10-02-2025 06:31:07 PM
తక్షణమే ఫ్రూనింగ్ పనులు చేపట్టాలి..
సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా..
భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల గిరిజనులకు, గిరిజనేతర పేదలకు రెండో పంటైన తునికాకు సేకరణపై జరుగుతున్న జాప్యంపై ప్రభుత్వం స్పందించి తక్షణమే టెండర్లు ఆహ్వానించి ఫ్రూనింగ్ పనులు చేపట్టాలని సిపిఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా ప్రభుత్వాన్ని కోరారు. సోమవారం సిపిఐ జిల్లా కార్యాలయం శేషగిరి భవన్ లో అయన మట్లాడుతూ... తునికాకు సేకరణ ద్వారా ప్రభుత్వానికి కోట్లాది రూపాయల లాభాన్ని ఆర్జించిపెడుతున్న తునికాకు సేకరణకు టెండర్లు ఆహ్వానించి ప్రూనింగ్ పనులు చేపట్టాల్సి ఉండగా ప్రభుత్వం నేటికీ ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం సరైంది కాదన్నారు. మోడెం పనులు జాప్యం జరిగితే ఆకు నాణ్యత లోపించి ప్రమాదం ఏర్పడుతుందని పేర్కొన్నారు.
అష్టకష్టాలు పడి, ప్రమాదపు అంచునా ఆకు సేకరిస్తున్న కార్మికులకు గిట్టుబాటు ధర చెల్లించాల్సిన అవసరం ప్రభుత్వం ఉందని, యాభై ఆకుల కట్టకు రూ.3/- చెల్లించాలని, బకాయి బోనస్ తక్షణమే పూర్తి స్థాయిలో విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తునికాకు సేకరణ జాప్యంపై సంబంధిత శాఖమంత్రికి లేఖ పంపినట్లు అయన తెలిపారు. జిల్లాలో తునికాకు సేకరణకు తక్షణమే టెండర్లు ఆహ్వానించి మోడెమ్ పనులు చేపట్టాలని తద్వారా ఏజెన్సీ గిరిజనులకు, గిరిజనేతర పేదలకు వేసవి పంట ద్వారా ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే సిపిఐ, ఏఐకెఎస్, బికెఎంయు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.