ముంబై: దేశంలో బంగారం ధరలు ఎట్టకేలకు దిగివచ్చాయి. ఐదు రోజులుగా దూసుకెళ్లిన పసిడి రేట్లు నేడు నేల చూపు చూశాయి. గడిచిన ఐదు రోజుల్లో 10 గ్రాముల బంగారంపై రూ.2500 పైగా పెరిగింది. ధరలు కాస్త దిగొస్తే కొందామని ఎదు రుచూస్తున్న పసిడి ప్రియులకు తగ్గినరేట్లు ఊరట కల్పిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని హైదరాబాద్, విశాఖ పట్నం, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు వంటి ప్రాంతాల్లో ఈరోజు బంగారం 10 గ్రాముల ధరలు రూ.400 (22 క్యారెట్స్), రూ.440 (24 క్యారెట్స్) చొప్పున తగ్గాయి.
దీంతో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 77,050కు, 24 క్యారెట్ల పసిడి రేటు రూ. 84,050 వద్దకు దిగివచ్చాయి. దేశ రాజధాని ఢిల్లీ ప్రాంతంలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల రేటు రూ. 84,200 వద్దకు.. 22 క్యారెట్ల పసిడి ధర రూ.77,200 వద్దకు దిగివచ్చాయి. దేశవ్యాప్తంగా వెండి ధరల్లో ఎలాంటి కదలిక లేదు. ప్రస్తుతం హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో వెండి కేజీ ధర రూ.1,07,000 వద్ద, ఢిల్లీలో రూ. 99, 500 వద్ద నిలకడగా కొనసాగుతున్నాయి.