* రేవంత్‌ను చూసి కేసీఆర్ నేర్చుకోవాల్సిందేమీ లేదు
* బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
హైదరాబాద్, డిసెంబర్ 6 (విజయక్రాంతి): తెలంగాణ ప్రజల స్వేచ్ఛను కాంగ్రెస్ ప్రభుత్వం హరిస్తోందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. దళితబంధు డిమాండ్ చేస్తున్న వారిపై కేసులు పెడుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అవమానిస్తోంది బీఆర్‌ఎస్ నేతలను కాదు.. అంబేద్కర్‌ను అని పేర్కొన్నారు. తెలంగాణ భవన్‌లో శుక్రవారం నిర్వహించిన అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమంలో ఆ యన చిత్రపటానికి నివాళులర్పించిన అనంతరం కేటీఆర్ మాట్లాడారు. తమ ప్రభుత్వ హయాంలో సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టి గౌరవించామని, నగర నడిబొడ్డు న 125 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేశామని గుర్తు చేశారు.
ఆయన వర్ధంతికి నివా ళులర్పించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసులతో తమను అడ్డుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గురుకుల విద్యార్థులను తాము ఎవరెస్ట్ ఎక్కిస్తే, కాంగ్రెస్ సర్కార్ పాడె ఎక్కిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ నుంచి నేర్చుకోవాల్సిన స్థితి లో తమ అధినేత కేసీఆర్ లేరని స్పష్టం చేశా రు. తెలంగాణ తల్లి విగ్రహ స్వరూపాన్ని ఎం దుకు మార్చారని.. ప్రభుత్వాలు మారినప్పుడల్లా గత ప్రభుత్వ నిర్ణయాలు మారిపోవా లా అని ప్రశ్నించారు. అంబేద్కర్, పీవీ నరసింహారావుల విగ్రహాలను రేవంత్ పట్టిం చుకోవడం లేదని మండిపడ్డారు. ‘తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు ఆహ్వానం మాకు మ్యాటర్ కాదు.. తెలంగాణ తల్లి మాకు మ్యాటర్’ అని అన్నారు.
రేవంత్ ప్రతిష్ఠిస్తోంది తెలంగాణ తల్లి విగ్రహామా? కాంగ్రెస్ తల్లి విగ్రహమా? చెప్పాలన్నారు. తెలంగాణలో ఇందిరమ్మ పాలన కాదు.. ఇందిరమ్మ ఎమర్జెన్సీ నడుస్తోందన్నారు. తెలంగాణ తల్లి విగ్రహం ఉన్న చోట రాజీవ్‌గాంధీ విగ్రహం పెట్టారని, నాలుగేళ్ల తర్వాత ఏ విగ్రహం ఎక్కడ ఉండాలో అక్కడికి పంపిస్తామన్నారు. అసెంబ్లీ సమావేశాలను కనీసం నెల రోజులు నిర్వహించాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ రంగం, లగచర్ల ఘటన, గురుకులాలు, ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు.