calender_icon.png 27 December, 2024 | 5:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘సంధ్య’ ఘటనను రాజకీయం చేస్తున్న సర్కారు

27-12-2024 02:09:40 AM

  1. రేవతి కుటుంబానికి అండగా ఉంటాం 
  2. శ్రీతేజ్‌ను పరామర్శించిన హరీశ్‌రావు 

హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 26 (విజయక్రాంతి): “సంధ్య థియేటర్ ఘటనను ప్రభుత్వం రాజకీయం చేస్తోంది. ఘటన జరిగిన 12 రోజులైనా సీఎం, మంత్రులు ఎందుకు స్పందించలేదు. శ్రీతేజ్‌తో పాటు అతడి కుటుంబసభ్యులను ఎందుకు పరామర్శించలేదు.” అని మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు.

తొక్కిసలాట ఘటనలో తీవ్రంగా గాయపడి కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను ఎమ్మెల్యేలు హరీశ్‌రావు, వివేకానంద, బండారు లక్ష్మారెడ్డి, సీనియర్ నేతలు ఎర్రబెల్లి దయాకర్‌రావు, శ్రీనివాస్‌గౌడ్, నవీన్‌రావు తదితరులు గురువారం పరామర్శించి అతడి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు, కుటుంబసభ్యులను అడిగి తెలుసుకున్నారు.

బాధిత కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మీడియాతో మాట్లాడుతూ.. శ్రీతేజ్‌కు మెరుగైన వైద్యం అందిస్తున్నట్టు కిమ్స్ వైద్యులు చెప్పారని.. బాలుడు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నామన్నారు. శ్రీతేజ్ తండ్రి భాస్కర్‌కు మనోధైర్యం ఇమ్మని కేసీఆర్ ఆదేశించినట్టు ఆయన తెలిపారు.

మృతిచెందిన రేవతి ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తున్నామని.. సినిమా వాళ్లను భయపెట్టి సీఎం మంచి చేసుకోకూడదని సూచించారు. గురుకులాల్లో 50 మంది వరకు విద్యార్థులు మృతి చెందితే బాధిత కుటుంబాలను సీఎం, మంత్రులు ఎందుకు పరామర్శించలేదని ప్రశ్నించారు. 

ఓ సర్పంచి ఆత్మహత్య చేసుకుంటే.. అందు కు కారణమైన సీఎం తమ్ముడిని అరెస్ట్ చేయలేదు? చట్టం అందరికీ సమానమన్న సీఎం, వాళ్ల తమ్ముడిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని హరీశ్‌రావు ప్రశ్నించారు.