మాజీ ఎమ్మెల్సీ ఫారుఖ్ హుస్సేన్
దౌల్తాబాద్, జనవరి 13: హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం అయిందని, సంక్షేమ పథకాలు పేదలకు అందకపోవడంతో అనేక ఇబ్బందులు పడుతున్నారని మాజీ ఎమ్మెల్సీ ఫారుఖ్ హుస్సేన్ అన్నారు. సోమవారం రాయపోల్ మండల కేంద్రంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 10 ఏళ్ల కెసిఆర్ పాలనలో ప్రజలందరూ సంక్షేమ పథకాలు లబ్ధిపొంది సుఖసంతోషాలతో జీవించారని గుర్తు చేశారు.
ఆచరణకు మించి వాగ్దానాలు చేసి ఆరు గ్యారెంటీల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు చేసిందేమీ లేదని ఆయన విమర్శించారు. పేదల బాగు కోసం గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను రోజుకు ఒక పథకాన్ని తీసివేస్తుందని ఆయన ఆరోపించారు. ముఖ్యంగా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, కెసిఆర్ కిట్టు, రైతు భరోసా పేరుతో రూ.15 వేలు ఇస్తామని చెప్పి మాట మార్చి రూ.12 వేలు ఇస్తామని చెప్పుకోవడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు.
ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల తీవ్రమైన వ్యతిరేకత వస్తుందని రానున్న స్థానిక సంస్థ ఎన్నికల్లో బిఆర్‌ఎస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని ఆయన స్పష్టం చేశారు. గ్రామాల్లో కార్యకర్తలు గత ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ఇంటింటా ప్రచారం నిర్వహించి గెలుపు కోసం ప్రతి కార్యకర్త శక్తి వంచన లేకుండా కృషిచేసి కాంగ్రెస్ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలని పేర్కొన్నారు.
తనకు ఎలాంటి పదవులు అవసరం లేదని కార్యకర్తల బాగోగుల కోసం, వారి కష్టసుఖాల్లో పాలుపంచుకుంటా నన్నారు. తనకు రాజకీయ జన్మనిచ్చిన దుబ్బాక నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకుంటానని పేర్కొన్నారు. మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశ్వర శర్మ, మాజీ జెడ్పిటిసి యాదగిరి, బిఆర్‌ఎస్ రాష్ట్ర యువజన నాయకులు హనుమాన్ల రాజిరెడ్డి, నాయకులు రాజిరెడ్డి, మురళి గౌడ్, జీవన్ రెడ్డి, నవీన్ గౌడ్, తుడుం ప్రకాష్, పరుశరాములు, రాజు పాల్గొన్నారు.