నాచగిరితో పాటు వైష్ణవాలయాలలో ఘనంగా కల్యాణ వేడుకలు
గజ్వేల్, జనవరి 13: సిద్దిపేట జిల్లా నాచగిరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి క్షేత్రంలో ధనుర్మాస ముగింపులో భాగంగా గోదా రంగనాయక స్వామి కళ్యాణం అత్యంత వైభవోపేతంగా సోమవారం నిర్వహించారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ఆలయ ఈవో విశ్వనాథ శర్మ సారధ్యంలో కల్యాణ ఏర్పాట్లు ఘనంగా నిర్వహించారు.
స్వామివారిని అమ్మవారిని ఊరేగించి కళ్యాణ వేదిక పైకి తీసుకువచ్చారు. ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా వేదమంత్రాలు చదువుతుండగా మంగళ వాయిద్యాల నడుమ గోదా రంగనాయక స్వామి కళ్యాణం జరిగింది. అలాగే గజ్వేల్ పట్టణంలోని శతాబ్దాల చరిత్ర గల శ్రీ సీతారామ ఉమామహేశ్వరాలయంలో ధర్మకర్తలు వైష్ణవులు, భక్తులు మధ్య వైభవంగా ప్రధాన అర్చకులు శ్రీనివాసాచార్యులు, వేద పండిత ఆచార్యుల చేతుల మీదుగా కళ్యాణ వేడుకలు నిర్వహించారు.
వెంకటేశ్వర ఆలయంలో ప్రధాన అర్చకులు శేషం శ్రీనివాసాచార్యుల ఆధ్వర్యంలో గోదాకల్యాణాన్ని సాయంత్రం నిర్వహించారు. కార్యక్రమాల్లో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.