20-04-2025 05:16:15 PM
ఎమ్మెల్యే మురళి నాయక్..
మహబూబాబాద్ (విజయక్రాంతి): రైతు మేలే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని , రైతు కళ్ళల్లో ఆనందం నింపేందుకే సన్న వడ్లకు క్వింటాలకు 500 రూపాయలు బోనస్ ప్రకటించడం జరిగిందని, ఈ యాసంగిలో కూడా బోనస్ చెల్లించడం జరుగుతుందని మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళి నాయక్(MLA Bhukya Murali Naik) అన్నారు. నెల్లికుదురు మండలంలోని వివిధ గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆదివారం ఎమ్మెల్యే ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆరువాలం కష్టపడి పండించిన పంటను గత ప్రభుత్వంలో వివిధ రకాల కోతల పేరుతో ధాన్యాన్ని దండుకొని రైతులకు అనేక విధాలుగా దోచుకున్న సంఘటనలు జరిగాయని, ఇప్పుడు తమ ప్రభుత్వం అందుకు పూర్తిగా భిన్నంగా, పారదర్శకంగా ధాన్యం కొనుగోలు చేస్తుందని చెప్పారు. అకాల వర్షాలతో దెబ్బతిన్న పంట ఉత్పత్తులను కూడా ప్రభుత్వం కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ధాన్యం కొనుగోళ్లలో రైతులు ఎలాంటి అపోహలకు గురికావద్దని, కొనుగోలు కేంద్రాల్లో రైతులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని ఎమ్మెల్యే అన్నారు.
త్వరలో ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపు
గ్రామాల్లో అర్హులైన నిలువ నీడలేని నిరుపేదలకు త్వరలో ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపు చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. అర్హులైన లబ్ధిదారులను ఇప్పటికే గుర్తించడం, త్వరలో వారికి ఇండ్లు గ్రామాల వారీగా కేటాయించి నిర్మాణ పనులను చేపట్టే విధంగా చర్యలు తీసుకొని వెంట వెంటనే బిల్లులు చెల్లిస్తామని ఎమ్మెల్యే తెలిపారు.