calender_icon.png 1 March, 2025 | 7:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బంగారువాచి మాయం

01-03-2025 12:00:00 AM

ఆచార్య మసన చెన్నప్ప :

ఇంట్లో లేని ఆనందం బయట లభిస్తుందన్న కొందరి అభిప్రాయంలో నిజం లేకపోలేదు. అందుకే, చాలామం ది విహారయాత్రలపట్ల ఎక్కువ మక్కువ చూపుతారు. నేను ప్రగతి కళాశాలలో పని చేస్తున్న రోజుల్లో ఇలాంటి ఒక విహారయాత్ర ఆలోచన మా అధ్యాపకులకు వచ్చింది. ఇంకేం, పది మందిమి గండిపేటకు వెళ్దామని నిర్ణయించుకున్నాం. మా అందరికీ నాయకుడు అచలపతి.

ఒక్కొక్క ఆహార పదార్థాన్ని ఒక్కొ క్కరం ఇంట్లో తయారు చేయించుకుని రావాలి. వాటి బాధ్యతను ఎవరికి వారే తీసుకున్నాం. తాగే మంచినీరు సైతం ఎవరో ఒకరు తేవడం. మేం వెళ్లే రోజు రానే వచ్చింది. ఒక పన్నెండు సీట్ల వాహనం మాట్లాడుకున్నాం. అందరం సమానంగా చార్జీలు అందించాలి. ఉద యం 10 గంటల ప్రాంతంలో గండిపేటకు చేరుకున్నాం. అందరం మగరా యుళ్లమే. వెహికిల్ దిగిన వెంటనే కాఫీ తాగాం.

కొందరు చెట్లకింద కూర్చున్నా రు. మరి కొందరు క్యారమ్స్ ఆడుకుంటున్నారు. పది మందిమి కలిసి కబడ్డీ ఆడాం. తర్వాత తొలుత అచలపతి నీటిలోకి దూకాడు. వెనుకనే అందరం మెల్లమెల్లగా నీటిలోకి దిగి స్నానం చే శాం. అచలపతి బాగా ఈత గొట్టాడు. అందరికంటే ఎక్కువగా సంతోషాన్ని పొందుతూ, పంచిన వాడు తానే. నీళ్లలో చాలాసేపు ఉండడం వల్ల అతని శరీరంలో వణుకు ప్రారంభమైంది.

పక్కనున్న మేం గ్లూకోజ్ నీళ్లిచ్చాక, కుదుట పడ్డాడు. ఇంకా నయం, మాకెవరికీ మరే ఇబ్బందీ కలగలేదు. మొత్తం మీద అందరం గట్టుమీద కూర్చొని ఇళ్లనుంచి తెచ్చిన తినుబండారాలు ఒకరినుంచి ఒకరం అందించుకుంటూ ఆరగించాం. మా వెహికిల్ డ్రైవర్ కూడా మాతోపాటే నీళ్లలోకి దిగి స్నానం చేశాడు. మాలానే ఆనందించాడు. మేం తెచ్చుకున్న దానిలో కొంత పెడితే ఆరగిం చాడు.

అంతా కొంతసేపు విశ్రాంతి తీసుకున్నారు. మేమంతా ఆ రోజు పొందిన ఆనందం కాలేజీలో ఎన్నడూ పొందలేదనిపించింది నాకు. ఎన్నో విషయాలు మా ట్లాడుకున్నాం. బాల్యంలో జరిగిన సంఘటనలను ఎవరికి వారు వివరిస్తుంటే ఎంతో హాయి అనిపించిది. అందరం ఉపన్యాసకులమే కనుక మా సబ్జక్టుల విషయాలూ మాట్లాడుకు న్నాం. చర్చ రాజకీయాల మీదికి వెళ్లిం ది.

ఏ పార్టీ మంచిదనే విషయం కంటే ఏ నాయకుడు ఎంత మంచివాడనే దాని మీదే కాసేపు చర్చించుకున్నాం. కాసేపు, కాలేజీ ప్రిన్సిపాల్ వేదాచలం గురించీ మాట్లాడుకున్నాం. జూనియర్, డిగ్రీ, పీజీ కళాశాలలకు ఆయనే ప్రధాన ఆచార్యుడు.

మేనేజ్‌మెంట్ వారు పూర్తి స్వేచ్ఛ ఇవ్వడంతో ఆయన కాలేజీని తెలంగాణలోనే ఒక ఆదర్శంతమైన రీతి లో నడిపించారు. సాధారణంగా లెక్చరర్లు ప్రిన్సిపాల్‌పై ఏవో అభియోగాలు మోపుతుంటారు. మేమంతా విహారయాత్రలో ఆయన మంచితనాన్నే స్మరించుకున్నాం.

సగం సంతోషం, సగం దుఃఖం

ఎంత చక్కని అనుభూతి. లోతు లేని నీళ్లలో దిగడం, ఈత కొట్టడం, సరస్ప రం నీళ్లు చల్లుకోవడం.. మొదలైనవన్నీ మరచిపోలేని అనుభూతులు. ఎంతో ఆనందంగా గడిపిన రోజును తలచుకుంటూ అందరం వెహికిల్ ఎక్కాం. 

“ఎవరి వస్తువులు వారు జాగ్రత్తగా చూసుకున్నారుగా?” అన్నారు అచలపతి. అందరం ఒకసారి జాగ్రత్త పడ్డాం. అయితే, అప్పటికే మా వెహికిల్ గండిపేట నుంచి సిటీలోకి ఒక 10 మైళ్లు ప్రయాణించింది. ఇంతలో అచలపతి ఒక్కసారి అరిచినంత పనిచేశారు, తన ఎడమ చేయి మణికట్టు కేసి చూస్తూ 

“నా వాచి ఏది...?” 

ఆ మాటలు విని అంతా అవాక్క య్యాం. ‘అచలపతి వాచి ఎట్లా పోయిం ది? ఎక్కడ పోయింది?’ అనే ప్రశ్నలు మాలో తలెత్తాయి. ఆయన చేతికి నిజంగానే వాచి లేదు. 

“మీ బ్యాగులో ఉందేమో చూసుకోండి..” అన్నాను నేను. ఒకటికి రెండు సార్లు బ్యాగును పరిశీలించినా లాభం లేకపోయింది. వాచీ దొరకలేదు. 

‘వెనక్కి వెళ్లి గండిపేటలో దానిని వెదకలేం కదా’ అనిపించింది అందరికీ. మేమంతా గాభరా పడుతుంటే, ఆయనే మెల్లగా అన్నాడు 

“నేను వాచితోనే నీళ్లలోకి దిగాను. బహుశా అది నీళ్లలో పడిపోయి ఉం టుంది.” అందరం ఉసూరుమన్నాం. అచలపతి వాచి పోవడంతో ఆ రోజు మేం పొందిన ఆనందమంతా నీరుగారి పోయింది. 

“ఆ వాచిని నా పెళ్లినాడు మా మా మగారు బహుకరించారు. అది బంగా రు వాచి!” అన్నాడు. ఆ మాటలు వినేసరికి మాలో మిగిలిన కొద్ది సంతోషం కూడా ఆవిరైపోయింది.  ఉపన్యాసకు ల్లో టీవీరావు అనేఅతను అన్నాడిలా

“ఏం చేస్తాం!? సంతోషాన్ని పంచుకున్నట్లే దుఃఖాన్ని కూడా పంచు కోవా లి...” దానర్థం అందరికీ బోధ పడింది. 

“మనమంతా కలిసి అచలపతికి వా చి కొనిద్దాం” అని నేను ప్రతిపాదన వినిపించాను. దానికి అందరూ ఒప్పు కున్నారు. జీవితంలో ఎంత ఆనందమో అంత దుఃఖం. ఎప్పుడూ పూర్తిగా ఆనందం ఉండదు, పూర్తిగా దుఃఖమూ ఉండదు. మా విహారయాత్ర ఎట్లా ఆరంభమై ఎట్లా ముగిసిందో మర్నాడు మా కాలేజీ ప్రిన్సిపాల్‌కు వివరించాం. అప్పుడాయన ఒక మాట అన్నాడు 

”ఐతే.. మీకంతా వాచిపోయిందన్నమాట” అని. ఆయన మాటలకు మేం నవ్వుకోకుండా ఉండలేకపోయాం. 

    వ్యాసకర్త సెల్: 9885654381