calender_icon.png 20 September, 2024 | 11:04 AM

ప్రభుత్వానికి డీఎస్సీ భయం!

20-09-2024 01:18:19 AM

ఫలితాల విడుదలలో జాప్యం

పొరపాట్లు జరగకుండా ఆచితూచీ అడుగులు

రిజల్ట్స్ కోసం అభ్యర్థుల డిమాండ్

హైదరాబాద్, సెప్టెంబర్ 19 (విజయక్రాంతి): డీఎస్సీ ప్రైమరీ, ఫైనల్ కీలపై అభ్యర్థులనుంచి భారీగా అభ్యంతరాలు రావడంతో సర్కార్‌కు డీఎస్సీ భయం పట్టుకుంది. ఈ నేపథ్యంలోనే ఫలితాల విడుదల విషయంలో మరింత జాప్యం జరుగుతుందనే చర్చ జరుగుతోంది. ఓ సెషన్‌లో జరిగిన పరీక్షలో దాదాపు 18 ప్రశ్నలు పునరావృతం కావడం, ప్రాథమిక, తుది కీలపై అభ్యర్థుల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం కావడంతో ఫలితాల్లో ఎలాంటి పొరపాట్లు జరగకుండా అధికారులు ఆచితూచీ అడుగులు వేస్తున్నారు.

అందుకే జనరల్ ర్యాకింగ్ లిస్ట్ (జీఆర్‌ఎల్) విడుదలపై అధికారులు స్పష్టతనివ్వడం లేదు. ఫలితాల విడుదలకు మరికొంత సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు. మరోవైపు అభ్యర్థులు మాత్రం డీఎస్సీ ఫలితాల కోసం నిరీక్షిస్తున్నారు. పరీక్షలు రాసేందుకు మరింత సమయం కావాలని కోరగా.. తమ అభ్యంతరాలను పట్టించుకోని ప్రభుత్వం.. పరీక్షలు ముగిసి దాదాపు రెండు నెలలు కావొస్తున్నా ఫలితాలను ఎందుకు విడుదల చేయడం లేదని ప్రశ్నిస్తున్నారు.

ఆగస్టు 5న డీఎస్సీ పరీక్షలు ముగియగా, అదే నెల 13న ప్రాథమిక కీని విడుదల చేశారు. కొన్ని ప్రశ్నలకు సంబంధించిన సమాధానాలపై అభ్యర్థులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. దాదాపు 28,500 అభ్యంతరాలు వచ్చాయి. వాటిపై నిపుణుల కమిటీ చర్చించి తుది కీని ఈనెల 6న విడుదల చేశారు. అయితే తుది కీలోనూ భారీగా తప్పులు దొర్లినట్లు అభ్యర్థులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. కొన్ని ప్రశ్నలకు సరైనా సమాధానాలు ఆప్షన్లలో లేవని ఆధారాలతో సహా అధికారుల ముందుంచారు. వాటికి మార్కులు కలపాలని డిమాండ్ చేశారు. వీటిపై కూడా ఇటీవల చర్చించిన నిపుణుల కమిటీ పైనల్ కీలో ఎలాంటి తప్పులు దొర్లలేదని తేల్చినట్లు సమాచారం. 

జీఆర్‌ఎల్ ఎప్పుడు?

ఒకవేళ ఫైనల్ కీలో తప్పులు దొర్లితే మార్కులు కలిపి రివైజ్డ్ కీ ఇవ్వాలి. లేదంటే జీఆర్‌ఎల్ విడుదల చేయాలి. ఫైనల్ కీ తర్వాత టెట్ మార్కుల అప్‌లోడ్‌కు ఈనెల 14 వరకు అభ్యర్థులకు మరో అవకాశం కల్పించారు. అభ్యర్థులంతా తమ మార్కులను అప్‌లోడ్ చేసుకున్నారు. అయితే డీఎస్సీలో వచ్చిన మార్కులు, టెట్ మార్కులను కలిపి అధికారులు జీఆర్‌ఎల్‌ను విడు దల చేయాల్సి ఉంది.

ఆ తర్వాత 1 : 3 జాబితాను విడుదల చేసి అభ్యర్థులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియను చేపడతారు. అనంతరం 1:1 జాబితాను విడుదల చేసి నియామ క పత్రాలు అందజేస్తారు. అయితే జీఆర్‌ఎల్, 1:3 జాబితా విడుదల విషయంలో అధికారులు తాత్సారం చేస్తున్నారని అభ్యర్థులు మండిపడుతున్నారు. అధికారులు మాత్రం డీఎస్సీ ఫలితాల విడుదల విషయంలో ఆచితూచీ అడుగులు వేస్తున్నారు. ఒకటికి రెండు సార్లు క్రాస్ చెక్ చేసుకుంటున్నారు.