12-04-2025 08:52:09 PM
మహిళల ఆర్థికాభివృద్ధికి తోడ్పాటు..
ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ..
తిమ్మాపూర్ (విజయక్రాంతి): మహిళా సాధికారతే లక్ష్యంగా మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని మానకొండూర్ ఎమ్మెల్యే డా.కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. రాష్ట్ర మహిళా సహకార అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మోవో సొసైటీ సహకారంతో ఎల్ఎండి కాలనీలోని దుర్గాబాయి దేశ్ ముఖ్ మహిళా శిశు వికాస కేంద్రంలో 20 మంది మహిళలకు ఎలక్ట్రికల్ ఆటో డ్రైవింగ్ లో శిక్షణ కార్యక్రమాన్ని శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... మహిళలను కోటీశ్వరులుగా చేయాలన్నదే సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షకు అనుగుణంగా ప్రభుత్వం పని చేస్తోందన్నారు.
అందులో భాగంగానే మహిళలకు స్వయం ఉపాధి కల్పిస్తూ వారి ఆర్థిక స్థితిగతులను మెరుగుపర్చడానికి ప్రభుత్వం ఇప్పటికే స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో క్యాంటీన్ల నిర్వహణ, ఆర్టీసీ అద్దె బస్సుల కొనుగోలు, పెట్రోల్ బంకుల ఏర్పాటు వంటి కార్యక్రమాలు చేపట్టిందని గుర్తు చేశారు. ఆ క్రమంలోనే మహిళలకు ఎలక్ట్రికల్ ఆటోలు నడపడంలో శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని వివరించారు. ప్రభుత్వం ఏ కార్యక్రమం మొదలు పెట్టిన మహిళల సంక్షేమ పథకాల ద్వారానే మొదలుపెట్టడం జరుగుతుందన్నారు. ప్రభుత్వం కల్పించిన ఉచిత బస్సు ప్రయాణం వల్ల మహిళలకు మేలు చేకూరిందని, ప్రయాణాలకు అయ్యే ఖర్చు ఇప్పుడు వారి కుటుంబాలకు మిగులుగా మారిందన్నారు.
ఎలక్ట్రికల్ ఆటోలు నడపటంలో మహిళలకు శిక్షణ ఇవ్వడమే కాకుండా ఆటోల కొనుగోలు కోసం వారికి పెట్టుబడి సాయమందిస్తామన్నారు. మహిళలు టీవీ సీరియళ్లకు పరిమితం కాకుండా ప్రభుత్వపరంగా కల్పించే అవకాశాలతో ఉపాధి పొందాలన్నారు. ఈ-ఆటోల ద్వారా ఆదాయాన్ని పెంచుకోవచ్చని, ముఖ్యంగా పాఠశాల విద్యార్థులను ఆటోల్లో తీసుకెళ్లడం ద్వారా మహిళలు నికర ఆదాయం పొందగలుగుతారని ఆయన పేర్కొన్నారు. పెరుగుతున్న జీవన ప్రమాణాలకు, ఖర్చులకు అనుగుణంగా సంపాదించడం తప్పనిసరి అయిన పరిస్థితుల్లో మహిళలు కూడా సంపాదిస్తే వారి కుటుంబాలు ఆర్థికంగా బలపడతాయన్నారు. అనంతరం రాష్ట్ర మహిళా కార్పొరేషన్ చైర్ పర్సన్ శోభారాణి మాట్లాడుతూ.. మహిళా సాధికారతకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు.
ఇంతకుముందు మహిళలకు బ్యూటీషియన్, టైలరింగ్ వంటి వాటిల్లో మాత్రమే శిక్షణ ఇవ్వగా ఇప్పుడు డ్రైవింగ్ లోను శిక్షణ ప్రారంభించామన్నారు. మహిళా కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈ ఆటో డ్రైవింగ్ శిక్షణ ద్వారా ఇప్పటికే హైదరాబాదులో చాలామంది ఉపాధి పొందుతున్నారని తెలిపారు. రానున్న రోజుల్లో మొబైల్, టీవీ, మోటార్ రంగంలోనూ మహిళలకు శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తామని వివరించారు. జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ.. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతుందని తెలిపారు. ఐకెపి ద్వారా ధాన్యం కొనుగోలు, అమ్మ ఆదర్శ పాఠశాలలు, పెట్రోల్ బంకుల మంజూరు వంటివి ఇందులో భాగమని అన్నారు.
మహిళ ఆటో డ్రైవర్లు నిర్దిష్ట గమ్యాన్ని సురక్షితంగా చేరుస్తారని తెలిపారు. ప్రజా రవాణాను మహిళలే ఎక్కువగా ఉపయోగిస్తారని, ఆ రవాణా సాధనాలను నడిపించేవారు కూడా మహిళలే అయి ఉండాలని అన్నారు. కరీంనగర్ లో ప్రవేశపెట్టిన ఈ డ్రైవింగ్ శిక్షణ సద్వినియోగం చేసుకొని దేశంలోని మహిళలకు కరీంనగర్ ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. అనంతరం మహిళా ప్రాంగణంలో వివిధ శిక్షణలు పొందిన పలువురు మహిళలకు సర్టిఫికెట్లు అందజేశారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ప్రపుల్ దేశాయ్, మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్ పాయ్, మోవో స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి జై భారతి, జిల్లా సంక్షేమ అధికారి సబిత, దుర్గాబాయి మహిళా శిశు వికాస కేంద్రం మేనేజర్ సుధా రాణి, సీఐ శ్రీలత, జిఎం సుభద్ర, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కర్ర సత్యప్రసన్నరెడ్డి తదితరులు పాల్గొన్నారు.