calender_icon.png 28 October, 2024 | 11:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీట్ల పెంపు సర్కారు ఇష్టమే

10-08-2024 01:53:42 AM

ఇంజినీరింగ్ సీట్ల పెంపుపై హైకోర్టు తీర్పు

ప్రభుత్వ నిర్ణయంలో జోక్యం చేసుకోలేమని వెల్లడి

27 కాలేజీల పిటిషన్లను డిస్మిస్ చేస్తూ తీర్పు

హైదరాబాద్, ఆగస్టు 9 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం అనుమతి లేకుండా ఇంజినీరింగ్ కాలేజీల్లో కొత్త కోర్సులను ప్రారంభించడానికి వీల్లేదని హైకోర్టు స్పష్టంచేసింది. ప్రభుత్వం నిరభ్యంతర పత్రం (ఎన్వోసీ) జారీ చేయకుండానే కొత్త కోర్సులు, సీట్ల పెంపు సాధ్యం కాదని తేల్చిచెప్పింది. కొత్త కోర్సులపై అంతిమ నిర్ణయం సర్కారుదేనన్న వాదనతో ఏకీభవిస్తూ శుక్రవారం తుది ఉత్తర్వులు జారీచేసింది.

బీటెక్, బీఈలో కంప్యూటర్ సైన్స్, డాటా సైన్స్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రొబోటిక్స్, డాటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ తదితర కోర్సుల్లో సీట్ల పెంపునకు, కొన్ని కోర్సులను ఇతర కోర్సుల్లో విలీనం చేసేందుకు ప్రభుత్వం నిరాకరించడాన్ని సవాల్ చేస్తూ 27 ఇంజినీరింగ్ కాలేజీలు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి. నూతన కోర్సులకు జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (జేఎన్టీయూహెచ్), ఆలిండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ) అనుమతి ఇచ్చినా రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడం లేదని ఆరోపించాయి. ఈ పిటిషన్లపై న్యాయమూర్తి సీవీ భాస్కర్‌రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాదులు డీ ప్రకాశ్‌రెడ్డి, ఎస్ నిరంజన్‌రెడ్డి, ప్రభుత్వం తరఫున స్పెషల్ జీపీ ఎస్ రాహుల్‌రెడ్డి వాదనలు వినిపించారు. 

ఇప్పటికే అధికంగా విద్యార్థులు

ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వాల్సి వస్తుందన్న కారణంతోనే కొత్త కోర్సులకు అనుమతి ఇవ్వడం లేదని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు ఆరోపించారు. డిమాండ్ ఉన్న కోర్సులకు అనుమతి ఇచ్చేలా ఉత్తర్వులు జారీ చేయాలనికోరారు. రీయింబర్స్‌మెంట్ ఇబ్బందులు లేకుండా ప్రస్తుతమున్న కోర్సులను కొత్త కోర్సులుగా మార్చుకునేందుకు కూడా ప్రభుత్వం అనుమతి ఇవ్వటం లేదని తెలిపారు. జేఎన్టీయూహెచ్ అన్నీ పరిశీలించిన తర్వాతే ఎన్వోసీలిచ్చిందని, ఏఐసీటీఈ తనిఖీలు నిర్వహించి నిబంధనల మేరకు అధ్యాపకులు, మౌలిక సదుపాయాలు ఉన్నాయని ధృవీకరించిందని వివరించారు.

ఎలాంటి కారణం చెప్పకుండానే అనుమతి ఇచ్చేందుకు ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి నిరాకరించారని చెప్పారు. ప్రభుత్వ న్యాయవాది ఈ వాదనను తోసిపుచ్చారు. ‘పిటి షనర్ల కాలేజీలకు జేఎన్టీయూహెచ్ షరతులతో ఎన్‌ఓసీ జారీ చేసింది. ఇది ఏఐసీ టీఈకి దరఖాస్తు చేసుకోవడానికి మాత్రమే వీలు కల్పిస్తుంది. సీట్ల పెంపు ఒక్క రీయింబర్స్‌మెంటుకే పరిమితం కాదు. విద్యార్థుల పెంపుతో అనేక సమస్యలు ఉత్పన్నమవుతాయి. ఇప్పటికే కొన్ని కాలేజీల్లోని ఒక్కో కోర్సులో 120 మంది విద్యార్థులున్నారు. ఇంకా పెంచాలని కోరడం సరికాదు.

అందువల్ల పిటిషన్లను కొట్టివేయాలి’ అని విజ్ఞప్తి చేశారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. విద్యాచట్టంలోని సెక్షన్ 20 ప్రకారం సీట్ల పెంపు, కోర్సుల విలీనంపై ప్రభుత్వానికే అధికారులుంటాయని ప్రకటించారు. ఆ సెక్షన్ అమలుకు వీల్లేదన్న కాలేజీల వాదన సరికాదని అన్నారు. ప్రభుత్వ నిర్ణయం తప్పు అని నిరూపించడంలో పిటిషనర్లు విఫలమయ్యారని పేర్కొన్నారు. కాలేజీల మధ్య సమానత్వానికి, ఆనారోగ్య పోటీని రూపుమాపడానికి నిర్ణయం తీసుకునే అధికారం ఉన్నత విద్యా శాఖ ముఖ్య కార్యదర్శికి ఉంది అని స్పష్టంచేశారు. ప్రభుత్వ నిర్ణయంలో జోక్యం చేసుకోలేమని తీర్పు చెప్పారు.