calender_icon.png 19 November, 2024 | 9:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శివబాలకృష్ణ ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వం ఓకే!

10-09-2024 01:38:31 AM

ఆస్తులు రూ.250 కోట్లు.. ఆదాయం కన్నా 350 శాతం అదనం

హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 9 (విజయక్రాంతి): అవినీతి నిరోధక శాఖ దాడులలో సంచలనంగా మారిన హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ కేసును ప్రభుత్వం ప్రాసిక్యూషన్‌కు అనుమతించినట్టు తెలుస్తోంది. ఆదాయానికి మించిన ఆస్తుల వ్యవహారంలో ఏసీబీ అధికారులు ఈ ఏడాది జనవరిలో శివబాలకృష్ణ నివాసంతోపాటు మరో 16 చోట్ల ఏకకాలంలో దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే. దాడులు చేపట్టిన సమయంలోనే దాదాపు రూ.8 కోట్లకు పైగా ఆస్తులను గుర్తించి ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

ఆ తర్వాత కస్టడీలో చేపట్టిన విచారణలో అనేక కీలక అంశాలను రాబట్టిన ఏసీబీ అధికారులు.. అతనికి దాదా పు రూ.250 కోట్ల అక్రమాస్తులు ఉన్నట్టుగా గుర్తించారు. ముగ్గురు బినామీలు ఉన్నట్టుగా, శివబాలకృష్ణ వెనుక ఓ ఐఏఎస్ అధి కారి కూడా ఉన్నట్టుగా విచారణలో వెల్లడైనట్టు తెలుస్తోంది. ఈ కేసు విచారణలో భాగంగా తాజాగా శివబాలకృష్ణపై న్యాయస్థానంలో ప్రాసిక్యూషన్ జరపడానికి ప్రభుత్వం నుంచి ఏసీబీ అనుమతి పొందినట్టు సమాచారం. దీంతో ఈ కేసు విచారణ కీలక దశకు చేరుకున్నట్టు పలువురు భావిస్తున్నారు. 

దిమ్మతిరిగిపోయేలా ఆస్తులు

ఆదాయానికి మించిన ఆస్తుల వ్యవహారంలో ఏసీబీకి చిక్కిన శివబాలకృష్ణ ఆదాయం చిట్టా ఏసీబీ అధికారులకే దిమ్మతిరిగిపోయేలా ఉన్నట్టు సమాచారం. ఆయనకు ముగ్గురు బినామీలు ఉండగా, కుటుంబ సభ్యుల పేర్లతోనూ అనేక ఆస్తులు ఉన్నట్టు ఏసీబీ నిర్దారణకు వచ్చింది. ఈ క్రమంలో మొత్తం 214 ఎకరాల భూములు, 7 ఇండ్లు, ఒక విల్లా, కుటుంబ సభ్యుల పేర్లతో 29 ప్లాట్లు తదితర ఆస్తుల జాబితా ఏసీబీ విచారణలో వెలుగు చూశాయి. ఈ మొత్తం ఆస్తులు కలిపి సాధారణంగా అతనికి ఉండాల్సిన ఆదాయం కంటే 350 శాతం అధికంగా ఉన్నట్టు సమాచారం. ఈ కేసులో 214 రకాల ఆస్తులను ఏసీబీ అధికారులు ఈడీకి అటాచ్ చేశారు. 

ప్రాసిక్యూషన్‌కు అనుమతి.. 

శివబాలకృష్ణ ఆదాయం అంతా అవినీతి, ఇతర మార్గాలలో అక్రమంగా కూడబెట్టినట్టుగా ఏసీబీ నిర్దారణకు వచ్చింది. ఈ విషయాన్ని డ్రాప్ట్ చార్జిషీటును తయారు చేసిన ఏసీబీ అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. శివబాలకృష్ణపై ప్రాసిక్యూషన్‌కు అనుమతించాలని కోరారు. ఈ విషయాన్ని పరిశీలించిన ప్రభుత్వం శివబాలకృష్ణను ప్రాసిక్యూషన్ జరపడానికి అనుమతించినట్టు తెలుస్తోంది. విచారణలో శివబాలకృష్ణ వెల్లడిం చిన పలువురు ఐఏఎస్ అధికారులను కూడా విచారణ చేసేందుకు ఏసీబీ అధికారులు రంగం సిద్దం చేస్తున్నట్టు సమాచారం.