పర్యాటక అభివృద్ధి శాఖ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేశ్‌రెడ్డి
సూర్యాపేట, డిసెంబర్ 1: సర్కారు బడుల్లో చదువుతున్న విద్యార్ధులకు నాణ్యమైన భోజనం, గుణాత్మక విద్యను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర పర్యాటక అభివృద్ధి శాఖ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేశ్‌రెడ్డి స్పష్టం చేశారు. సూర్యాపేట మండలం ఇమాంపేట కేజీబీవీని విద్యాకమిషన్ సభ్యుడు చారకొండ వెంకటేశ్‌తో కలిసి ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా తరగతి గదులు, తాగునీటి వసతులను పరిశీలించారు. భోజన నాణ్యత గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రమేశ్‌రెడ్డి మా ట్లాడుతూ.. మరుగుదొడ్ల నిర్వహణ, పాఠశాల మౌలిక వసతులపై దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యకూ చదువు పరిష్కారం చూపుతుందని.. దీనిని గ్రహించే ప్రభుత్వం విద్యకు ప్రాధాన్యతను ఇస్తున్నదన్నారు.
మోడల్ స్కూల్‌ను దత్తత తీసుకుని గతంలో రూ.10 లక్షల విలువ గల పరుపులను పంపిణీ చేసినట్లు గుర్తు చేశారు. పలు సంస్థల సహకారంతో కేజీబీవీ ప్రహరీ, ఆటస్థలం, క్రీడా వస్తువులు, గేట్, లైటింగ్ బోర్డులను ఏ ర్పాటు చేస్తామన్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. వారి వెంట డీఈవో అశోక్ ఉన్నారు.