11-04-2025 12:52:52 AM
మెదక్, ఏప్రిల్ 10(విజయక్రాంతి): రైతులు పండించిన ధాన్యాన్ని ప్యాడి క్లీనర్ ద్వారా పరిశుభ్రం చేసి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి మద్దతు ధర పొందాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. మెదక్ మండలం పాతూరు గ్రామంలో ఏర్పాటు చేసిన ఐకెపి ధాన్యం కొనుగోలు కేంద్రాన్నికలెక్టర్ రాహుల్ రాజ్ గురువారం పరిశీలించారు.
ఆయా కేంద్రాల్లో వసతులను పరిశీలించి, అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఐకెపి కొనుగోలు కేంద్రంలో కలెక్టర్ తో పాటు అదనపు కలెక్టర్ నగేష్, డిఆర్డిఓ పిడి శ్రీనివాసరావు ప్యాడి క్లీనర్ మిషన్లో వడ్లు పోసి శుభ్రపరిచారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దళారులకు అడ్డుకట్ట వేసేందుకు, రైతులకు మద్దతు ధర అందించేందుకు ఈసారి ముందుగానే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించామని వెల్లడించారు.
జిల్లాలో రబీ సీజన్ కు గాను 480 కొనుగోలు కేంద్రాల ద్వారా వడ్లను కొనుగోలు చేయడం జరుగుతుందని, ప్రతి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ప్యాడి క్లీనర్స్ అందుబాటులో ఉంచామని తెలిపారు.
రైతులు తమ ధాన్యాన్ని తాలు లేకుండా ప్యాడి క్లీనర్ల ద్వారా శుభ్రపరచుకుని తేమ శాతం 17 ఉంటే మద్దతు ధర లభిస్తుందని సూచించారు. ప్రభుత్వం గ్రేడ్ ఏ రకం ధాన్యానికి క్వింటాలుకు రూ.2320, సాధారణ రకానికి రూ.2300 నిర్ణయించినట్లు తెలిపారు. కార్యక్రమంలో తహసిల్దార్ లక్ష్మణ్ బాబు, ఐకెపి మహిళలు పాల్గొన్నారు.