- రెండు రోజుల్లో రూ.2,400 తగ్గుదల
- హైదరాబాద్‌లో తులం ధర రూ.77,240
హైదరాబాద్, నవంబర్ 26: ప్రపంచ బంగారం ధర భారీగా క్షీణించిన కారణంగా దేశీయంగానూ దిగివచ్చింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల తులం బంగారం ధర తిరిగి 77,000 స్థాయికి తగ్గింది. సోమవారం రూ.1,090 తగ్గగా, మంగళవారం మరో రూ.1,310 క్షీణించి రూ.77,240 వద్ద నిలిచింది. వరుస రెండు రోజుల్లో రూ.2,400 మేర తగ్గింది.
అంతక్రితం వరుస ఆరు రోజుల్లో ఇది దాదాపు రూ.4,000 వరకూ పెరిగిన సంగతి తెలిసిందే. తాజాగా హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల ఆభరణాల బంగారం 10 గ్రాముల ధర రూ.1,200 తగ్గి రూ.70,800 వద్దకు చేరింది. సోమవారం ఇది రూ.1,000 తగ్గగా, వరుస రెండు రోజుల్లో రూ.2,200 వరకూ దిగింది.
ప్రపంచ మార్కెట్లో
ఒకే రోజున 100 డాలర్లు పతనం
ఇజ్రాయిల్, హజ్బుల్లా మధ్య యుద్ధం ముగియనున్నదన్న వార్తలతో అంతర్జాతీయ మార్కెట్లో సోమవారం ఔన్సు పుత్తడి ఫ్యూచర్ 100డాలర్ల వరకూ తగ్గి 2,620 డాలర్ల వద్దకు పడిపోయింది. మధ్యప్రాచ్య ఉద్రిక్తతలు తగ్గే సంకేతాలు వెల్లడికావడంతో బంగారం ధర దిగుతున్నదని ఎల్‌కేపీ సెక్యూరిటీస్ కమోడిటీస్ వైస్ ప్రెసిడెంట్ జతిన్ త్రివేది చెప్పారు.
శరవేగంగా మారుతున్న అంతర్జాతీయ పరిణామాల కారణంగా రానున్న కొద్ది రోజుల్లో బంగారం ధరలు తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతాయని అంచనా వేస్తున్నట్లు తెలిపారు.
భారీగా తగ్గిన వెండి
బంగారం బాటలోనే వెండి ధర కూడా భారీగా తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో కేజీ వెండి ధర మంగళవారం రూ.2,500 తగ్గి రూ.98,500 వద్దకు చేరింది. సోమవారం ఇది రూ.500 తగ్గగా, వరుస రెండు రోజుల్లో రూ.3,000 వరకూ దిగింది. ప్రపంచ మార్కెట్లో ఔన్సు వెండి ధర 31 డాలర్ల దిగువకు పడిపోయింది.