calender_icon.png 24 November, 2024 | 2:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీజేపీలో ఉత్సాహాన్ని నింపిన మహా ఫలితాలు

24-11-2024 12:58:16 AM

  1. ప్రచారం చేసిన నేతల్లోవెల్లువెత్తిన ఉత్సాహం
  2. టీ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై ప్రచారం 

హైదరాబాద్, నవంబర్ 23 (విజయక్రాంతి): గత కొన్ని రోజులుగా మహారాష్ట్ర ఎన్నికలు తెలంగాణ రాజకీయాల్లో అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధానికి వేదికగా నిలిచాయి. ఊహించని విధంగా అత్యధిక స్థానాలతో సత్తా చాటిన బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి విజయం తెలంగాణ కమలనాథుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది.

మహారాష్ట్ర ఎన్నికల్లో ప్రచారం చేసిన తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీలు, ఎమ్మెల్యేలు తెలంగాణలో కాంగ్రెస్ హామీల వైఫల్యంపైనే ప్రధానంగా దృష్టి సారించారు. కాంగ్రెస్ హామీలతో ప్రజలను ఏ విధంగా మోసం చేసిందో మరాఠా ప్రజలకు వివరించారు. మహారాష్ట్రలో ఉన్న తెలుగు ప్రజలను కలిసి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలన వైఫల్యాలను వివరించారు.

తెలంగాణలో ఎంపీ ఎన్నికల్లో 8 స్థానాలను కైవసం చేసుకున్న పార్టీ నేతలు మహారాష్ట్ర ఎన్నికల్లో ఉత్సాహంగా ప్రచారం చేపట్టారు. ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీపై రేవంత్‌రెడ్డి చేసిన విమర్శలనూ టీ బీజేపీ నేతలు సమర్థంగా తిప్పికొట్టారు. ముంబైలోనే కిషన్ రెడ్డి ప్రెస్‌మీట్ పెట్టి మరీ ఈ అంశంపై మహా ప్రజలకు వివరించారు.

మహారాష్ట్రలో బీజేపీ కూటమి అధికారంలోకి వస్తుందని భావించిన టీ బీజేపీ నేతలు.. వారు ఊహించని విధంగా 288 స్థానాలకు గాను 234 స్థానాల్లో బీజేపీ కూటమి విజయం సాధించింది. ఇందులో బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా 132 చోట్ల విజయం సాధించింది. కాంగ్రెస్ కూటమి కేవలం 50 సీట్లకే పరిమితమైంది. ఇక కాంగ్రెస్ పార్టీ ఘోరంగా కేవలం 16 స్థానాలకు మాత్రమే పరిమితమైంది.

ఈ పరిణామం టీ బీజేపీకి కొత్త ఊపిరినిచ్చింది. తెలంగాణ సరిహద్దుగా ఉన్న మహారాష్ట్ర ఫలితాలను రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలోనూ రాబడతామని టీ బీజేపీ నేతల్లో ఆశలు కనిపిస్తున్నాయి. దక్షిణాదిలో ఊహించని విధంగా బలం పెంచుకుంటున్న బీజేపీ మహా ఫలితాలతో కొత్త ఉత్సాహాన్ని నింపుకుంటోందని కమలనాథులు భావిస్తున్నారు.

కాంగ్రెస్ పార్టీ ఘోర వైఫల్యం తమకు అనుకూలంగా మారనుందని ఆ పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. తెలంగాణలో రాబోయే రోజులు బీజేపీవేనని ఆ పార్టీ భావిస్తోంది.