calender_icon.png 20 January, 2025 | 1:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాష్ట్ర బ్రాండ్ ఇమేజీని డ్యామేజీ చేసిన సర్కార్

20-01-2025 12:25:10 AM

  1. పెట్టుబడుల కోసం విదేశీ పర్యటనలతో ఫలితం శూన్యం
  2. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద

హైదరాబాద్, జనవరి 19 (విజయక్రాంతి): సీఎం రేవంత్‌రెడ్డి నేల విడిచి సాము చేస్తున్నారని.. రాష్ట్రంలో పరిస్థితులు చక్కదిద్దకుండా విదేశీ పెట్టుబడులకు ప్రయత్నాలు చేయడం ఆయన అవగాహన రాహిత్యానికి నిదర్శనమని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద విమర్శించారు. ఆదివారం బీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యాలయం లో మీడియా సమావేశంలో మాట్లాడారు.

తెలంగాణ బ్రాండ్ ఇమేజీని రేవంత్ సర్కార్ డ్యామేజీ చేసి, ఇప్పుడు విదేశీ పెట్టుబడులకు ప్రయత్నించినా ఫలితంరాదని అన్నారు. ఫార్మాసిటీ, ఎయిర్‌పోర్ట్, మెట్రో, ఈ ఫార్ములా రేస్ రద్దుతో పెట్టుబడులు పెట్టేందుకు భయపడుతున్నారని తెలిపారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు దారుణంగా ఉన్నాయన్నారు. ఫలితంగానే పెట్టుబడులు రావడం లేదని ఆరోపించారు.

రాష్ట్రంలోని కంపెనీలు ఇతర రాష్ట్రాలకు తరలిపోయే పరిస్థితి నెలకొందన్నారు. తమ ప్రభుత్వం పెట్టుబడులకు అనుకూల వాతావరణం సృష్టిస్తే దాన్ని రేవంత్‌రెడ్డి సర్కార్ నాశనం చేసిందన్నారు. మెట్రో రైల్ నిర్వహిస్తున్న ఎల్‌అండ్‌టీ సీఈవోను జైలుకు పంపిస్తామని బెదిరిస్తే పెట్టుబడులు ఎలా వస్తాయన్నా రు.

రేవంత్‌రెడ్డి దావోస్ పర్యటన వల్ల రాష్ట్రానికి రికార్డు స్థాయిలో పెట్టుబడులు వచ్చాయంటూ ప్రచారం సాగుతోందని.. ఇదంతా డొల్లేనన్నా రు. దావోస్ పర్యటన వల్ల కొత్తగా వచ్చిన పెట్టుబడులు కేవలం రూ.862 కోట్లు మాత్రమేనని.. అందులోనూ రూ.630.5 కోట్ల పెట్టుబడులకు సంబంధించిన వివరాలు వెల్లడించలేదన్నారు.