25 May, 2026 | 2:39 AM

5 రోజుల్లో ధాన్యం కొనుగోలు ప్రక్రియ పూర్తి చేయాలి

25-05-2026 01:34 AM

జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

కామారెడ్డి, మే 24 (విజయక్రాంతి): జిల్లాలోని వరి ధాన్యం, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల వద్ద అకాల వర్షాలతో పంటలు తడవకుండా కొనుగోలు ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ స్పష్టం చేశారు.

ఆదివారం ఖమ్మం కలెక్టరేట్ నుంచి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, హైదరాబాద్ నుంచి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, పలువురు మంత్రులు, సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లు, సంబంధిత శాఖల జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.ఈ వీడియో కాన్ఫరెన్స్లో ప్యాడీ ప్రొక్యూర్మెంట్, ఈ నెల 25 నుంచి నిర్వహించనున్న ప్రజాపాలన  ప్రగతి ప్రణాళిక మహిళా సంక్షేమ కార్యక్రమాలపై సమీక్ష చేపట్టారు.

ఈ సందర్భంగా  మంత్రి  ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియను ఐదు రోజులలో యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు.  ఆదివారాల్లో కూడా చెల్లింపుల ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. వర్షాలకు తడిసిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోలు విషయంలో  తాలు, తరుగు పేరుతో రైతులను మోసం చేసే వారిని ఉపేక్షించబోమన్నారు.

ఈ సీజన్లో తెలంగాణ రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ధాన్యాన్ని రైతుల నుంచి కొనుగోలు చేయడంతో పాటు రూ.45 వేల కోట్లకు పైగా చెల్లింపులు జరుగుతున్నాయని తెలిపారు.  ప్రజాపాలన  ప్రగతి ప్రణాళిక 99 రోజుల షెడ్యూల్లో భాగంగా ఈ నెల 25 నుంచి 30 వరకు నిర్వహించే మహిళా సంక్షేమ వారోత్సవాలను షెడ్యూల్ ప్రకారం విజయవంతంగా నిర్వహించాలని పేర్కొన్నారు.

కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర సంబంధిత జిల్లా అధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు.అనంతరం జిల్లా కలెక్టర్ అధికారులతో మాట్లాడుతూ అకాల వర్షాలతో ధాన్యం తడవకుండా కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు వేచి ఉండే పరిస్థితులు లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. మహిళా సంక్షేమ వారోత్సవాలను విజయవంతం చేసేందుకు ప్రభుత్వం నిర్దేశించిన కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించాలని తెలిపారు.