వాదనలు వినిపించేందుకు ఢిల్లీ నుంచి సీనియర్ లాయర్
హైదరాబాద్, ఫిబ్రవరి 5 (విజయక్రాంతి): ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారి చక్రధర్‌గౌడ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావుపై నమోదైన కేసును ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది.
పంజాగుట్ట పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ హరీశ్‌రావు దాఖలు చేసిన పిటిషన్‌పై వాదనలు వినిపించడానికి ఢిల్లీ నుంచి ప్రత్యేకంగా సీనియర్ న్యాయవాదిని పిలిపిస్తోంది. హరీశ్‌రావు పిటిషన్‌పై బుధవారం జస్టిస్ కే లక్ష్మణ్ విచారణ చేపట్టగా పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది దామా శేషాద్రినాయుడు వాదనలు ప్రారంభిస్తుండగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ పల్లె నాగేశ్వరరావు వాయిదా కోరారు.
ప్రాసిక్యూషన్ తరఫున వాదనలు వినిపించడానికి ఢిల్లీ నుంచి సీనియర్ న్యాయవాది వస్తున్నారన్నారు. ఢిల్లీ ఎన్నికల నేపథ్యంలో ఆయన రాలేదని, కొంత గడువు కావాలని కోరారు. న్యాయమూర్తి స్పందిస్తూ ముందుగా పిటిషనర్ న్యాయవాదికి ఎందుకు సమాచారం ఇవ్వలేదని ప్రశ్నించారు.
మొదటగా పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వింటామని, తర్వాత ప్రాసిక్యూషన్ వాదనలు వినిపించొచ్చని చెప్పారు. పీపీ మరోసారి విజ్ఞప్తి చేయడంతో విచారణను ఈనెల 12వ తేదీకి వాయిదా వేశారు.