచ్చని ప్రభుత్వం అవగాహనకు వచ్చింది. దీనిలో భాగంగా తొలి వ్యూహం లో భాగంగా అక్రమంగా ఇసుక రవాణా అవుతున్న రీచ్‌లపై ఫోకస్ పెట్టింది.

దందాను కాంట్రాక్టర్లే నడిపిస్తున్నారని ప్రాథమికంగా గుర్తించింది. ఇలా తొలుత ఇసుక రీచ్‌లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయిస్తున్నది. ఇసుక స్థానిక డంపింగ్ పాయింట్‌కు వెళ్లకుండా, ఇతర ప్రాంతాలకు వెళ్తున్నట్లు గుర్తించి, వెంటనే వాహనాలకు జీపీఎస్ వ్యవస్థ అమర్చాలని నిర్ణయించింది.

రెండో వ్యూహంలో భాగంగా ఇసుక రవాణాపై నిరంతరం అధికారుల నిఘా ఉండేటట్లు సర్కార్ జాగ్రత్త వహిస్తున్నది. ప్రతిరోజూ యంత్రాంగం వాహన తనిఖీలు చేపట్టే విధంగా చర్యలు తీసుకుంటున్నది. మూడో వ్యూహంలో భాగంగా.. ఇసుక విక్రయాల్లో మధ్యవర్తులు, కాంట్రాక్టర్ల ప్రమేయం లేకుండా ప్రభుత్వమే వినియోగదారులకు ఇసుక విక్రయిస్తే, ప్రభుత్వానికి ఆదాయంతో పాటు అక్రమ రవాణాకు చెక్ పెట్టినట్లు ఉంటుందని సర్కార్ భావిస్తున్నది.

టాస్క్‌ఫోర్స్ బృందాల నిఘా.. 

ఇసుక అక్రమ రవాణా రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారిన వేళ ప్రభుత్వం ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకున్నది. రెండు నెలల్లో ఇసుక రవాణా వ్యవస్థను ప్రక్షాళన చేసే దిశగా అడుగులు వేస్తున్నది. సీఎం రేవంత్ రెడ్డి ఇసుక మాఫియా ఆగడాలను ఉపేక్షించొద్దని అధికారులను ఆదేశించారు.

మైనింగ్ శాఖ ఆధ్వర్యంలో ఆయా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీల పర్యవేక్షణలో ఎక్కడికక్కడ టాస్‌ఫోర్స్ బృందాలు ఏర్పాటు చేస్తున్నారు. బృందాలు క్షేత్రస్థాయికి వెళ్లి వాహన తనిఖీలు చేస్తున్నాయి. ఇసుక రీచ్‌లు, ఇసుక సరఫరా చేసే వారిపై నిరంతర నిఘా పెడుతున్నాయి.

ఇసుక అక్రమాలపై టాస్క్‌ఫోర్స్ కొరడా

నగరంలో 1098 టన్నుల ఇసుక సీజ్

హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 18 (విజయక్రాంతి): నగరంలో నిబంధనలకు విరుద్దంగా ఇసుకను విక్రయిస్తున్న వారిపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు కొరడా ఝులిపిస్తున్నారు.  జాయింట్ ఆపరేషన్‌లో భాగంగా టాస్క్‌ఫోర్స్ పోలీసులు, రెవెన్యూ అధికారులు మంగళవారం పలు ప్రాంతాలలో మొత్తం 1098 టన్నుల ఇసుకను సీజ్ చేశారు.

నార్త్ జోన్ పరిధిలో తుకారం గేట్, బోయిన్‌పల్లి, తిరుమలగిరి, బేగంపేట, సికింద్రాబాద్ ప్రాంతాల్లో 889 టన్నులు, వెస్ట్ జోన్ పరిధిలో యూసుఫ్‌గూడ జానకమ్మ తోటలో 143 టన్నులు, సెంట్రల్ జోన్ పరిధిలోని ముషీరాబాద్, గాంధీనగర్, దోమలగూడ ప్రాంతాలలో 66 టన్నుల ఇసుకను సీజ్ చేసినట్టు టాస్క్‌ఫోర్స్ డీసీపీ వైవీఎస్ సుధీంద్ర తెలిపారు.

ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అనధికారికంగా ఇసుకను డంప్ చేస్తూ అక్రమాలకు పాల్పడుతున్న వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఇసుక వ్యాపారం చేసేవారు మైనింగ్ శాఖ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని పేర్కొన్నారు.