18-04-2025 12:49:56 AM
కలెక్టర్ క్రాంతి వల్లూరు
సంగారెడ్డి, ఏప్రిల్ 17(విజయక్రాంతి) : సమాజంలో అన్ని రకాల ప్రజలు సమానంగా జీవించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు అన్నారు. సంగారెడ్డి జిల్లా గ్రంధాల సంస్థ ఆవరణలో దివ్యాంగుల కోసం సౌండ్ లైబ్రరీ నిర్మాణానికి గురువారం శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సమాజంలో సమానంగా జీవించాలని ప్రభుత్వ లక్ష్యమని, శారీరకంగా దివ్యాంగులుగా ఉన్నవారు కూడా మిగతా వారితో సమానంగా విద్యను, సమాచారాన్ని పొందడానికి హక్కు కలిగి ఉన్నారన్నారు. అందుకోసం కంటి చూపు లేని దివ్యాంగుల కోసం మహిళా శిశు వికలాంగుల, వయోవృద్ధుల, ట్రాన్స్ జెండర్స్ శాఖ ఆధ్వర్యంలో సౌండ్ లైబ్రరీ ఏర్పాటు చేయడం హర్షించదగ్గ విషయమన్నారు.
ఈ సౌండ్ లైబ్రరీ లో సాంకేతిక సౌకర్యాలతో ప్రత్యేకంగా డిజైన్ చేయబడిన ఆడియో పుస్తకాలతో లైబ్రరీ పాఠశాలతో ప్రత్యేక రూపకల్పన చేసిన కంప్యూటర్లు వంటి సదుపాయాలతో దివ్యాంగులకు ఉపయోగంగా రూపొందించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి లలిత కుమారి, డిప్యూటీ ఇంజనీర్ దీపక్, డిసిపిఓ రత్నం, వికలాంగులు వయోవృద్ధుల సంక్షేమ శాఖ సీనియర్ అసిస్టెంట్ వెంకటేశం, ఫీల్ రెస్పాన్స్ అధికారి సతీష్ పాల్గొన్నారు.