calender_icon.png 13 January, 2025 | 6:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అధికార, విపక్షాలు కలిస్తేనే ప్రభుత్వం

13-01-2025 02:25:22 AM

  1. ఈ తరంలో గొప్ప రాజకీయ నాయకులేరి?
  2. విద్యార్థి రాజకీయాలను ప్రోత్సహించాలి 
  3. అమరావతితో కాదు ప్రపంచంతో పోటీ 
  4. ఒక్క విపక్ష ఎమ్మెల్యేనీ సభ నుంచి బహిష్కరించలేదు 
  5. మాజీ గవర్నర్ సాగర్ జీ జీవితచరిత్ర ‘ఉనిక’ పుస్తకావిష్కరణలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

హైదరాబాద్, జనవరి 12 (విజయక్రాంతి): అధికార పక్షం, విపక్షం కలిస్తేనే ప్రభుత్వం అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ఎన్నికలప్పుడు మాత్రమే రాజకీయాలు చేయాలని, మిగతా సమయాల్లో అభివృద్ధిపైనే దృష్టి సారించాలని పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం తాను ఎలాంటి భేషజాలకు పోనని.. ఎవరితోనైనా కలిసి పనిచేస్తానని స్పష్టంచేశారు.

తాము అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అసెంబ్లీ నుంచి ఒక్కరంటే ఒక్క సభ్యున్ని కూడా సస్పెండ్ చేయలేదని, తమ సర్కారు విపక్షాలకు విలువ ఇస్తుందని చెప్పేందుకు ఇదో ఉదాహరణ అని పేర్కొన్నారు. మహారాష్ట్ర మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావు ఆత్మకథ ‘ఉనిక’ పుస్తకాన్ని ఆదివారం హోటల్ తాజ్ కృష్ణలో ముఖ్యమంత్రి ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడారు. ప్రస్తు తం విశ్వవిద్యాలయాలు ఉనికి కోల్పోయేలా ఉన్నాయని.. తాను సీఎం అయిన తర్వాత పూర్వవైభవం కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో అసలైన పాత్ర ఉస్మానియా, కాకతీయ వంటి విశ్వవిద్యాలయాల విద్యార్థులదేనని ఉద్ఘాటించారు. విద్యార్థులే ముందుండి పోరాటం చేశారని కొనియాడారు.

ప్రస్తుతం రాజకీయాల్లో సిద్ధాంతపరమైన భావజాలం లేనందునే పార్టీ ఫిరాయింపులు చోటు చేసుకుంటున్నాయని, ఏదో ఓ పదవి కోసం పార్టీలు మారుతున్నారని అభిప్రాయపడ్డారు. విద్యార్థి దశలో సిద్ధాంతపరమైన రాజకీయాలు చేస్తే పార్టీకి కట్టుబడి ఉంటారని అన్నారు. సిద్ధాంతపరమైన విద్యార్థి రాజకీయాలను రాష్ట్రంలో పునరుద్ధరించాల్సిన అవసరం ఉందన్నారు. రాజకీయాల్లో రాణించాలని భావించేవారు ఉనిక పుస్తకాన్ని చదవాలని సూచించారు. 

రాష్ట్రాన్ని వన్ ట్రిలియన్ ఎకానమీగా తీర్చిదిద్దుతా 

రాష్ట్రాభివృద్ధి విషయంలో తనకు ఎలాం టి భేషజాలు లేవని, ఎవరినైనా కలుస్తానని, ఎవ రి సహకారమైనా తీసుకుంటానని రేవంత్‌రెడ్డి స్పష్టంచేశారు. రాష్ట్రాన్ని వన్ ట్రిలియన్ డాలర్ ఎకానమీగా తీర్చిదిద్దేందుకు సహకరించాలని ఇప్పటికే ప్రధాని మోదీని కోరినట్టు గుర్తుచేశారు.

తెలంగాణలో 60 శాతం ఆదాయం హైదరాబాద్ నుంచి వస్తుందని, విశ్వనగరంగా మారాలంటే ఆర్‌ఆర్‌ఆర్‌తోపాటు రీజినల్ రింగ్ రైల్, డ్రైపో ర్టు, బందర్‌కు డైరెక్ట్ కనెక్టివిటీ అవసరమన్న విషయాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్లానని చెప్పారు. తెలంగాణకు అమరావతితో పోటీ కాదని, ప్రపంచంతోనని.. న్యూయార్క్, టోక్యో వంటి నగరాలతో పోటీ పడదామని అన్నారు.

హైదరాబాద్ మెట్రో 9వ స్థానానికి పడిపోయిందన్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్, బీఆర్‌ఎస్ నేత బీ వినోద్ లాంటి వారు పార్టీలకు అతీతంగా తెలంగాణ అభివృద్ధికి సహకరించాలని కోరారు. తమిళనాడులో వారి భాష కోసం, జల్లికట్టు కోసం పార్టీలకు అతీతంగా నాయకులంతా కలిసి పోరాడారని.. 39 మంది తమిళ ఎంపీలు లోక్‌సభలో తమిళంలోనే ప్రమాణస్వీకారం చేశారని గుర్తుచేశా రు.

తెలంగాణ అభివృద్ధి కోసం కూడా రాజకీయాలకు అతీతంగా పనిచేసేందుకు అందరూ సహకరిం చాలన్నారు. రాబోయే కేంద్ర క్యాబినెట్ సమావేశంలో హైదరాబాద్ మెట్రో విస్తరణకు అనుమతి వస్తే బాగుండేదన్నారు.

విద్యార్థుల్లో నైపుణ్యం కోసం 75 ఐటీఐలను ఐటీసీలుగా మారుస్తున్నామని, రూ.2100 కోట్లతో టాటా సంస్థ యువతకు శిక్షణ, ఉపా ధి కల్పించేందుకు ముందుకొచ్చిందన్నారు. యూనివర్సిటీల కోసం రూ.600 కోట్ల కార్ప స్ ఫండ్ ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. 2028లో ఒలంపిక్స్‌లో బంగారు పతకాలే లక్ష్యంగా స్పోర్ట్స్ యూనివర్సిటీ కూడా ఏర్పా టు చేస్తున్నామని చెప్పారు. 

తెలంగాణ వాదం తీసుకున్న గొప్ప వ్యక్తి : కేంద్ర మంత్రి బండి సంజయ్

బీజేపీలో తెలంగాణ వాదాన్ని తీసుకున్న గొప్ప వ్యక్తి విద్యాసాగర్‌రావు అని కేంద్ర మంత్రి బండి సంజయ్ పేర్కొన్నారు. ఆయ న తెలంగాణ రాష్ట్రం కోసం చేసిన ప్రయత్నాన్ని చాలామంది హేళనగా చూశారని, అయినా వెనకడుగు వేయలేదని చెప్పారు. సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినం అంటే విద్యాసాగర్‌రావు గుర్తుకువస్తారని పేర్కొన్నారు. విద్యాసాగర్ రావు వల్లే తన లాంటి వాళ్లకు రాజకీయంగా అవకాశాలు లభించాయని కొనియాడారు. 

బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ : మంత్రి పొన్నం ప్రభాకర్

రాజకీయాల్లో ఎవరైనా గెలవవచ్చని అం దుకు తానే ఉదాహరణ అని రవాణా, బీసీ సం క్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కరీంనగర్‌లో మొదట విద్యాసాగర్‌రావు ఎంపీ గా గెలిస్తే ఆ తర్వాత తాను ఆయనపై ఎంపీగా పోటీ చేసి గెలిచానని ఆ తర్వాత తనపై వినోద్‌కుమార్ గెలిచారని పేర్కొన్నారు.

వినోద్‌కుమా ర్‌పై బండి సంజయ్ గెలిచి ఎంపీ అయ్యారని అన్నారు. ఇదే బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ అని చెప్పారు. సాగర్‌జీ మార్గదర్శకంలో తాను విద్యార్థి నాయకునిగా పనిచేశానని గుర్తుచేసుకున్నారు. కార్యక్రమంలో ఎంపీ డా. కే లక్ష్మ ణ్, మాజీ ఎంపీలు వినోద్‌కుమార్, సుబ్బరామిరెడ్డి, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. 

మచ్చలేని రాజకీయ నాయకుడు సాగర్‌జీ

తెలంగాణ సమాజానికి ఆదర్శ రాజకీయ నాయకుడిగా సీహెచ్ విద్యాసాగర్ రావు నిలిచారని రేవంత్‌రెడ్డి పేర్కొన్నా రు. ఆయన తమ అందరికి సాగర్ జీగానే తెలుసని చెప్పారు. ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థి రాజకీయం నుంచి ఉమ్మడి ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా, కేంద్ర మంత్రిగా పని చేశారని గుర్తుచేశారు. మహారాష్ర్ట, తమిళనాడు రాష్ట్రాల కు గవర్నర్‌గా పని చేశారని తెలిపారు.

సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నా విద్యాసాగర్‌రావుపై ఎలాంటి ఆరోపణ లు లేవని, ఆయన మచ్చలేని నాయకుడని కొనియాడారు. ఉస్మానియా యూనివర్సిటీలో సిద్ధాంతపరంగా నాడు రాజకీయాలు చేశారని చెప్పారు. రాష్ర్టంలో రెండోతరంలో జైపాల్‌రెడ్డి, విద్యాసాగర్‌రావు, దత్తాత్రేయ ఉన్నారని తెలిపారు. మూడో తరంలో చెప్పుకోతగ్గ నేతలే లేరని ఆవేదన వ్యక్తంచేశారు.

గోదావరి జలాల కోసం విద్యాసాగర్ రావు పాదయాత్ర చేశారని గుర్తుచేశారు. గోదావరి జలాలు తెలంగాణకు వినియోగించుకోవాలంటే విద్యాసాగర్‌రావు అనుభవం అవసరమన్నారు. తుమ్మిడిహెట్టి వద్ద భూసేకరణ కోసం విద్యాసాగ ర్‌రావు అవసరం ఉందని.. ఆయన మహారాష్ట్ర సీఎం ఫడ్నవిస్‌తో మాట్లాడి ఈ సమస్యకు పరిష్కారం చూపించగలరని అన్నారు.

బీజేపీలో ఉన్నా ఎల్లంపల్లికి శ్రీపాదరావు పేరు పెట్టాలని కోరా: సీహెచ్ విద్యాసాగర్‌రావు 

తాను బీజేపీలో ఉన్నా ఎల్లంపల్లి ప్రాజెక్టుకు శ్రీపాదరావు పేరు పెట్టాలని కోరానని మహారాష్ట్ర మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావు గుర్తుచేసుకున్నారు. శ్రీపాదరావు అంత గొప్ప నేత కాబట్టే ఆయనకు ప్రజాదరణ లభించిందని చెప్పారు. తమ కాలంలో రాజకీయాల్లో పాలక, ప్రతిపక్షాలు అనే తేడా ఉండేది కాదన్నారు.

అంతా కలిసి అభివృద్ధి కోసం ముందుకు సాగేవారమని చెప్పారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న రోజుల్లో మర్రి చెన్నారెడ్డి సీఎం అని.. తాము నియోజకవర్గ సమస్యలేవైనా అడిగితే వెంటనే చేసేవారని చెప్పారు. ఎప్పటికైనా ప్రధాని అవుతావని వాజ్‌పాయ్‌ని నెహ్రు అనేవారని గుర్తుచేశా రు. ప్రతిపక్ష నేత అయినా వాజ్‌పేయ్‌ను పీవీ ఐక్యరాజ్యసమితి సమావేశాలకు పంపారని గుర్తుచేశారు.

ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయినా మన దేశంలో కోట్లాది మంది పేదరికంలో మగ్గుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. వారికి నైపుణ్యాలు పెంచి ఉపాధి అందించేందుకు కృషి చేయాలని కోరారు. యంగ్ ఇండియా స్కిల్ డెవలప్‌మెంట్ స్కూల్స్ దేశ వ్యాప్తంగా పెట్టినా ఎక్కడా అమలు కాలేదని చెప్పారు.

హైడ్రా మంచిదే.. మూసీ పునరుజ్జీవం హైదరాబాద్‌కు మంచి చేస్తుందన్న రేవంత్‌రెడ్డి ఆలోచన బాగుందని ప్రశంసించారు. ఆదివాసీ భూములు వారికి చెందే విధంగా చేస్తే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని సూచించారు.

ఉద్యమంలో సాగర్‌జీ పాత్ర ఎంతో గొప్పది : ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు

కరీంనగర్ జిల్లాకు దేశస్థాయిలో పేరు తెచ్చిన ఘనత విద్యాసాగర్‌రావు కు దక్కుతుందని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. కేంద్ర మంత్రిగా, గవ ర్నర్‌గా ఆయన చేసిన సేవలు గొప్పవని చెప్పారు. ప్రత్యేక తెలంగాణ రాష్ర్టం ఒక్కరో ఇద్దరో ముగ్గురితోనో రాలేదని.. విద్యాసాగర్‌రావు లాంటి చాలామంది నేతలు కృషి చేస్తేనే  వచ్చిందని స్పష్టంచేశారు.

సిద్ధాంతాలు వేరైనా తాము వ్యక్తిగత రాజకీయాలు చేయబోమని స్పష్టంచేశారు. కరీంనగర్ జిల్లా నుంచి పీవీ నరసింహారావు ప్రధానిగా పని చేశారని గుర్తుచేశారు. విద్యాసాగర్‌రావు కేంద్రమంత్రిగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు పేరు తీసుకువచ్చారని అన్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్మాణం కోసం విద్యాసాగర్‌రావు పాదయాత్ర చేశారని గుర్తుచేశారు.

రామగిరిఖిల్లాకు తాను అడగ్గానే రూ.10 లక్షలు ఇచ్చారని చెప్పారు. తమ నాన్న శ్రీపాదరావుకు.. విద్యాసాగర్‌రావు అత్యంత సన్నిహితులని గుర్తుచేసుకున్నారు. 

విద్యాసాగర్‌రావు కమిట్మెంట్ గొప్పది : హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ 

ఎలాంటి అమరికలు లేకుండా సీఎం రేవంత్‌రెడ్డి.. విద్యాసాగర్‌రావు పుస్తక ఆవిష్కరణకు రావడం శుభపరిణామమని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. సాగర్‌జీ కుటుంబంలో ఎక్కువమంది వామపక్ష భావాలతో ఉన్నవారేనని చెప్పారు. పేదల పట్ల, దళితుల పట్ల విద్యాసాగర్‌రావు అత్యంత అంకితభావంతో పనిచేశారని కొనియాడారు.

తాను సంఘటనా మంత్రిగా కరీంనగర్‌కు బస్సులో వెళ్లానని, అక్కడి నుంచి విద్యాసాగర్‌రావు కారులో తీసుకువెళ్లారని గుర్తుచే సుకున్నా రు. విద్యాసాగర్‌రావుకు, తనకూ ఎప్పుడు భేదాభిప్రాయాలు రాలేదన్నారు. 1999 నుంచి బీజేపీ దశ మారిందని చెప్పారు. జల్, జంగల్, జమీన్ అనే కార్యక్రమాన్ని విద్యాసాగర్‌రావు చేపట్టారని గుర్తుచేసుకున్నారు.

కేంద్రమంత్రి బండి సంజయ్ సామాన్య కార్యకర్త నుంచి ఈ స్థాయికి వచ్చారని అన్నారు. కలిసి ఉండి కలహించుకునే బదులుగా ప్రత్యేక రాష్ట్రంతో ఇరు ప్రాం తాల ప్రజలు సంతోషంగా ఉండాల ని సమైక్య రాష్ట్రంలో బీజేపీ ప్రయత్నం చేసిందని ఒడిశా గవర్నర్ హరిబాబు గుర్తుచేశారు. గిరిజనుల హక్కుల కోసం విద్యా సాగర్ రావు చేసిన ప్రయత్నం ఎంతో గొప్పదని, ఆయన స్ఫూర్తితో తాను ఒడిశాలో పనిచేస్తానని తెలిపారు.