16-02-2025 12:19:30 AM
* నేటి నుంచి దురాజ్‌పల్లి లింగమంతులస్వామి జాతర
* గంపల ప్రదక్షిణతో శ్రీకారం చుట్టనున్న నిర్వాహుకులు
* రాత్రి కేసారం నుంచి రానున్న చౌడమ్మతల్లి దేవరపెట్టె
సూర్యాపేట, ఫిబ్రవరి 15 (విజయక్రాంతి): రెండేళ్లకు ఒకసారి జరిగే పెద్దగట్టు జాతరకు వేళయ్యింది. యాదవుల ఆరాధ్య దైవంగా భావించే చివ్వెంల మండలం దురాజ్‌పల్లిలోని శ్రీలింగమంతుల స్వామి జాత ఆదివారం గంపల ప్రదక్షిణతో శ్రీకారం చుట్టునున్నారు. ఇదేరోజు రాత్రి కేసారం గ్రామం నుంచి చౌడమ్మతల్లి దేవర పెట్టెను ఆలయానికి తీసుకొస్తారు.
బోనాలు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఐదు రోజుల పాటు జరిగే ఈ జాతరతో ఆ ప్రాంతమంతా గజ్జెల లాగుల గలగలలు.. భేరీ మోతలు.. కటారు విన్యాసాలు.. ఓలింగా.. ఓ లింగా.. నామస్మరణలతో సందడిగా మారనుంది. ఈ జాతర కోసం అధికారులు, దేవస్థానం కమిటీ వారు అన్ని ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టారు.
తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుంచే కాకుండా మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు నుంచి భక్తులు తరలివస్తారు. ఆలయ కమిటీ, దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో జాతర కోసం లింగమంతుల స్వామి ఆలయానికి రంగులు వేసి సంప్రోక్షణ చేశారు. మెట్లు, ప్రవేశ ద్వారానికి కూడా రంగులు వేశారు. రవాణాకు బస్సు సౌకర్యం, తాగునీటి వసతి కల్పించడంతో పాటు, చలువ పందిళ్లు వేశారు.