calender_icon.png 24 December, 2024 | 8:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వం కాంగ్రెస్‌ది.. పాలన బీజేపీది

24-12-2024 01:43:26 AM

కక్షపూరితంగానే కేటీఆర్‌పై ఏసీబీ, ఈడీ కేసులు

ఆ కుట్రతోనే ఢిల్లీకి సీఎం రేవంత్‌రెడ్డి

మీడియా చిట్‌చాట్‌లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

హైదరాబాద్, డిసెంబర్ 23 (విజయక్రాంతి): తెలంగాణలో పేరుకే కాంగ్రెస్ పాలన నడుస్తున్నదని.. కానీ, పాలన సాగిస్తున్నది బీజేపీ అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. కాంగ్రెస్, బీజేపీలు పైకి చూసేందుకు కీచులాడుకుంటున్నట్టు కనిపిస్తాయని, అంతర్గతంగా రెండు కలిసే పనిచేస్తున్నాయని దుయ్య బట్టారు. దీనిలో భాగంగానే బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై కేసులు నమోదు చేయిస్తున్నారని ఆరోపించారు.

హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో సోమవారం ఆమె మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. ఈ సంద ర్భంగా కవిత మాట్లాడుతూ.. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి బీజేపీ పెద్దలను కలిసిన తర్వాతే కేటీఆర్‌పై ఏసీబీ కేసు నమోదు చేసిందని తెలిపారు. రాష్ట్రంలో ప్రతీకార పాలన సాగుతున్న దని మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రస్తుతం ప్రభుత్వ పెద్దలు 10 శాతం కమిషన్ అమలు చేస్తున్నారని ఆరోపించారు. గురుకులాల్లో విషాహారం తిని 57 మంది పిల్లలు చనిపోవడం సిగ్గుచేటన్నారు.

పిల్లల  మరణాలపై సీఎం ఏం సమాధానం చెప్తారని నిలదీశారు. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.  భూభారతితో భూ భద్రత ఉంటుందనే భరోసా రైతులకు లేదని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదైనా ఒక కొత్త ప్రాజెక్టు అయినా చేపట్టకపోవడం చేతిగానితనానికి నిదర్శనమన్నారు. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు నెలకు రూ.2,500 ఇస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు.

‘జగిత్యాల నుంచి మీరు పోటీ చేస్తారా..?’ అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా ‘తాను కేవలం జగిత్యాలకు చెందిన మహిళను కాను. ఒకప్రాంతానికి పరిమితం కాను, రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు ఏ సమస్య వచ్చినా నేను ముందుంటాను’ అని సమాధానమిచ్చారు.