calender_icon.png 9 October, 2024 | 3:46 PM

ప్రభుత్వం సింగరేణికి బకాయి పడ్డ రూ 34 వేల కోట్లు వెంటనే చెల్లించాలి.. హెచ్ఎంఎస్ డిమాండ్

09-10-2024 01:29:19 PM

బెల్లంపల్లి, (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి సంస్థకు బకాయి పడ్డ రూ 34 వేలకోట్లను వెంటనే చెల్లించాలని హెచ్ఎంఎస్ వైస్ ప్రెసిడెంట్ జె.శ్రీనివాస్, సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ పార్వతి రాజిరెడ్డిలు డిమాండ్ చేశారు. బుధవారం మందమర్రి ఏరియాలోని బెల్లంపల్లి శాంతిఖని గని వద్ద ఏర్పాటు చేసిన గేట్ మీటింగ్ లో మాట్లాడారు. రాజకీయ జోక్యంతో సింగరేణి సంస్థకు చెందిన వందల కోట్ల రూపాయలు ప్రభుత్వం వరదలు, కరోనా, మెడికల్ ఫండ్, సి ఎస్ ఆర్ పేరిట దారపోస్తుందని వారు ఆరోపించారు.

తెలంగాణ ఏర్పడ్డ పదేళ్ల కాలంలో ఈ ప్రాంతంలో ఒక్క నూతన గనిని కూడా ప్రారంభించలేదని ఆరోపించారు. ప్రభుత్వం తెలంగాణ ప్రాంత యువత భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మారుస్తుందన్నారు. గని ప్రమాదంలో నష్టపోయిన కార్మికుల కుటుంబానికి రూ కోటి నష్టపరిహారాన్ని అందించి ఆ కుటుంబానికి అన్ని విధాల సహకరించాలని డిమాండ్ చేశారు. కార్మికుల చెమట, రక్తం నుండి రూ 2200 కోట్లు సంస్థ భవిష్యత్తు మనుగడ కోసం తీసినప్పుడు, అదే సింగరేణి బాగు కోసం ప్రభుత్వం బకాయి పడ్డ రూ 34 వేల కోట్లను ఎందుకు చెల్లించడం లేదని వారు ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో హెచ్ ఎం ఎస్ నాయకులు వెల్ది సుదర్శన్, ఎర్ర శ్రీనివాస్ రెడ్డి, శేఖర్, గౌస్ తోపాటు కార్మికులు పాల్గొన్నారు.